ప్రస్తుతం సినిమాల సంఖ్య పెరిగిపోవడం వలన చాలా చిత్రాలకు ముఖ్యంగా చిన్న చిత్రాలకు థియేటర్లు దొరకకపోవడం పెద్ద సమస్యగా మారింది. ఈ సమస్యను అధిగమించడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతోన్న ఓ కొలిక్కి రావడం లేదు. దీనికి తమ వంతు సహాయం చేయడానికి స్వదేశ్ గ్రూప్ ఆఫ్ కంపనీస్ ముందుకు వచ్చింది. మాల్స్, థియేటర్స్ నిర్మించడానికి ప్లాన్ చేస్తోంది. ఈ సందర్భంగా..
మోడురి కృష్ణప్రసాద్ మాట్లాడుతూ.. ''సుమారుగా 450 కేంద్రాల్లో థియేటర్లు నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నాం. ప్రతి ప్రాంతంలో ఒక మాల్ లో భాగంగా కనీసం రెండు స్క్రీన్స్ ను నిర్మించాలనుకుంటున్నాం. అలానే సినిమాల నిర్మాణం కోసం 1000 కోట్ల రివాల్వింగ్ ఫండ్ ను కేటాయిస్తున్నాం. ఔత్సాహికులను ప్రోత్సహించాలని ఈ నిర్ణయం తీసుకున్నాం. విదేశాలతో పోలిస్తే ఇండియాలో ఉన్న థియేటర్ల సంఖ్య చాలా తక్కువ. ఉన్న థియేటర్లు కూడా మూతపడుతున్నాయి. వీటి సంఖ్యను పెంచాలని ప్లాన్ చేస్తున్నాం. అలానే పూణే లో ఉన్న ఫిలిం ఇన్స్టిట్యూట్ మాదిరి హైదరాబాద్ లో సకల వసతులతో కూడిన ఫిలిం ఇన్స్టిట్యూట్ ను స్తాపించాలనుకుంటున్నాం. 'ఇంటిగ్రేటెడ్ ఫిలిం ట్రైనింగ్ సెంటర్' అనే ఈ ప్రపోజల్స్ ను తెలంగాణా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాం. ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న దిగ్గజాలను కలిసి వారందరితో కలిసి అడ్వైజరీ కమీటీను ఏర్పాటు చేస్తాం. జూలై 1 నుండి మా సంస్థ ఈ కార్యకలాపాలన్నింటినీ మొదలుపెట్టనుంది'' అని చెప్పారు.