Advertisement
Google Ads BL

స్పెషల్: ప్రత్యేక హోదాపై పార్టీల నాటకాలు!


సోనియా గాంధీ ఏమంటూ భరతం పట్టి మరీ పుట్టిన రోజు కానుకగా కేక్ కట్ చేసినట్లు సమైక్య తెలుగు రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసిందో అక్కడ నుంచే తెలుగు ప్రజలకు కష్టాలు మొదలయ్యాయి. ఏదో కోల్పోయామన్న టెన్షన్ తో ప్రతి తెలుగు వాడు ఆలోచించడం మొదలెట్టాడు. అది ఆసరాగా తీసుకొని ఆంధ్రప్రదేశ్ నాయకులు ప్రజలతో చెలగాట మాడుకుంటున్నారు. సమాజానికి సేవ చేయాలని ప్రజలను పాలిద్దామని ముందుకు వచ్చిన ప్రతి పార్టీ, ప్రతి నాయకుడూ సమాజంలో తన హోదాను, పరపతిని, వైయక్తిక స్వార్థంతో చూసుకుంటున్నాడే తప్ప ప్రజలకు సమాజానికి ఉపకరించే పనులు కానీ అటువంటి ఆలోచనలు కానీ ఏమాత్రం చేయడం లేదు.

Advertisement
CJ Advs

ఆంధ్రప్రజలు విభజనకు గురై రాజధాని లేక, సక్రమమైన వసతులు, వనరులు లేక అల్లల్లాడుతున్న విషయం తెలిసిందే. విభజనకు గురైన తర్వాత జరిగిన సాధారణ ఎన్నికల్లో ఏ పార్టీకి ఆ పార్టీ కళ్ళు చెదిరిపోయే మేనిపెస్టోతో ప్రజల ముందుకు వచ్చింది. చివరకు రాష్ట్రాన్ని తెదేపా కైవసం చేసుకుంది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ లో  జరిగిన పరిణామాలను గమనిస్తే ప్రతి పార్టీ, ప్రతి నాయకుడూ తమ తమ ఉనికిని కాపాడుకొనేందుకు మనుగడ ద్వారా వైయక్తికమైన మైలేజ్ ను పొందేందుకు తాపత్రయ పడతాడే తప్ప ఆంధ్రప్రజల కోసం సమాజానికి ఏదైనా చేద్దామన్న ఆలోచన గానీ అటువంటి తపన గానీ లేని సందర్భాలను మనం కళ్ళతో చూస్తున్నాం.

పార్టీలకు, నాయకులకు ఇటువంటి స్వార్ధం ఉండబట్టే రకరకాల కుంభకోణాలు, కేసులతో నాయకులు సతమతమవుతున్నారు. అసలు ఇప్పుడు నాయకులు ప్రజోపయోగ కార్యక్రమాల కోసం తిరుగుతారా?, లేక వారిపై ఉన్న కేసులు వాటి తాలూకూ వ్యవహారాల కోసం తిరుగుతారా? అన్నది అర్థం కాని విషయంగా పరిణమించింది. తెదేపా అధికారంలోకి వచ్చాక 'స్విస్ చాలెంజ్', ‘ఓటుకు నోటు’ వంటి కేసుల్లో కోర్టులు ఇస్తున్న తీర్పులకు చంద్రబాబు నాయుడికి తల బొబ్బి కడుతుంది. ఈ రకమైన ధోరణి ఉన్నప్పుడు ప్రజా పాలన ఎలా చేస్తారన్నదే ప్రధాన విషయం. కొత్తగా ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్ రాజధాని శంకుస్థాపనకు సంబంధించిన ఆర్భాటాలకు రాష్ట్రప్రభుత్వం వందల కోట్లు ఖర్చుపెట్టింది. రెండున్నరేళ్ల నుంచి కేంద్రప్రభుత్వాన్ని ఆంధ్రరాష్ట్రంలోని అధికార, ప్రతిపక్ష పార్టీ, ఇంకా పిల్ల తోక పార్టీలన్నీ కూడా ఆంధ్రరాష్ట్రానికి ప్రత్యేక హోదా గురించి అభ్యర్థిస్తూనే ఉన్నాయి. అధికార పార్టీకి చూడబోతే ప్రత్యేక హోదా కంటే ప్యాకేజీ వైపే మొగ్గే విధంగా వారి మనస్సులున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే వచ్చే నిధులు నేరుగా వారి జేబుల్లో వేసుకోవచ్చనే వారి తాపత్రయం కావచ్చు.  అందుకనే బాబు ఎప్పుడూ ప్రత్యేక హోదా ఏం అంత సంజీవినీ కాదు అంటూ పలు సందర్భాల్లో మాట్లాడిన విషయం తెలిసిందే. అలా ఉంది అధికార పార్టీ నాటకం. 

