మిస్టరీ యాక్షన్ ఎమోషనల్ డ్రామాగా రూపొందిన ‘వి’ అన్నీ వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తుంది - దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి
2004లో దర్శకుడిగా ‘గ్రహణం’ సినిమాతో కెరీర్‌ను ప్రారభించిన డైరెక్టర్ మోహనకృష్ణ ఇంద్రగంటి. 16 ఏళ్ల జర్నీలో ఈయన తెరకెక్కించినవి పది చిత్రాలే. అయితే అన్నీ సినిమాలు దేనికవే ప్రత్యేకమైనవి. ప్రస్తుతం మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘వి’. నేచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు, నివేదా థామస్, అదితి రావు హైదరి ప్రధాన పాత్రధారులుగా నటించారు. అష్టాచమ్మా, జెంటిల్‌మన్ చిత్రాల తర్వాత నేచురల్ స్టార్ నాని, మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్‌లో రూపొందిన హ్యాట్రిక్ మూవీ ఇది. సెప్టెంబర్ 5న ‘వి’ చిత్రం విడుదలవుతుంది.
ఈ సందర్భంగా పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ..
* ‘వి’ సినిమాను ముందుగా థియేటర్స్‌లో విడుదల చేయాలని అనుకున్నాం. కానీ ఇప్పుడు ఓటీటీలో విడులవుతుంది. సినిమాను ఓటీటీలో విడుదల చేసే క్రమంలో నేను, దిల్‌రాజుగారు, నాని సహా టీమ్‌తో చర్చించి ఓటీటీలో చేస్తేనే బెటర్ అని అనుకున్నాం. ‘వి’ సినిమాను ఇప్పటికే ఐదు నెలలుగా హోల్డ్ చేశాం. ప్రేక్షకుల్లో కూడా సినిమా విడుదలపై ఆసక్తి నెలకొంది. ఇంకా థియేటర్స్ ఓపెన్ చేసే విషయంలో క్లారిటీ లేదు. ఇంకా ప్రేక్షకులను ఎగ్జయిట్మెంట్‌ను హోల్డ్ చేయడం మంచిది కాదని ఆలోచించి నిర్ణయించుకున్నాం. ఓ రకంగా థియేటర్స్ కంటే ఓటీటీ వల్ల సినిమా 200 దేశాల్లో విడుదలవుతుంది. అందరికీ సినిమా చేరువ అవుతుంది. మొదటివారంలో సినిమా చూసేవాళ్లు మొదటి రోజునే సినిమా చూసే అవకాశం కలిగింది.
* ఒక టెక్నీషియన్‌గా నాకు సినిమాలను థియేటర్స్‌లో చూడటానికే ఇష్టం. ప్రేక్షకులు కూడా అంతే థియేటర్స్ ఎక్స్‌పీరియెన్స్ డిఫరెంట్ దీన్ని ఎవరూ మిస్ చేసుకోవాలనుకోరు. అయితే ప్రస్తుతం మనం చూస్తున్న పరిస్థితి చాలా ఇబ్బందికరమైనదనే చెప్పాలి. ఇలాంటి సందర్భంలో మన సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే మాధమ్యం ఓటీటీ.
* డైరెక్టర్‌గా నేను ఇప్పటి వరకు చేసిన సినిమాలతో పోల్చితే స్టైల్ పరంగా, స్కేల్ పరంగా ‘వి’ నాకొక ఛాలెజింగ్ మూవీ అనే చెప్పాలి. 5 రాష్ట్రాలతో పాటు థాయ్‌లాండ్‌లోనూ చిత్రీకరించాం. ఇంతకు ముందు నా సినిమాలను నేనింతలా లావిష్‌గా చేయలేదు. నేను తీసిన సినిమాల్లో నెక్స్ట్ రేంజ్ మూవీ అని చెప్పవచ్చు.
* ఓటీటీలకు నేను వ్యతిరేకంగా కాదు.. దీన్ని ఒక మాధ్యమంగానే చూడాలే తప్ప.. సినిమాతో పోల్చి చూడకూడదు. ఓటీటీలో సినిమాను విడుదల చేయడం వల్ల ఫస్ట్ డే మనం థియేటర్‌కు వెళ్లి సినిమా చూడటం, ఫస్ట్ డే కలెక్షన్స్, హంగామా అన్నింటినీ మిస్ అవుతున్నాం. ఓ సోషల్ ఎక్స్‌పీరియెన్స్‌ను మిస్ అవుతున్నాం. సినిమా రంగానికి సంబంధించి థియేటర్ ఎక్స్‌పీరియెన్స్ మిస్ అవుతున్నామని భావించేవాళ్లు చాలా మందే ఉన్నారు. నిర్మాత కె.ఎస్.రామారావుగారైతే నాకు ఫోన్ చేసి అదే విషయాన్ని చెప్పారు. కానీ పరిస్థితులకు అనుగుణంగా మేం తీసుకున్న నిర్ణయం మంచిదేనని ఆయన అభినందించారు.
* నేను చేసిన యాక్టర్స్‌తోనే సినిమా చేయడానికి కారణం కంఫర్ట్ జోన్‌లో ఉండటానికే అని భావిస్తాను. నాకేం కావాలో యాక్టర్స్‌గా వాళ్లకు బాగా తెలుసు. అలాగే నా పాత్రలకు కూడా వాళ్లు సూట్ అవుతారనిపిస్తే వాళ్లని అప్రోచ్ అవుతాను. సినిమాటోగ్రాఫర్ విందాతోనూ నాకు మంచి వేవ్ లెంగ్త్ కుదిరింది. నాకేం కావాలి? ఎలా కావాలి? అని అతనికి బాగా తెలుసు. నేను పెద్దగా వివరించనక్కర్లేదు. ఓ టెక్నీషియన్‌గా తన పొటెన్షియల్‌ను పూర్తి స్థాయిలో చూపించే సినిమా ఇది.
* ‘వి’ అనే టైటిల్‌ను ఎందుకు పెట్టాం? అనే విషయం తెలియాలంటే సినిమా చూడాల్సిందే. టైటిల్ గురించి నేనేదో చెప్పినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఆ వార్తల్లో నిజం లేదు.
* రీసెంట్‌గా రిలీజైన ట్రైలర్‌లో ఆదితిరావు హైదరిని చూపించకపోవడానికి కారణం ఉంది. సినిమా చూడాల్సిందే.
* టెక్నికల్ డిజిటల్ మాధ్యమాల్లో సినిమా చూసే సమయంలో ఫోన్‌లో ఒకలా, టాబ్‌లో మరోలా, లాప్‌టాప్‌లో మరో రకంగా.. ఇలా వేరియేషన్స ఉంటాయి. దాన్ని బేస్ చేసుకుని బ్రైట్ నెస్, సౌండ్ ఎలా ఉంది అని చెక్ చేసుకుని ముందుకెళ్లాం. వీలైనంత థియేటర్స్ ఎక్స్‌పీరియెన్స్‌ను ప్రేక్షకుడికి అందించడానికి ప్రయత్నించాం.
* దిల్ రాజుగారు అగ్ర నిర్మాత.. డిస్టిబ్యూటర్, ఎగ్జిబిటర్, బయ్యర్ .. అన్నింటిలో అనుభవం ఉంది. నిర్మాతగా ఏం చేయాలనే విషయంపై ఆయన చాలా క్లారిటీగా ఉన్నారు. థియేటర్‌లో కాకుండా ‘వి’ సినిమాఓటీటీలో విడుదలవుతున్నందుకు ఆయనకు చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే ఇది వరకు చెప్పినట్లు థియేటర్స్ కోసం ఐదు నెలలుగా వెయిట్ చేశాం. నేను, నాని అడగటంతో ఆయన ఇన్నిరోజులు ఆగారు. కానీ థియేటర్స్ ఓపెన్ అయ్యే విషయంలో ఓ క్లారిటీ లేదు. దీంతో ఇంకా ఆయన్ని వెయిట్ చేయమని చెప్పడంలో అర్థంలేదనిపించింది.
* నాని ‘అష్టాచమ్మా’ విడుదల తేదీకే తను నటించిన ‘వి’ సినిమా వస్తుంది. యాదృచ్చికమే. అమెజాన్ చెప్పిన డేట్ ఇది. నాని, నేను కలిసి చేసిన మూడో సినిమా, నాని, దిల్ రాజు చేసిన మూడో సినిమా. ఇలా అన్నీ ఫ్యాక్టర్స్ కలిశాయి. ఈ రిలీజ్ డేట్‌ను అమెజాన్ ప్రైమ్ వాళ్లే నిర్ణయించారు. నిజానికి ఈ సినిమాను 2019 డిసెంబర్‌లో విడుదల చేయాలనుకున్నాం. అంతలో మా నాన్నగారు కాలం చేయడంతో నాకు రెండు నెలలు బ్రేక్ పడింది. అది 2020కి పోస్ట్ పోన్ అయ్యింది.
* నేను నానికి కథ చెప్పగానే రెండు పాత్రల గురించి చెప్పాను. నేను ఏ పాత్ర చేస్తే బావుంటుందని నాని అడిగితే , నెగటివ్ షేడ్ ఉండే రోల్ చేయమని చెప్పాను. తను కూడా ఆ పాత్రనే చేయాలనుకుంటున్నానని చెప్పాడు. కథ చెప్పే సమయంలో అది నాని 25వ సినిమా అని నాకు తెలియదు. తెలిసిన తర్వాత ‘నీకు ఓకేనా’ అని నాని అడిగితే ‘నా 25వ సినిమాను మీతో కలిసి చేయడం హ్యాపీగా ఉందండి’ అని నాని చెప్పాడు.
* నాని నాతో అష్టాచమ్మా చేసేటప్పటికీ వి సినిమా చేసే సమయానికి యాక్టర్‌గా చాలా పరిణితి చెందాడు. బేసిక్‌గా నాని రిస్క్ చేయడానికి భయపడడు. ఉదాహరణకు జెర్సీ సినిమానే అందుకు కారణం. తనకు క్యారెక్టర్ నచ్చితే చాలు. తన పాత్ర ఎంత నిడివి ఉందని కూడా చూడకుండా యాక్ట్ చేస్తాడు. బేషజాలు లేని యాక్టర్.
* నాని, సుధీర్‌బాబుతో ముందు నుండి ఉన్న వేవ్ లెంగ్త్ కారణంగా వారితోనే సినిమా చేయాలనుకున్నాను. ఇద్దరూ కలిసిపోయి, పాత్రలను అర్థం చేసుకుని యాక్ట్ చేస్తారు. కాబట్టి నాకు ‘వి’ సినిమా చేయడం సులభమైంది. సుధీర్‌బాబుకు మంచి యాక్షన్ ఇమేజ్ ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని తనతో ఓ మంచి ఫైట్‌ను తీశాను.సినిమా ప్రారంభంలో ఫైట్ వస్తుంది. అది కూడా కథలో భాగంగానే ఉంటుంది. స్పెషల్‌గా డిజైన్ చేసి చేసిన ఫైట్ అది. యాక్షన్ సన్నివేశాలు నాని, సుధీర్ మధ్య చాలా రేసీగా ఉంటాయి. అలాగే సుధీర్ బాబు డాన్సును కూడా ఓ సాంగ్‌లో చూడొచ్చు. నాని, సుధీర్ మధ్య సన్నివేశాలు చాలా ఎమోషనల్‌గానూ ఉంటాయి.
* పెద్ద హీరోలతో పనిచేయాలంటే కాస్త భయంగా ఉంటుంది. అందుకు కారణం వారికి ఉండే ఇమేజ్, వారి సినిమాలపై అంచనాలు, అభిమానుల కోరుకునే అంశాలు వేరుగా ఉంటాయి. నేను ముందు కథ రాసుకుని హీరో ఎవరని ఆలోచిస్తాను.
* సినిమా మ్యూజిక్, బ్యాగ్రౌండ్ స్కోర్‌ను అమిత్ త్రివేదినే చేయాలనుకున్నారు. కానీ వేరే కమిట్‌మెంట్ ఉండటం వల్ల తను మధ్యలో వెళ్లిపోవాల్సి వచ్చింది. ఆ సమయంలో మాకు తమన్‌ను సంప్రదిస్తే ఎలా ఉంటుందని ఆలోచించాం. తను అప్పుడు అల వైకుంఠపురములో సక్సెస్ మీదున్నాడు. మేం అడగ్గానే సరేనని త్వరగా చేసి పెట్టేశాడు.
* ‘వి’ ఒక మిస్టరీ యాక్షన్ ఎమోషనల్ డ్రామా. అందరినీ మెప్పించేలా ఉంటుంది. ఈ సినిమా క్లైమాక్స్ చూస్తే అందరికీ సీక్వెల్ ఉంటుందనే అనుమానం వస్తుంది. అయితే దీని సీక్వెల్ గురించి నేను ఆలోచించలేదు.
* వెబ్ సిరీస్‌లను ఓ యజ్ఞంలా చేయాలి. ఓ పది ఎపిసోడ్స్ చేయాలి. ఇప్పుడు మూడు నాలుగు కమిట్‌మెంట్స్ ఉండటంతో అంత సమయం కేటాయించలేను. అయితే సప్తభూమి అనే బుక్‌ను వెబ్ సిరీస్‌గా చేస్తే బావుంటుందనే ఆలోచనైతే వచ్చింది. మరి వెబ్ సిరీస్ చేయలా? సినిమా చేయాలా అని ఆలోచిస్తున్నాను.
* మూడు, నాలుగు సినిమాలు చేయడానికి కమిట్ అయ్యాను. అవి పూర్తయిన తర్వాత దిల్‌రాజుగారి బ్యానర్‌లో మరో సినిమా చేస్తాను. అలాగే విజయ్ దేవరకొండ సినిమా చేయాల్సి ఉంది. అయితే ముందు విజయ్, పూరి సినిమా పూర్తి కావాలి, తర్వాత మరో కమిట్ మెంట్ ఉంది... దాని తర్వాతే మా సినిమా ఉంటుంది.