Advertisement
Google Ads BL

ఇంటర్వ్యూ: 'దర్శకుడు' హీరో అశోక్


సినిమా బ్యాక్‌డ్రాప్‌లో సాగే అందమైన ప్రేమకథ ఇది. ఓ దర్శకుడికి,  ఫ్యాషన్‌డిజైనర్ మధ్య మొదలైన ప్రేమ చివరకు ఏ మజిలీకి చేరుకుందనేది  చిత్ర ఇతివృత్తం అని అన్నారు అశోక్. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం దర్శకుడు. సుకుమార్ రైటింగ్స్ పతాకంపై బీఎన్‌సీఎస్‌పీ విజయ్‌కుమార్, థామస్‌రెడ్డి ఆదూరి, రవిచంద్ర సత్తిలతో కలిసి సుకుమార్ నిర్మిస్తున్నారు. హరి ప్రసాద్ జక్కా దర్శకుడు. ఆగస్ట్ 4న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. ఈసందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో అశోక్ పాత్రికేయులతో పంచుకున్న ముచ్చట్లివి....

Advertisement
CJ Advs

ఆయన సలహా హీరోను చేసింది...

ప్రముఖ దర్శకుడు సుకుమార్, హరి ప్రసాద్ జక్కా మంచి మిత్రులు.  హరి ప్రసాద్ సిద్ధం చేసిన కథ నచ్చడంతో ఆయన్నే  ఈ సినిమాకు దర్శకత్వం వహించమని సుకుమార్ సలహా ఇచ్చారు. ఆ సలహా నా జీవితాన్ని మలుపుతిప్పంది. ఈ సినిమాతో నన్ను హీరోను చేయాలని హరి ప్రసాద్ అనగానే సుకుమార్ షాకయ్యారు. సుకుమార్ మా బాబాయి కాబట్టి చిన్నప్పటి నుంచి నేనేంటో ఆయనకు బాగా తెలుసు. నలుగురి ముందు మాట్లాడాలంటేనే భయపడతాడు అశోక్ హీరోగా వద్దని కొత్తవాళ్లతో చేద్దామని సుకుమార్ అన్నారు. కానీ హరి ప్రసాద్ మాత్రం పట్టుబట్టి  నీతోనే ఈ సినిమా చేయాలని నిశ్చయించుకున్నాను, నువ్వు రెడీగా ఉండమని అన్నారు. ఒక రోజు ఆలోచించి నా నిర్ణయం చెబుతానని ఆయనతో అన్నాను.  దర్శకత్వం, నటన రెండింటికి అంతర్లీనంగా సంబంధం ఉంటుంది కాబట్టి  వచ్చిన అవకాశాన్ని వదులుకోవడం మంచిది కాదనే ఆలోచనతో ఈ సినిమాను అంగీకరించాను. 

దర్శకుడిని ఫాలో అయ్యాను...

హీరో అవ్వాలనే ఆలోచన నాకు లేదు. నటనలో ఓనమాలు తెలియవు. నాతో ఈ సినిమా చేయించుకోగలననే నమ్మకం ఉంటేనే ఈ సినిమాలో నటిస్తానని హరి ప్రసాద్‌తో  చెప్పాను. అలా తొలిరోజు నుంచి సినిమా పూర్తి భారమంతా ఆయనపై పెట్టాను.  ఆయన్నే ఫాలో అయ్యాను. 

ఆ ఆలోచన లేదు

దర్శకుడవ్వాలనుకొని హీరోలుగా మారిన వారిలో నానితో పాటు మరికొందరు ఉన్నారు. వారు సక్సెయ్యారు కాబట్టి  ఆ దారిలో నేను అడుగులు వేస్తే బాగుంటుందని ఎప్పుడు అనుకోలేదు. ఆ ఆలోచన నాకు లేదు. హరి ప్రసాద్ నమ్మకమే నాతో ఈ సినిమా చేయించింది. నేనున్నా భయపడకు అంటూ నిరంతరం ఆయన నాలో ధైర్యాన్ని నింపారు. 

వారిద్దరి నిర్ణయంపైనే..

దర్శకుడు సుకుమార్‌తో పాటు హరిప్రసాద్ నిర్ణయంపైనే నా భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. అవకాశాలు వస్తే నటించడానికి సిద్ధమే. దాంతో పాటు ఎప్పటికైనా ఓ సినిమాకు దర్శకత్వం వహిస్తాను. 

కథలో భాగంగానే...

కథలో కావాలని లిప్‌లాక్‌లను ప్రత్యేకంగా పెట్టలేదు. ఓ సన్నివేశంలో కథానాయకుడు తాను తీస్తున్న  ముద్దు సన్నివేశం సరిగా రాకపోవడంతో  దానిని ఎలా చేయాలో చూపించడం కోసం తన ప్రియురాలినే ముద్దుపెటుకున్నట్లుగా చూపించాం. కథలో భాగంగానే కొన్ని క్షణాలు ఆ సన్నివేశం ఉంటుంది. 