తాజాగా అందుతున్న సమాచారం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ విషయంలో కేంద్రం కొన్ని ప్రతిపాదనలనతో కూడిన ముసాయిదా రూపొందించిందని అదంతా కలిపితే హోదాకు మించి ఉంటాయని ఒక వార్తను బయటకు విడిచారు. ఇంతలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తిరుపతిలో వేంకటేశ్వర స్వామి సాక్షిగా ఆంధ్రాకు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనంటూ పట్టుబడుతున్నాడు. దీంతో అధికార, ప్రతిపక్ష, విభజన జరగడానికి ప్రధాన హేతువైన కాంగ్రెస్, భాజపా, సీపీయం, సీపీఐ పార్టీలకు కలవరం పట్టుకుంది. జనసేనానిలా ఈ పవన్ పెద్ద పుడింగల్లే వచ్చి మైలేజ్ కొట్టేసేందుకు ప్లాన్ వేస్తున్నాడా ఏంటి అన్నట్లు అన్ని పార్టీలు ఆలోచనలో పడి తమకు తాము మదన పడుతున్నాయి.

అధికారంలో ఉన్న తెదేపా అయితే పవన్ ఫీవర్ తో ఏకంగా కేంద్రప్రభుత్వం నుంచి వైదొలుగుతామని, మంత్రుల చేత రాజీనామా చేయిస్తామని అల్టిమేటం కూడా జారీ చేయిస్తున్నామన్నట్లు వార్తలు కూడా వచ్చాయి. ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ అడుక్కోవడం కాదు, అధికారికంగా హుందాగా వ్యవహరిస్తూ, అలాగే పాలిస్తూ నిధులను, ప్రత్యేక హోదాను రాబట్టుకోవాలన్న మాటలు అన్ని పార్టీలకు సూదులు గుచ్చుకున్నట్లు గుచ్చుకున్నాయి. దాంతో ఎవరికి వారు భరించలేక ఈ విషయంపై నాయకులు.. కేంద్రమే బయటపడేయాలన్నట్లు దేవుళ్ళకు మొక్కుకుంటున్నారు.   

కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే  కేంద్ర ప్రభుత్వం తరఫు పథకాలకు ఇస్తున్న నిధులను 90 శాతానికి పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కేంద్ర పథకాలకు 60 శాతం నిధులు ఇస్తుండగా రాష్ట్రం 40 శాతం నిధులు భరిస్తోంది. ఇందుకు బదులు కేంద్రమే 90 శాతం నిధులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఇలాకాని ఇస్తే సంవత్సరానికి 3,000 కోట్ల రూపాయలు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. ఇల్లాగే ఐదేళ్ల పాటు కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ విషయంపై ఇప్పటికే కేంద్రం ససేమిరా అన్నట్లుగా వ్యవహరించింది. ఇకపోతే పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను తీసుకోవడానికి అంగీకరించినా రాష్ట్ర విభజన తేదీ నుంచి అయ్యే వ్యయాన్ని మాత్రమే భరిస్తామమని తేల్చి చెప్పింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన నిధులను నాబార్డు ద్వారా సమకూర్చాలని కేంద్రం కూడా నిర్ణయించింది. నాబార్డు నుంచి తీసుకునే నిధులను 70% తాము భరించేందుకు, మిగతా 30% రాష్ట్రం భరించేందుకు కేంద్రం అంగీకరించింది కూడాను. ఇంకా రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు పారిశ్రామిక రాయితీలు ఇవ్వమని కోరితే ఆ విషయాన్ని కేంద్రం సున్నితంగా తిరస్కరించింది. ఇలాంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా వస్తే అన్నింటికీ సంజీవినిలా ఉంటుంది అని తన గొంతుకను వినిపించేందుకు, అలా కేంద్రంపై పోరాడేందుకు ప్రయత్నిస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచీ విభజన హామీలో ఇచ్చిన విధంగా ప్రత్యేక హోదా కల్పించాలని రకరకాలుగా పోరాడుతుంది. వైఎస్ఆర్ సీపీ కూడా ప్రత్యేక హోదాపై పలు రకాలుగా దీక్షలు చేసింది, నిరసనలు చేపట్టింది. ఆరకంగా కేంద్ర రాష్ట్రప్రభుత్వాలకు తమ గొంతుకను వినిపించింది. భాజపా మాత్రం అధిష్టానం చూసుకుంటుందని తెదేపాకే వదిలేసినట్టుగా ఉంది. అందుకనే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ ప్యాకేజీ కావాలంటుంటే, ప్రతిపక్ష, తదితర పార్టీలన్నీ ప్రత్యేక హోదా కావాలంటున్నాయి. ఈ రెండు పక్షాల నాటక పూరిత పోరాటంలో ఏ పార్టీ విజయం సాధిస్తుందో చూడాలి. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs