మెగాస్టార్ చిరంజీవి నటనకు ప్రభావితుడై సినీరంగం ప్రవేశం చేసిన పవన్ కళ్యాణ్ అనతి కాలంలోనే తన నటనా విశ్వరూపాన్ని ప్రదర్శించి పవన్.. స్టార్ స్థాయికి ఎదిగాడు. అలా తనకంటూ ఓ ఇమేజ్ పొందగలిగాడు.
కొణిదెల వెంకట రావు, అంజలీ దేవికి చివరి సంతానంగా పవన్ కళ్యాణ్ 1971 సెప్టెంబర్ 2వ తేదీన జన్మించాడు. కాగా పవన్ అసలు పేరు కొణిదెల కళ్యాణ్ బాబు. హనుమంతుడిపైన ఉన్న అమిత భక్తితో పవన్ కళ్యాణ్ అని పిలవడం ఆరంభించారు . చిన్నప్పుడు కరాటేని బాగా ఇష్టపడ్డ పవన్ అందులో బ్లాక్ బెల్ట్ ను కూడా సాధించాడు.
1996లో 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' సినిమా ద్వారా పవన్ కళ్యాణ్ టాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. ఆ సినిమా అంతగా ఆడకపోయినా ఆ తర్వాత వచ్చిన 'తొలి ప్రేమ' బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో హీరోగా మంచి పేరు తెచ్చుకున్నాడు పవన్ కళ్యాణ్. తర్వాత తర్వాత నటుడుగా మంచి సంచలనాలు సృష్టించాడు పవన్. పవన్ కళ్యాణ్ తెలుగు సినీ నటుడుగానే కాకుండా దర్శకుడు కూడాను. పవన్ కళ్యాణ్ కెరీర్ లో మంచి గుర్తింపు తెచ్చిన సినిమాలుగా గోకులంలో సీత, సుస్వాగతం, తొలిప్రేమ, తమ్ముడు, బద్రి, ఖుషి, జల్సా, గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది, గోపాల గోపాల వంటి చిత్రాలను చెప్పుకోవచ్చు. పవన్ ఎప్పుడు ఏదో ఒక కొత్త స్టైల్ తో, వెరైటి సంభాషణలతో, తన సహజమైన నటనతో యువతను కట్టిపడేస్తుంటాడు. సామాన్య మానవులే కాకుండా వెంకటేష్, మహేష్ బాబు లాంటి తోటి నటులు కూడా పవన్ ని ఇష్ట పడటానికి కారణం కూడా అదే. పవన్ కళ్యాణ్ నటుడిగానే కాకుండా దర్శకుడుగా కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు. జపాన్ దర్శకుడు అకీరా కురసోవా ను అమితంగా ఇష్టపడే పవన్ ఆయన స్పూర్తి తో దర్శకుడుగా 'జానీ' చిత్రాన్ని రూపొందించాడు. స్వతంత్రమైన వ్యక్తిత్వం, విప్లవ భావాలు, నిరంతరం చైతన్యంతో కూడిన మనస్సు కలిగిన మానవతా వాది పవన్. సినిమాలో నటుడుగానే కాకుండా నిజ జీవితంలో కూడా మంచి సహాయకారి. పవన్ తన సినిమా ద్వారా నష్ట పోయిన వారిని చాలా సందర్భాల్లో ఆదుకున్నాడు. పవన్ నటించిన 'జానీ' సినిమా డిజాస్టర్ కావడంతో ఈ సినిమా వల్ల నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లకు తగిన సాయం అందించి ఆదుకున్నాడు.
పవన్ కు ఏమాత్రం ఖాళీ సమయం దొరికినా తోటకు వెళ్ళి వ్యసాయం చేయడానికి ఇష్టపడేవాడు. ఖాళీ సమయంలో హైదరాబాద్ లోని తమ ఫామ్ హౌస్‌లో కూరగాయలు, పండ్ల, మొక్కలు వంటివి పెంచుతుంటాడు. కాగా పెప్సీ బ్రాండ్ అంబాసిడర్‌గా పవన్ కొంతకాలం ఉన్నాడు. ఆ కంపెనీకి ప్రకటనల కోసం తీసుకున్న తొలి సౌత్ ఇండియన్ యాక్టర్‌గా పవన్ చరిత్ర కెక్కాడు. పవన్ తన జీవితాన్ని చాలా సాదాసీదాగా గడపడానికి ఇష్టపడతాడు. ఓసారి లండన్ వెళ్తూ... ఇక్కడ విమానాశ్రయంలో ఒక సాదాసీదా షర్టు వేసుకుని, పాస్ పోర్ట్ చేత పట్టుకుని, రెండు చేతులు కట్టుకుని ఒక సామాన్యమైన వ్యక్తి మాదిరి నిల్చున్న తీరుతో అభిమానులను ఆకట్టుకున్న సందర్భాలు అనేకం. పవన్ ఎప్పుడూ సింపుల్ గా ఉండాలని కోరుకుంటాడు.
రాజకీయనేతగా ప్రజలకు మరింత సేవ చేయాలని, ప్రజలకు మరింత దగ్గర కావాలని భావించిన పవన్ కళ్యాణ్ మార్చి 14, 2014వ తేదీన జనసేన పార్టీ స్థాపించాడు. ఈ పార్టీ కోసం పనిచేయడానికి రెండు రాష్ట్రాల్లోని తెలుగు ప్రజలతో పాటు, సెలబ్రిటీలు కూడా ఉత్సాహం చూపుతున్నారు. సినీ నటుడుగా, జనసేనానిగా సురకత్తిలా దూసుకుపోతున్న పవన్ కళ్యాణ్ కొన్ని సార్లు ఓ విప్లవవాదిలా దర్శనమిస్తాడు. ఇంకా ఓ గొప్ప వక్తగానూ, మార్క్సిస్టు దృక్పథం కలిగిన ఉన్నత బావాలు కల వ్యక్తిలా కనపడతాడు. తరచి చూడాలే గానీ పవన్ పలు కోణాల్లో దర్శనమిస్తుంటాడు. పవన్ కళ్యాణ్ ఎలాంటి వేడుకనైనా పెద్ద పెద్ద ఆర్భాటాలు, గ్రాండ్ ఫంక్షన్స్ లాంటివి లేకుండా సింపుల్ గా చేసుకోవడానికి ఇష్టపడతాడు. మామూలు గానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫంక్షన్స్ అన్నా పార్టీలన్నా పెద్దగా ఆసక్తి ఉన్నట్టు కనిపించడు. కనీసం తన ఫ్యామిలీ ఫంక్షన్లలో కూడా మొహమాటంగా నవ్వుతూ పక్కకు తప్పించుకు తిరుగుతాడు. షూటింగ్ స్పాట్ లోనూ, మిగతావిషయాల్లోనూ హైపర్ యాక్టివ్ అనిపించే పవన్ మరెందుకో పార్టీలలో మాత్రం సైలెంట్ అయిపోతాడు. పవన్ ఇప్పటి వరకూ తన బర్త్ డే పార్టీ జరుపుకున్న సంధర్భాలూ అరుదనే చెప్పాలి.
అంతే కాకుండా పెళ్లి - సహజీవనం వంటి వాటిల్లో కూడా సంచలనం రేపాడు. పవన్ కళ్యాణ్ మొదటి భార్య నందిని నుండి విడాకులు తీసుకున్నాక తన సరసన హీరోయిన్ గా నటించిన రేణుదేశాయ్ తో సహజీవనం చేశాడు. రేణు 2000 సంవత్సరంలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన 'బద్రి' సినిమాలో పవన్ సరసన నటించింది. ఆ రకంగా దగ్గరైన వీరిద్దరికీ పెళ్లి కాకముందే 2004లో అకీరా నందన్ పుట్టాడు. తర్వాత చాన్నాళ్ళకు 2009లో ఇద్దరూ ఇంటి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. ఆ పెళ్ళయ్యాక ఓ కూతురు ఆద్యా పుట్టింది. కొన్ని రోజులకు ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత అన్నా లెజ్ నోవా అనే మహిళతో కలిసి సహజీవనం చేస్తూ ఆమెనే పెళ్లి చేసుకున్నాడు.
ఒక్కమాటలో చెప్పాలంటే పవన్ కళ్యాణ్ స్వతంత్ర వ్యక్తిత్వాన్ని వృద్ధి చేసుకుంటూ, అలాంటి భావాలతో నిరంతర చైతన్యంతో ప్రజలకు ఏదో ఒకటి చేయాలనే తపన కలిగిన నాయకుడు. ఎక్కడ అన్యాయం జరుగుతుందో అక్కడకు వెళ్ళి తన ఆవేదనను బాధను ప్రజలతో పంచుకుంటాడు. తగిన సాయమందిస్తుంటాడు. ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా మూలాలను వెతుకుంటూ నిరంతరం తన్ను తాను తరచి చూసుకుంటూ చాలా సామాన్య జీవితాన్ని గడిపేందుకు ఇష్టపడుతున్న పవన్ కళ్యాణ్ కు సినీజోష్.కామ్ తరఫున జన్మదిన శుభాకాంక్షలు.
Click Here to see the Pawan Katamrayudu Look