భీమ్లానాయక్ డ్యానియేల్ శేఖర్ పాత్రతో మెప్పించిన రానా బుధవారం సినిమా గురించి ఆయన పాత్రకు వస్తున్న స్పందన గురించి మీడియాతో మాట్లాడారు.
భీమ్లానాయక్ విడుదల రోజు నేను ముంబైలో వేరే షూటింగ్‌లో ఉన్నా. షూట్ కంప్లీట్ అయ్యాక అక్కడ ఉన్న తెలుగు ఆడియన్స్‌తో సినిమా చూశా. అప్పటికే సోషల్ మీడియాలో సినిమా సూపర్‌హిట్ అని హడావిడి జరుగుతోంది. మిత్రులు, సినిమా పరిశ్రమ నుంచి ప్రశంసలు, అభినందనలతో అప్పటికే చాలా మెసేజ్‌లు వచ్చాయి. చాలా ఆనందంగా అనిపించింది.
ఇద్దరూ ఇద్దరే...
కల్యాణ్‌గారి లాంటి పెద్ద స్టార్ వచ్చి ఇలాంటి జానర్ సినిమా ట్రై చేస్తున్నారంటే కొత్తగా, ఎగ్జైటింగ్‌గా అనిపించింది. త్రివిక్రమ్‌గారు చాలా ఎగ్జైటింగ్ పర్సన్. ఏం మాట్లాడిన చాలా విలువైన మాటలాగా ఉంటుంది. నాలెడ్జ్ ఉన్న వ్యకి, భాష సంస్కృతి మీద మంచి పట్టు వుంది. మామూలుగా ప్రతి సినిమాతోనూ నేను చాలా నేర్చుకుంటాను. ఈ సినిమాతో త్రివిక్రమ్, పవన్‌కల్యాణ్ వల్ల చాలా నేర్చుకున్నా.
ఆయనతో బాగా కనెక్ట్ అయ్యా...
నా ఎక్స్‌పోజ్ సినిమానే. ప్రతి పాత్ర డిఫరెంట్‌గా ఉండాలనుకుంటా. డిఫరెంట్ ఆర్టిస్ట్‌లతో, కొత్త కథలు చేయాలనుకుంటా. అలాంటి వ్యక్తి పవన్‌కల్యాణ్. ఆయనతో నాకు పెద్దగా పరిచయం లేదు. కలిసింది కూడా తక్కువే. ఈ సినిమా అనుకున్నాక ఆయన నాకు బాగా కనెక్ట్ అయిపోయారు. చాలా నిజాయతీ ఉన్న వ్యక్తి.
భీమ్లానాయక్ చేశాక హీరోయిజం అంటే ఏంటో తెలిసింది.
త్రివిక్రమ్ వెన్నెముక...
ఒక సినిమాను రీమేక్ చేయాలంటే దాని వెనుక చాలా కష్టం ఉంటుంది. దాని మీద నాకూ అవగాహన ఉంది. ఎందుకంటే మా చిన్నాన్న వెంకటేశ్ చాలా రీమేక్‌లు చేశారు. మార్పుల చర్చలు ఎలా ఉండాయో బాబాయ్ దగ్గర వినేవాడిని. ఈ సినిమా విషయంలో మాత్రం త్రివిక్రమ్ చాలా కష్టపడ్డారు ఒరిజినల్ ఫ్లేవర్‌ను చెడగొట్టకుండా ఉన్న కథని మన వాళ్లకు నచ్చేలా ఎలా తీయాలో అలా చేశారు.
నో డామినేషన్...
ఇద్దరు హీరోలు తెరపై కనిపిస్తే.. ఒకడు మంచోడు.. మరొకడు తాగుబోతు అయితే.. చెడ్డవాడే నచ్చుతాడు. ఇక్కడా అదే జరిగి ఉంటుంది. ఇందులో డామినేటింగ్ ఏమీలేదు. డ్యాని పాత్ర కోసం నేను పెద్దగా కసరత్తులు ఏమీ చేయలేదు. డ్యాని ఎలా ఉండాలో అలాగే ఉన్నా. పవన్‌కల్యాణ్‌గారు కూడా అంతే! సింపుల్‌గా ఆ పాత్ర ఎలా ఉంటుందో అలాగే సెట్ లో ఉండేవారు.
ఆ ప్రయత్నం చేస్తా.
నేను చేసిన డ్యాని పాత్ర చూసి నాన్న చాలా సంతృప్తి చెందారు. ఆయన అలా చెప్పడం చాలా అరుదుగా జరుగుతుంది. బాహుబలి తర్వాత మళ్లీ ఈ సినిమాకే చాలా గొప్పగా చెప్పారు.