‘భీష్మ’గా అందర్నీ నవ్విస్తా!- హీరో నితిన్
నేను మీమ్స్ క్రియేట్ చేసే క్యారెక్టర్ చేశాను. అందుకే ‘భీష్మ’లో ప్రతి సీనూ ఫన్నీగా ఉంటుంది. విలన్‌కు వార్నింగ్ ఇవ్వడంలోనూ ఆ క్యారెక్టరైజేషన్ కనిపిస్తుంది. మంచి రోల్.. అని చెప్పారు నితిన్. ఆయన హీరోగా వెంకీ కుడుముల డైరెక్ట్ చేసిన సినిమా ‘భీష్మ’. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. రష్మికా మందన్న నాయిక. ఫిబ్రవరి 21న సినిమా విడుదలవుతోంది. ఈ సందర్భంగా బుధవారం మీడియాతో సంభాషించారు నితిన్. ఆ విశేషాలు...
‘భీష్మ’ ..... ఈ కథ ఎప్పుడు ఓకే చేశారు?
నేను ‘శ్రీనివాస కల్యాణం’ చేసేటప్పుడు డైరెక్టర్ వెంకీ కుడుముల ఈ లైన్ చెప్పాడు. నాకు నచ్చింది. దాన్ని డెవలప్ చెయ్యడానికి సంవత్సరం టైం తీసుకున్నాడు. మునుపటి మూడు సినిమాలు ఆడలేదు కాబట్టి, ఈసారి స్క్రిప్ట్ పక్కాగా లాక్ చేసుకున్నాకే మొదలు పెడదామని అనుకున్నా. ఈ టైంలోనే ‘రంగ్ దే’ స్క్రిప్ట్, చంద్రశేఖర్ యేలేటి సినిమా స్క్రిప్ట్ కూడా విని ఓకే చేశాను. వాటి పూర్తి స్క్రిప్టులు అయ్యాకే మూడింటినీ మొదలుపెట్టాను. అలాగే కృష్ణచైతన్య చెప్పిన ‘పవర్ పేట’ స్క్రిప్ట్, హిందీ సినిమా ‘అంధాధున్’ రీమేక్ కూడా ఓకే చేశాను. ఈ ఏడాది బహుశా నావి నాలుగు సినిమాలు విడుదలవుతాయి.
‘భీష్మ’ ఎలా ఉంటుంది?
‘దిల్’ తర్వాత నేను చేసిన లవ్ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్. యాక్షన్ కూడా మిళితమై ఉంటుంది. ఇందులో ఆర్గానిక్ వ్యవసాయం అనేది ప్రధానాంశం కాదు. అది కథలో ఒక ఎలిమెంట్ మాత్రమే. భీష్మ ఆర్గానిక్స్ అనే కంపెనీ ఉంటుంది. అందులో నేనొక ఉద్యోగిని. ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే దాని గురించిన సినిమా అని అంటారేమోనని దాన్ని ప్రమోషన్స్‌లో ఎలివేట్ చెయ్యలేదు.
ట్రైలర్లో ఒక ఫైట్ ‘అతడు’లోని పొలం ఫైట్ ను గుర్తు చేస్తోంది. దాని స్ఫూర్తితో తీశారా?
కరక్టే. ‘అతడు’లోని పొలం ఫైట్‌ను దృష్టిలో ఉంచుకొనే దాన్ని తీశాం. అది ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది.
సంగీతానికి ప్రాముఖ్యం ఉన్నట్లు కనిపిస్తోంది...
అవునండీ. మహతి స్వరసాగర్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ‘వాటే బ్యూటీ’ కానీ, ‘సరాసరి గుండెల్లో’ కానీ, సింగిల్స్ యాంథెం కానీ.. చాలా బాగా మ్యూజిక్ ఇచ్చాడు. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అయితే ఇంకా బాగా ఇచ్చాడు.
మొదట మహతిని కాకుండా వేరే చాయిస్‌కు వెళ్దామని మీరు అన్నట్లు వినిపించింది నిజమేనా?
నిజమే. అంతా ‘ఛలో’ టీం అయిపోతోందని, మహతినైనా మార్చమని వెంకీకి చెప్పా. మహతితో తనకు బాగా సింకవుతుందనీ, అతడితోనే మ్యూజిక్ చేయిద్దామనీ వెంకీ అనడంతో సరేనన్నా. మహతి కూడా మంచి మ్యూజిక్ ఇచ్చి వెంకీ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాడు.
డాన్సుల గురించి కూడా ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు?
చివరిగా ‘గుండెజారి గల్లంతయ్యిందే’లో ఎక్కువ డాన్స్ చేశా. ఆ తర్వాత సినిమాల్లో చిన్న చిన్న స్టెప్స్ ఉన్నాయి కానీ ఎక్కువ డాన్స్ చెయ్యలేదు. ఈ సినిమాకు ముందే అనుకొని డాన్స్ చేసాం. తెరమీద నా డాన్స్ చూసినవాళ్లు కచ్చితంగా ఇష్టపడతారు.
రష్మికతో పనిచేయడంపై ఏమంటారు?
తెరపై రష్మిక అద్భుతంగా ఉంది. చక్కని నటి. మా మధ్య కెమిస్ట్రీ బాగుందని అందరూ అంటున్నారు.
మీ ప్రతి సినిమాలో పవన్ కల్యాణ్ ప్రస్తావన వస్తూనే ఉంటుంది. ఎందుకట్టా... ప్రమోషన్ కోసమేనా?
‘జయం’ నుంచి నా ప్రతి సినిమాలో ఆయన ప్రస్తావన ఉంది. ఆయన పాటో, ట్యూనో, పోస్టరో, డైలాగో.. ఉంటూ ఉంది. ‘ఇష్క్’తో సక్సెస్ వచ్చాక దాని గురించి మాట్లాడుతూ ఉన్నారు. అది ఆయనపై నాకున్న ప్రేమ. నేను ఆయనకు స్వచ్ఛమైన అభిమానిని. మీరు ఎంత దాని గురించి రాసినా దాన్ని పెడుతూనే ఉన్నా. అది నా లవ్. అంతే!
‘భీష్మ’ చేసే టైంలోనే మరో రెండు సినిమాలూ చేస్తుంటే, క్యారెక్టర్స్ విషయంలో కన్ఫ్యూజ్ అవలేదా?
ఒక్కో డైరెక్టర్‌ది ఒక్కో స్టైల్ కాబట్టి కన్ఫ్యూజ్ కాలేదు. వెంకీ కుడుములకు డైలాగ్స్ చెప్పేటప్పుడు కళ్లార్పడం ఇష్టముండదు. అదే యేలేటి గారైతే, కళ్లు ఆర్పమంటాడు. ఎప్పుడైనా కాస్త కన్ఫ్యూజ్ అయినా ఆ డైరెక్టర్లే మళ్లీ తమ క్యారెక్టర్‌లోకి నన్ను తీసుకొచ్చేవాళ్లు. కానీ ఇంకెప్పుడూ లైఫ్‌లో ఒకేసారి మూడు సినిమాలు చెయ్యనండీ బాబూ.. నిద్ర లేదు, రెస్ట్ లేదు. ఎప్పుడైనా ఒకరోజు గ్యాప్ వస్తే, ఆ రోజు తమకు కావాలని ముగ్గురూ కొట్టుకొనేవాళ్లు. ఇప్పుడు ‘భీష్మ’ అయిపోవడంతో కాస్త ప్రశాంతంగా ఉంది. యేలేటిగారితో చేస్తున్న సినిమా పేరు ‘చెక్’. చెస్ ఆటలో ‘చెక్’ అనే మాట వస్తుంది కదా.. అదే.
నిర్మాణ విలువల గురించి ఏం చెబుతారు?
సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లో వరుసగా సినిమాలు చేస్తున్నానంటేనే ఈ బ్యానర్ అంటే ఎంత ఇష్టపడుతున్నానో మీరే ఊహించుకోండి. వీళ్లు తీసే అన్ని సినిమాల్లో నిర్మాణ విలువలు హై లెవల్లో ఉంటాయి. ‘అఆ’ మూవీ నుంచి ఈ బ్యానర్‌తో నా జర్నీ మొదలైంది. ‘భీష్మ’ తర్వాత మళ్లీ ఇదే బ్యానర్‌తో ‘రంగ్ దే’ చేస్తున్నా. దాని తర్వాత కూడా మరో సినిమా చేద్దామని నిర్మాత నాగవంశీ అంటున్నారు.
‘జయం’ నుంచి ఎక్కువగా లవ్ స్టోరీలే చేస్తూ వచ్చారు. బోర్ అనిపించలేదా?
కథలన్నీ ఒకదానికొకటి భిన్నమైనవి కాబట్టి బోరేమీ ఫీలవలేదు. ఇప్పుడు డిఫరెంట్ గా చెయ్యాలనే ఉద్దేశంతోనే యేలేటిగారి సినిమా చేస్తున్నా. ‘అంధాధున్’ డిఫరెంట్ సినిమా, ‘పవర్ పేట’ డిఫరెంట్ సినిమా. నేను కూడా లవ్ స్టోరీస్ తగ్గించే ఆలోచనలో ఉన్నాను. ‘రంగ్ దే’ లవ్ స్టోరీ అయినప్పటికీ, ఆ కథ నాకు బాగా నచ్చేసింది. అందులో నేను 24 ఏళ్ల యువకుడిగా కనిపిస్తా. మళ్లా అలాంటి క్యారెక్టర్ చెయ్యలేను కాబట్టి ఒప్పుకున్నా.
పెళ్లి ఫిక్సయినందుకు కంగ్రాట్స్. పెళ్లి ఎప్పుడు, ఎక్కడ.. ఆ వివరాలు చెప్తారా?
దుబాయ్‌లో ఏప్రిల్ 15న నిశ్చితార్థం, 16న కొద్దిమంది సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో పెళ్లిచేసుకోబోతున్నాం. 21న హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేస్తున్నాం. 2012లో ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా శాలిని పరిచయమయ్యింది. అది స్నేహంగా, తర్వాత ప్రేమగా మారింది. నేనే తనకు తొలిసారి నా ప్రేమను వ్యక్తం చేశా. తనూ యాక్సెప్ట్ చేసింది. గత సంవత్సరం ఇద్దరం ఇంట్లోవాళ్లకు ఈ విషయం చెప్పాం. అప్పటి దాకా వాళ్లకూ ఈ విషయం తెలీదు. నిజానికి మూడేళ్ల క్రితమే పెళ్లి చేసుకోవాల్సింది. కానీ మ్యారేజ్ అనేది జీవితంలో పెద్ద స్టెప్ కాబట్టి, ఆలోచించుకొని ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను.
ఒక ప్లాన్ ప్రకారమే మేం ఎక్కడా మా ప్రేమను బయట వ్యక్తం చెయ్యకుండా ఉంచగలిగాం. మీడియా అటెన్షన్ ఒద్దనుకున్నాం. డెస్టినేషన్ వెడ్డింగ్ అనేది నా ఆలోచన కాదు. శాలిని, ఆమె తల్లిదండ్రులు, మా అమ్మానాన్నల ఆలోచన. బ్యాచిలర్ లైఫ్ ముగిసిపోతోందంటే.. నాకంటే నా తోటి హీరోలు చాలా ఆనందపడుతున్నారు. నాని ‘దా దా’ అంటున్నాడు. రానా, వరుణ్ తేజ్ కూడా కామెంట్ చేస్తున్నారు. నాకైతే ఇప్పటికే చాలా లేటైపోయిందనిపిస్తోంది.