వారివల్లే ప్రేక్షకులకు చేరువైంది...

నటుడిగా నాకు ఈ సినిమా మంచి గుర్తింపును తెచ్చిపెడుతుందనే నమ్మకముంది. ఎన్టీఆర్, రామచరణ్, అల్లు అర్జున్, అగ్రనటులు  ప్రచార కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం మా సినిమాకు ఉపకరించింది. మేము నమ్ముకున్న కథను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లడానికి వారు తోడ్పడ్డారు. సాయికార్తీక్ చక్కటి బాణీలనిచ్చారు. నీ మనసింతేనా పాటంటే నాకు చాలా ఇష్టం. 

సుకుమార్ ప్రభావం ఉంది...

వన్ నేనొక్కడినే సినిమాకు సుకుమార్ వద్ద దర్శకత్వ విభాగంలో నేను పనిచేశాను. అందులో ఓ సన్నివేశానికి సంబంధించి నేను రాసిన వెర్షన్ ఆయనకు నచ్చింది.  ఆ సమయంలోనే సుకుమార్ సెట్స్‌లో  ఎలా ఉంటారు, సన్నివేశాలు బాగా రావడం కోసం ఆయన పడే తపన, కాస్ట్యూమ్స్, దర్శకత్వం టీమ్ సరిగా లేకపోతే ఆయన ఎలా ప్రతిస్పందిస్తారో  ప్రత్యక్షంగా చూశాను.  ఆయన ప్రభావం నాపై తప్పకుండా ఉంటుంది. దర్శకుడు సినిమాలో కొంత ఆయన బాడీలాంగ్వేజ్‌ను అనుసరించే ప్రయత్నం చేశాను. చిత్ర దర్శకుడు  హరిప్రసాద్‌కు పదేళ్లుగా సుకుమార్‌తో అనుబంధం ఉంది.  కొన్ని సన్నివేశాల్ని సుకుమార్ జీవితం నుంచే స్ఫూర్తి పొంది తెరకెక్కించారు. ఓ సందర్భంలో  కోపంతో కుర్చీని విసిరే సీన్ సరిగా రాకపోవడంతో సుకుమార్ తల్చుకో అదే బాగా వస్తుందని హరి ప్రసాద్ చెప్పారు. ఆయన చెప్పినట్లే చేశాను. 

వారి జీవితాలే ఆధారం...

సుకుమార్‌తో పాటు హరి ప్రసాద్ జీవితంలోని సంఘటనల ఆధారంగా రూపొందిన చిత్రమిది. నా లైఫ్‌లో జరిగినవేవి ఇందులో కనిపించవు. సినిమాలో బాగా నటించానని చెప్పను. దర్శకుడు నా నుంచి ఏ కోరుకున్నారో దానికి పూర్తిగా న్యాయం చేసే ప్రయత్నం చేశాను. 

బాబాయి సంతోషంగా ఉన్నారు..

బాబాయి సుకుమార్ ఈ సినిమా చూసి హ్యాపీగా ఫీలయ్యారు. బాగా నటించానని  మెచ్చుకున్నారు. వాయిస్ బాగుందని ఆయన కాంప్లిమెంట్ ఇవ్వడం ఆనందంగా ఉంది. నటుడినవుతున్నానని తెలియగానే నిజజీవితంలో నువ్వు ఎలా ఉంటావో తెరపై కూడా అలాగే నటించు అని సలహా ఇచ్చారు.  ఆయన చెప్పినట్లు చేశాను. అదే నా పాత్రలో ఇమిడిపోవడానికి తోడ్పడింది. 

హీరోల్లో చిరంజీవి అంటే ఇష్టం. దర్శకుల్లో సుకుమార్ తర్వాత రాజమౌళి సినిమాలు నచ్చుతాయి. 

ప్రేమ్క్ష్రిత్ డ్యాన్సులు ఆకట్టుకుంటాయి.

వన్ నేనొక్కడినే సమయంలో ప్రేమ్క్ష్రిత్ మాస్టర్‌తో చక్కటి సాన్నిహిత్యం ఏర్పడింది. తన సొంత సినిమాలా భావించి నాతో మంచి స్టెప్పులు వేయించారు. దర్శకుడు సిగ్నేచర్ స్టెప్‌ను  ఆయన నవ్యరీతిలో కంపోజ్ చేశారు. 

సుకుమార్ శైలి ప్రేమకథా ఇది...

మలుపులు, ఉత్కంఠభరిత సన్నివేశాలు లేకుండా సుకుమార్ శైలిలో సాగే అందమైన ప్రేమకథా చిత్రమిది. సుకుమార్ సినిమాల్లో ఉండే అన్ని హంగులు ఇందులో కనిపిస్తాయి...అని తెలిపారు. 

Darshakudu Movie Hero Ashok Interview:

Hero Ashok Talks About Darshakudu Movie 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs