చిన్నదైనా, పెద్దదైనా, రీజనల్ మూవీ అయినా, పాన్ ఇండియా ఫిలిం అయినా ఎంతో కొంత బజ్ ఉన్న ఏ సినిమా వచ్చినా ముందు అందరి చూపు పడేది రివ్యూల పైనే. అభిమానులు అత్యుత్సాహం చూపిస్తారు కాబట్టి బెనిఫిట్ షోలు, మార్నింగ్ షోలు కాసులు కురిపిస్తాయి కానీ సాధారణ ప్రేక్షకులు వచ్చేది మాత్రం సినిమా గురించి కాస్త తెలుసుకున్నాకే. అసలే థియేటర్లలో బాదుడు బాగా పెరిగింది కనుక పాజిటివ్ టాక్ వస్తే తప్ప కామన్ ఆడియన్ కదలట్లేదు. దాంతో రివ్యూల ప్రభావం - రివ్యూవర్ల బాధ్యత రెండూ పెరిగాయి. ఆఫ్ కోర్సు అమ్ముడుపోయే విశ్లేషకులూ ఉన్నారు - నమ్మకాన్ని సొమ్ము చేసుకునే వెబ్ సైట్లూ కొన్ని ఉన్నాయి. అక్కడే కొడుతోంది తేడా. అదేంటంటే....
బాగున్న సినిమా బాలేదని ఎవరూ అనరు. అన్నా అసలు టాక్ తెలుసుకున్న జనం ఆగరు. అలాగే ఆశించినట్టు లేని సినిమాకి రేట్ ఇచ్చి కొనుక్కునే రేటింగ్ పనికిరాదు. లోపాయికారీ ఒప్పందాలు లోపాన్ని దాచలేవు. ఇదే డైజెస్ట్ కావట్లేదు ఇండస్ట్రీ జనాలకి.!
రీసెంట్ గా రాధే శ్యామ్ దర్శకుడు రాధా కృష్ణ కుమార్ మీడియాతో మాట్లాడుతూ ఆ చిత్రానికి నెగెటివ్ రివ్యూలు రావడం పట్ల అసహనం వ్యక్తం చేసారు. రివ్యూల కంటే రిజల్ట్ ముఖ్యమని అనేసారు. అయితే ఈ ప్రాసెస్ లో తన తొలి చిత్రానికి స్వచ్ఛందంగా వచ్చిన పాజిటివ్ రివ్యూలని మరిచారు. యావత్ సినీ ప్రేక్షకులు తెలుగు సినిమా వైపు తలతిప్పి చూస్తుంటే తెలుగు సినిమా లక్షణాలే లేకుండా చేసిన ప్రయత్నంలోని తడబాటుని, తప్పుని ఒప్పుకోలేకపోయారు.
అలాగే తమన్ కూడా.! క్రాక్, అఖండ, భీమ్లా సినిమాలకి తమన్ పెద్ద ఎస్సెట్ అని మీడియా కోడై కూసినపుడు లొట్టలు వేసుకుంటూ, రీ ట్వీట్లు కొట్టుకుంటూ, భుజాలు చరుచుకున్న తమన్ రాధే శ్యామ్ సినిమా స్పందనని మాత్రం తప్పు పడుతున్నారు. లవ్ స్టోరీ ఎలా ఉంటుందో కొటేషన్స్ చెబుతూ.. లెసన్స్ కోసం క్రిటిక్స్ తన కాలేజ్ లో జాయిన్ అవ్వాలి అనే రేంజ్ లో మాటలు జారుతుండడం గమనార్హం.
అసలు యునానిమస్ హిట్ టాక్ ని ఎంజాయ్ చేసే ఈ సినీ జనం మిక్స్ డ్ రెస్పాన్స్ ని కూడా హుందాగా స్వీకరించే రోజు ఎప్పటికైనా వచ్చేనా.?
వాళ్ళు చెప్పింది వినడము.. వాళ్లకి కావాల్సింది రాయడమే మీడియా మహత్తర బాధ్యత అనే భావజాలం మునుముందైనా కనుమరుగయ్యేనా.??
✍️-పర్వతనేని రాంబాబు.