ఇంటర్వ్యూ: అఖిల్ అక్కినేని (మిస్టర్ మజ్ను)


‘మిస్టర్‌ మజ్ను’ అన్నీ వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే లవ్‌ అండ్‌ ఫ్యామిలీ ఎమోషనల్‌ ఎంటర్‌టైనర్‌ - అఖిల్‌ అక్కినేని

అఖిల్‌ అక్కినేని హీరోగా శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై ‘తొలిప్రేమ’ ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వంలో భారీ నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ నిర్మించిన యూత్‌పుల్‌ ఎంటర్‌టైనర్‌ ‘మిస్టర్‌ మజ్ను’. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిపబ్లిక్‌ డే సందర్భంగా ఒకరోజు ముందు జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా అఖిల్‌ అక్కినేని ఇంటర్వ్యూ... 

‘మిస్టర్‌ మజ్ను’ సినిమా ఎలా ప్రాసెస్‌ అయ్యింది? 

- వెంకీ స్క్రిప్ట్‌ చెప్పినప్పుడు నాన్నకు నచ్చుతుందో.. లేదో కూడా నాకు తెలియదు. అయితే అప్పటికే ఓ సినిమా కమిట్‌ అయ్యాను. అది పూర్తి కావడానికి ఏడాదిన్నర సమయం పడుతుంది. ఆలోపు మరేదైనా సినిమా చేసుకుంటే చేసుకోమని వెంకీకి చెప్పాను. తను కూడా ఏడాదిన్నర పాటు ఖాళీగా ఉండటం ఎందుకు? మరో సినిమా చేసుకుంటాను అని చెప్పాడు. అయితే ఈ స్క్రిప్ట్‌ మాత్రం నా కోసం పక్కన పెడతానని చెప్పాడు. అన్నట్లుగానే పక్కన పెట్టాడు. 

కథ వినగానే ఏ ఎలిమెంట్స్‌ నచ్చాయి? 

- ఇది క్యారెక్టర్‌ బేస్‌డ్‌ స్క్రిప్ట్‌ కావడంతో నాకు వినగానే నచ్చేసింది. నేను చేసిన నా రెండు సినిమాల్లోని క్యారెక్టర్స్‌కు కంప్లీట్‌ అపోజిట్‌ రోల్‌ ఈ సినిమాలో చేశాను. కాబట్టి వినగానే నచ్చింది. ఈ సినిమాలో లవ్‌స్టోరీ కాస్త సినిమా కథ స్టార్ట్‌ అయిన తర్వాత స్టార్ట్‌ అవుతుంది. ముందు అంతా ఫ్యామిలీ ఎమోషన్స్‌ ఉంటాయి. విక్కీ అనే క్యారెక్టర్‌ను రిజిష్టర్‌ చేయడానికి ఎనర్జిటిక్‌ పెర్ఫామెన్స్‌ అవసరం. కాబట్టి క్యారెక్టర్‌ రిజిష్టర్‌ అయిన తర్వాత కథలోకి వెళతాం. నటుడిగా నాకు చాలెంజింగ్‌గా అనిపిస్తుంది. 

పెద్ద ఫ్యామిలీ హీరో కదా! ప్రెషర్‌ ఫీల్‌ కాలేదా? 

- నటుడిగా నేను ఎంట్రీ ఇచ్చినప్పుడు భారీ అంచనాలుండటంతో ఆ ప్రెషర్‌ నా శత్రువుగా మారింది. నేను ఆ విషయాన్ని నిజాయతీగా ఒప్పుకుంటాను. అందుకనే నేను అంచనాలను రీచ్‌ కావడానికి ప్రయత్నించడం లేదు. నేను నచ్చిన సినిమాలు చేయడానికి ప్రాధాన్యత ఇస్తున్నాను. అది ఒకేసారి కాకుండా ఒక్కొక్క మెట్టుగా ముందుకు వెళుతున్నాను. 

కథకు ఇన్‌స్పిరేషన్‌ ఏంటి? 

- ‘మిస్టర్‌ మజ్ను’ విషయానికి వస్తే ఇది ఎంటర్‌టైనింగ్‌ మూవీ. ఫ్యామిలీ ఎమోషన్స్‌ ఉన్నాయి. ఎంటర్‌టైన్‌ సినిమాలకు మంచి ఆదరణ ఉంటాయి. తాతగారి క్లాసిక్‌ సినిమాను బేస్‌ చేసుకుని... డైరెక్టర్‌ వెంకీ నేటి స్టైల్‌కు తగ్గట్లు మార్చి రాశారు. త్రివిక్రమ్‌గారి సినిమాలను చూసి ఇన్‌స్పైర్‌ అయిన వెంకీ సన్నివేశాలను ఎక్కడా కాపీ కొట్టలేదు. ఇన్‌స్పిరేషన్‌తో రాసుకున్నాడు. సినిమాలో ఓ ట్రావెల్‌ ఉంటుంది. కాబట్టి సినిమాను 40 రోజులు విదేశాల్లో చిత్రీకరించాం. వెంకీ హార్డ్‌కోర్‌ అక్కినేని ఫ్యాన్‌. విక్కీ అనే క్యారెక్టర్‌ ‘ప్రేమ్‌నగర్‌’ సినిమా నుండి ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుని వెంకీ కథను తయారు చేశాడు. 

వెంకీతో పదేళ్ల పరిచయం అన్నారుగా? తన వర్కింగ్‌ స్టయిల్‌ గురించి చెప్పండి? 

- వెంకీ నాకు పదేళ్లుగా తెలుసు. అయితే కామన్‌గా తెలుసు. కలిసినప్పుడు మాట్లాడుకునేవాళ్లం. అయితే ఈ సినిమా పరంగా మూడేళ్లుగా తనతో ఎక్కువగా జర్నీ చేశాను. ఇప్పుడు తను క్లోజ్‌ ఫ్రెండ్‌గా మారాడు. ఈ సినిమా పరంగా వెంకీ నన్ను కొత్తగా చూపించే ప్రయత్నం చేశాడు. సినిమా సెట్స్‌కు వెళ్లడానికి ముందు వెంకీ, నేను మాట్లాడుకున్నాం. చిన్న చిన్న విషయాలు కూడా తన కేర్‌ తీసుకుని చేశాడు. షూటింగ్‌ సమయాల్లో ఇద్దరం డిస్కస్‌ చేసుకునేవాళ్లం. వెంకీ నాతో లవ్‌స్టోరీ చేయాలనుకున్నా తర్వాత సింపుల్‌ మేనర్‌లో కాకుండా లార్జర్‌ స్కేల్‌లో సినిమా చేయాలనుకున్నట్లు నాకు చెప్పాడు.. అందుకోసం ఫ్యామిలీ ఎమోషన్స్‌, ఫైట్స్‌ను యాడ్‌ చేశాడు. సినిమాను గ్రాండ్‌గా తెరకెక్కించాడు. కుటుంబంలో అందరూ కలిసి చూసే మంచి లవ్‌ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌. 

తాతగారు.. తర్వాత నాన్నగారు.. ఇప్పుడు మీరు మజ్ను టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారుగా! వాళ్లిద్దరి టైటిల్‌ను మీ సినిమాకు పెడుతుంటే టెన్షన్‌ అనిపించిందా? 

- టెన్షన్‌గా ఏమీ అనిపించలేదు. సాధారణంగా మజ్ను అంటే ట్రాజిక్‌ ఆలోచనలు వచ్చేస్తాయి. ఇక్కడ ట్రాజిక్‌ విషయాలు ఉండవు.. ఓ కుర్రాడు జర్నీ గురించి చెబుతున్నాం కాబట్టి ‘మిస్టర్‌ మజ్ను’ అనే టైటిల్‌ను పెట్టాం. అతను అమ్మాయిలను ప్రేమిస్తాడు.. అమ్మాయిలు అతన్ని ప్రేమిస్తారు. మెయిన్‌గా చెప్పాలంటే ప్ల్లేబోయ్‌లాంటి కుర్రాడు లవర్‌బోయ్‌లా ఎలా మారాడనేదే కథ. మజ్ను అనే టైటిల్‌ మా ఫ్యామిలీకి బాగా కలిసొచ్చింది. దాన్ని నేను క్యారీ చేశాను. సినిమా హిట్‌ అయితే గర్వంగా ఫీలవుతాను. 

‘బాయ్స్‌ విల్‌ బి బాయ్స్‌’ అనే క్యాప్షన్‌కు అర్థమేంటి? 

- డైరెక్టర్‌ వెంకీ పెట్టిన క్యాప్షన్‌ ఇది. బాయ్స్‌ విల్‌ బి బాయ్స్‌ అనే క్యాప్షన్‌ను పెట్టడానికి కారణం తెలుసుకోవడానికి సినిమా చూడాల్సిందే. దానికి న్యాయం చేసేలా రెండు, మూడు చిన్న ట్విస్ట్‌లుంటాయి. దాని వల్ల బాయ్స్‌ విల్‌ బి బాయ్స్‌ అని ఎందుకు పెట్టామనేది కన్‌వే అవుతుంది. 

వెంకీ ‘తొలిప్రేమ’ హిట్‌ తర్వాత స్క్రిప్ట్‌లో చేంజస్‌ చేశారా? 

- లేదండి.. వెంకీ ‘తొలిప్రేమ’ తర్వాత మా స్క్రిప్ట్‌లో ఎలాంటి మార్పులు లేవు. లొకేషన్‌ పరంగా అమెరికా నుండి లండన్‌కు మార్చేమంతే. 

నాన్న(నాగార్జున) సినిమా చూశారా? 

- సాధారణంగా స్క్రిప్ట్‌ స్టేజ్‌లో నాన్నగారు వింటారు. అలాగే ఈ కథను కూడా విన్నారు. ఆయనకేమైనా డౌట్‌ అనిపిస్తే చేంజస్‌ చేసుకోమని సలహాలు మాత్రమే ఇస్తారు. ఈ సినిమా చూసే సమయంలో కూడా ఓ సీన్‌ దగ్గర ఆయనకు చిన్న డౌట్‌ వచ్చింది. దాన్ని ఆయన చెప్పారు. లింక్‌ రావడం లేదని అప్పటికే నాకు, వెంకీ కూడా అనిపించడంతో చిన్న సీన్‌ను రీ షూట్‌ చేశాం. సాధారణంగా సినిమాతో మేం ఎక్కువగా ట్రావెల్‌ చేయడం వల్ల సినిమాను ఎక్కువగా ప్రేమించేస్తాం. దాని వల్ల డిస్‌కనెక్ట్‌గా ఉండే వ్యక్తికి సినిమా చూపిస్తే దానిలో లోటు పాట్లు తెలుస్తాయి కదా. అందుకనే నాన్నగారికి సినిమా చూపించాం. 

సిక్స్‌ ప్యాక్‌ చేయడానికి రీజనేంటి?. 

- 6 ప్యాక్‌ కాదు.. 8 ప్యాక్‌ చేశాను. 8 ప్యాక్‌ చేయాలని ముందుగా అనుకోలేదు. నా రెండు చిత్రాల్లో క్యారెక్టర్‌ పరంగా బాడీ బిల్డ్‌ చేసి చూపించాను. దీన్ని నార్మల్‌ స్టయిల్‌లోనే చేద్దామని అనుకున్నాను. ఇందులో నా ఇంట్రడక్షన్‌ సాంగ్‌ను రెగ్యులర్‌లా కాకుండా లండన్‌.. హైదరాబాద్‌ మధ్య నెంబర్‌ ఆఫ్‌ కట్స్‌తో కొత్త స్టైల్లో చేశాం. దాంతో పాటు ఇంకా కాస్త కొత్త లుక్‌ ఉండాలని శేఖర్‌ మాస్టర్‌ వచ్చి నన్ను 8 ప్యాక్‌ కోసం ఒప్పించాడు. 8 ప్యాక్‌ చేసే సమయంలో 8-9 నెలలు కేవలం చేపలనే తిన్నాను. 

నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ గురించి చెప్పండి? 

- బివిఎస్‌ఎన్‌గారి చుట్టూ హ్యాపీనెస్‌తో కూడిన ఓరా ఉంటుంది. నేను ఆయనతో ఎప్పుడు ‘మా తాతగారితో సినిమా చేశారు. ఇప్పుడు నాతో సినిమా చేస్తున్నారు. నాకు చాలా గర్వంగా ఉంది’ అనేవాడిని. బాపినీడు ఎప్పుడు బ్యాక్‌ఎండ్‌లో ఉండి సపోర్ట్‌ను అందించారు. 

చరణ్‌ కూడా మీ టీంను అప్రిషియేట్‌ చేశారు కదా? 

- చరణ్‌ మా సాంగ్‌ సెట్‌కు కూడా వచ్చారు. ఆ సమయంలో చరణ్‌ ‘వినయవిధేయరామ’ చిత్రీకరణ జరుగుతుంది. ఆయనకు డ్యాన్స్‌ అంటే చాలా ఇష్టం కాబట్టి పక్కనే ఉన్న మా సినిమా సెట్‌కు వచ్చి సాంగ్‌ చూశారు. 

నాన్న(నాగార్జున) తారక్‌ను చూసి మాస్‌ నేర్చుకోమని అన్నారు కదా? 

- అవును అన్నారు. అదెలాగో ఆయన్నే అడగాలి. 

తారక్‌ మీరు ఫైనెస్ట్‌ ఆర్టిస్ట్‌ అవుతారని అప్రిషియేట్‌ చేశారుగా? 

- ఆయనలా అంటారని అనుకోలేదు. నన్ను ఎక్కువగా పొగిడారు. 

తమన్‌ మ్యూజిక్‌ గురించి చెప్పండి? 

- లవ్‌స్టోరీస్‌కు మ్యూజిక్‌ మెయిన్‌ అవుతుంది. తమన్‌ ఈ సినిమా కోసం ఆరు అద్భుతమైన సాంగ్స్‌ను, బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ ఇచ్చారు. ఓ సాంగ్‌లో ఓ షాట్‌లో కనపడతాడు కూడా. 

మీరు క్రికెటర్‌ కదా.. స్పోర్ట్స్ సినిమాలు చేయవచ్చు కదా? 

- క్రికెట్‌కు సంబంధించిన సినిమా చేయాలంటే నేను ఆలోచిస్తాను. ఎందుకంటే ఎక్కువ స్పోర్ట్స్‌ సినిమాలు పెద్దగా కనెక్ట్‌ కావు. అందుకు కారణం నటించే నాకే కాదు.. డైరెక్టర్‌కి కూడా క్రికెట్‌ మీద అవగాహన ఉండాలి. అప్పుడే ఆ ఎమోషన్‌ కనెక్ట్‌ అవుతుంది. అయితే నా దగ్గరకు ఇప్పటి వరకు క్రికెట్‌కు సంబంధించిన స్క్రిప్ట్స్‌ రాలేదు. అయితే ఓ స్పోర్ట్స్‌ సినిమా డిస్కషన్‌లో ఉంది. అంతా ఓకే అయితే ఆ వివరాలను నేనే ప్రకటిస్తాను. 

మల్టీస్టారర్‌ సినిమాలు చేయవచ్చు కదా? 

- ఒకట్రెండు మల్టీస్టారర్‌ సినిమాలు చేయమని అడిగారు కానీ నాకు ఆసక్తిగా అనిపించలేదు. ఇంట్రెస్టింగ్‌ స్క్రిప్ట్‌ వచ్చినప్పుడు తప్పకుండా నటిస్తాను. నాకు ఎక్స్‌పెండబుల్స్‌ తరహా మల్టీస్టారర్‌ చేయాలని ఉంది. ఆరేడు మంది స్టార్స్‌ కలిసి సినిమా చేసేటప్పుడు ఆ ఎన్విరాన్‌మెంట్‌ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. 

నిధి అగర్వాల్‌తో వర్కింగ్‌ ఎక్స్‌పీరియెన్స్‌? 

- ‘సవ్యసాచి’ రషెష్‌ చూసి వెంకీ.. నిధి అగర్వాల్‌ను ఈ సినిమాను తీసుకున్నారు. చాలా అద్భుతంగా చేసింది. మంగళూరు అమ్మాయి కాబట్టి ఎక్కడో సౌత్‌ టచ్‌ ఉంది. అందువల్ల తెలుగును అర్థం చేసుకునేది. తను చాలా హార్డ్‌ వర్కర్‌. తనతో వర్క్‌ చేయడం హ్యాపీ. 

మీ నెక్స్‌ట్‌ ప్రాజెక్ట్స్‌? 

- రెండు మూడు కథలు డిస్కషన్‌లోఉన్నాయి. ఫిబ్రవరిలో సినిమా అనౌన్స్‌ చేసి మార్చిలో షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం. దసరాకు సినిమాను విడుదల చేసేలా ప్లాన్స్‌ చేస్తున్నాం. ఇకపై ఎక్కువ సినిమాలు చేసేలా ప్లానింగ్‌ చేసుకుంటున్నాను.. అంటూ ఇంటర్వ్యూ ముగించారు అఖిల్‌ అక్కినేని. 

Mr Majnu Akhil Akkineni Interview:

Akhil Akkineni Talks About Mr Majnu Movie
Show comments


LATEST TELUGU NEWS


LATEST IN NEWS

POPULAR NEWS



LATEST IN GALLERIES

POPULAR GALLERIES