దర్శకుడిగా ఇంద్రగంటి ఇప్పటివరకూ చాలా విభిన్నమైన చిత్రాలు చేసినప్పటికీ.. అన్ని సినిమాల్లోనూ దాదాపుగా హృద్యమైన భావాలనే కీలకాంశంగా సాగాయి ఆయన చిత్రాలు. ఆయన తొలిసారిగా తన పంధాను మార్చుకొని వేరే రచయిత రాసిన కథను డైరెక్ట్ చేశారు. నాని టైటిల్ పాత్రలో నటించిన ఆ చిత్రం 'జెంటిల్ మెన్'. సీనియర్ ప్రొడ్యూసర్ శివలెంక కృష్ణప్రసాద్ దాదాపు ఎనిమిదేళ్ళ విరామం అనంతరం మళ్ళీ నిర్మాతగా రూపొందిస్తున్న ఈ చిత్రం రేపు (జూన్ 17) విడుదలకానుంది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో ముచ్చటించారు.
అన్నిటికంటే తొందరగా పూర్తయ్యింది...
నా కెరీర్ లో ప్రతి సినిమాకి కనీసం రెండేళ్ల గ్యాప్ వచ్చింది, కానీ మొట్టమొదటిసారిగా 'బందిపోటు' విడుదలైన కొన్ని నెలలకే 'జెంటిల్ మెన్' సెట్స్ కు వెళ్లింది. అలాగే.. నేను అతి త్వరగా పూర్తి చేసిన మొదటి సినిమా కూడా ఇదే. నాకే ఎందుకో చాలా తొందరగా పూర్తయిపోయింది అనిపించింది.
నానీని నేను ఎప్పుడూ డైరెక్ట్ చేయలేదు..
నాని పరిచయ చిత్రం 'అష్టాచెమ్మా' ఇప్పుడు 'జెంటిల్ మెన్'. ఈ రెండు సినిమాల దర్శకుడ్ని నేనే అయినప్పటికీ.. ఇప్పటివరకూ నానీని మాత్రం డైరెక్ట్ చేయలేదు. ప్రతి సినిమాకి ముందు హోమ్ వర్క్ చేయడం నాకు బాగా అలవాటు. అలాగే నా నటీనటులతో కూడా చేయిస్తాను. అందువల్ల షూటింగ్ సమయంలో మేం ఇద్దరం కలిసి పనిచేశామే కానీ.. అతడ్ని నేను డైరెక్ట్ చేయడం అనేది మాత్రం జరగలేదు. అయితే 'జెంటిల్ మెన్' సినిమాలో మాత్రం నాని నెగిటివ్ షేడ్ ను పెర్ఫార్మ్ చేసిన తీరు అద్భుతం.
నా కెరీర్ లో మొట్టమొదటిసారిగా..
నేను ఇప్పటివరకూ నేను రాసుకొన్న కథలనే డైరెక్ట్ చేశాను. కానీ.. మొట్టమొదటిసారిగా 'జెంటిల్ మెన్' సినిమా కోసం డేవిడ్ నాథన్ అనే కొత్త రచయిత రాసిన కథను డైరెక్ట్ చేశాను. అయితే.. నాకు తగ్గట్లుగా కొన్ని మార్పులు చేసుకొన్నాను.
నాకు అలాంటి రౌడీయిజం నచ్చదు..
నా సినిమాల్లోనూ విలన్లు ఉంటారు. కానీ.. మరీ క్రూరంగా మనుషులను చూపించడం నాకు నచ్చదు. అలాగే ఈ సినిమాలోనూ హీరో ఒకానొక సందర్భంలో విలన్ గా మారాల్సి వస్తుంది. ఆ సందర్భం ఏమిటి? అందుకు దారి తీసిన పరిణామాలేమిటి? అనే విషయాన్ని రేపు థియేటర్లో చూడాలి.
రచయితలకు స్వేచ్ఛనిస్తేనే మంచి సినిమాలు..
మన ఇండస్ట్రీలో రచయితలకు స్వేచ్చ తక్కువ. నిర్మాతలు మాకు ఈ తరహా సినిమాలే కావాలి అని అడుగుతుండడంతో.. రచయితలు కూడా అవే రొట్టగొట్టుడు కథలు రాయాల్సి వస్తుంది. అదే రచయితకు స్వేచ్ఛనిచ్చి చూడండి.. ఎంత మంచి కథలు వస్తాయో మీకే తెలుస్తుంది.
ఈసారి నుంచి ఏడాదికొక సినిమా..
'జెంటిల్ మెన్' తర్వాత నుంచి ఏడాదికి ఒక సినిమా చేయాలనుకొంటున్నాను. నా తదుపరి చిత్రంగా 'షేక్ స్పియర్' నవల్లోని ఒక కామెడీ ఎపిసోడ్ ను ఎంచుకొన్నాను అంటూ ఇంటర్వ్యూ ముగించారు.