విక్రాంత్ పాత్ర చాలా రోజులు గుర్తుండి పోతుంది -సాగర్
మొగలి రేకులు సీరియల్‌తో బుల్లితెరపై తిరుగులేని గుర్తింపును సంపాదించుకున్నారు సాగర్ (ఆర్.కె నాయుడు). షాదీ ముబారక్‌తో బిగ్‌స్ర్కీన్‌పై హీరోగా సత్తా చాటారు. ప్రస్తుతం వినూత్నమైన కథాంశాల్ని ఎంచుకుంటూ సినీ రంగంలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. సోమవారం సాగర్ జన్మదినం ఈ సందర్భంగా సాగర్ చెప్పిన ముచ్చట్లివి..
👉షాదీ ముబారక్ సక్సెస్ తర్వాత ఎలాంటి కథతో సినిమా చేయాలి, ప్రేక్షకుల్ని ఎలా మెప్పించాలని చాలా ఆలోచించి 100 అనే సినిమాను అంగీకరించా. సామాజిక ఇతివృత్తంతో ఈ సినిమా తెరకెక్కుతోంది.
👉ప్రతి పౌరుడికి సామాజిక బాధ్యత ఉండాలని చాటిచెప్పే చిత్రమిది. అన్యాయాల పట్ల సామాన్యులు స్పందించాల్సిన అవసరం ఉందనే సందేశంతో రూపొందిస్తున్నాం.
👉మొగలిరేకులు సీరియల్‌లోని ఆర్ కె నాయుడు మరపించే పోలీస్ పాత్ర కోసం చాలా రోజులు ఎదురుచూశా. అలాంటి శక్తివంతమైన పాత్ర ఈ సినిమాలో దొరికింది. విక్రాంత్ అనే పోలీస్ అధికారిగా వినూత్నమైన క్యారెక్టరైజేషన్‌తో నేను కనిపిస్తా. చాలా రోజుల పాటు ఈ పాత్ర గుర్తుండిపోతుంది.
👉స్వీయ నిర్మాణ సంస్థ ఆర్ కె మీడియా వర్క్స్ పతాకంపై ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాం. సుకుమార్ ప్రొడక్షన్స్‌లో ఈ సినిమా చేయాల్సింది. అనివార్య కారణాల వల్ల ఆలస్యమవడంతో నేనే సొంతంగా నిర్మిస్తున్నా. ఓంకార్‌శశిధర్ దర్శకత్వం వహిస్తున్నారు.
👉సెప్టెంబర్‌లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం.
👉సీరియల్స్ నటుడిగా నాకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తీసుకొచ్చాయి. ఆ ఇమేజ్‌ను కాపాడుకుంటూ మంచి కథలతో ప్రేక్షకుల్ని మెప్పించాలని ప్రయత్నిస్తున్నా.
👉వైవిధ్యమైన కథలను ఎంచుకుంటే విజయాల్ని అందుకోవచ్చని షాదీముబాకర్ నిరూపించింది. ఈ సినిమా నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. హర్డ్‌వర్క్, అంకితభావంతో పనిచేస్తే ఏ రంగంలోనైనా రాణించవచ్చునని నమ్ముతా.
👉సీరియల్స్‌తో పాటు సినిమాల విషయంలో అదే సూత్రాన్ని ఫాలో అవుతున్నా. ఓటీటీ రాకతో భాషాపరమైన హద్దులన్నీ తొలగిపోయాయి.
👉కొత్త కథల్ని ఏ భాషలో చెప్పిన ప్రేక్షకులు చూస్తున్నారు. ఇది మంచి పరిణామం. నటనపై ఉన్న ఇష్టంతోనే నిర్మాతగా మారాను.
👉కెరీర్ విషయంలో నిర్మాతలు దిల్‌రాజు, శిరీష్‌తో పాటు దర్శకుడు సుకుమార్ చక్కటి సలహాలిస్తుంటారు. అవన్నీ నాకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.
👉పోలీస్, మాఫియా పాత్రలే కాకుండా సెన్సిటివ్, లవర్‌బాయ్ తరహా పాత్రలకు న్యాయం చేయగలనని నిరూపించుకోవాలనే ఆలోచనంతో కొంత విరామం తీసుకొని షాదీ ముబారక్ చేశా. ఇకపై గ్యాప్ తీసుకోకుండా సినిమాలు చేస్తా.
👉100 సినిమాతో పాటు మరో రెండు సినిమాల్ని అంగీకరించా. స్పై థ్రిల్లర్ జోనర్‌తో పాటు కుటుంబ కథాంశంతో ఈ సినిమాలు తెరకెక్కుతున్నాయి. ప్రస్తుతం ఈ మూడు సినిమాలపైనే పూర్తిగా దృష్టిపెట్టా.