Advertisement
Google Ads BL

నాలుగు దశాబ్దాల 'అంతులేని కథ'!


కుటుంబ బాధ్యతను మోసేందుకు ఓ బ్రాహ్మణ యువతి పడుపు వృత్తిని ఎంచుకుని ఆ కుటుంబాన్ని ఎలా పోషించిందనే కథాంశంతో1973లో కె.బాలచందర్‌ దర్శకత్వం వహించిన చిత్రం 'అరంగేట్రం'.

Advertisement
CJ Advs

ఒక స్త్రీ కుటుంబ బాధ్యతను తనపై వేసుకుని సంసారాన్ని ఓ దరికి చేర్చగలదు అన్న లైన్‌ని తీసుకుని ఆ రోజులకు తగ్గట్టు మరికొన్ని అంశాలను జోడించి ఆయన తెరకెక్కించిన తమిళ చిత్రం 'అవల్‌ ఓరు తొడర్‌ కథై'. అండాల్‌ మూవీస్‌ బ్యానర్‌పై రామ ఆరంగళ్‌ నిర్మించిన చిత్రమిది. సుజాత, విజయ్‌కుమార్‌, శ్రీప్రియా, ఫటాఫట్‌ జయలక్ష్మీ, అతిథి పాత్రలో కమల్‌హాసన్‌ నటించారు. 

ఇదే చిత్రాన్ని తెలుగు తియ్యాలనుకున్నప్పుడు కె. బాలచందర్‌ దృష్టాంతా కొత్త ఆర్టిస్ట్‌లపైనే ఉంది. 1973 నుంచి 1975 వరకు డి.వి.ఎస్‌.రాజు, బి.ఎన్‌.రెడ్డి, పుల్లయ్య, కె.బాలచందర్‌ వంటి మహామహులు కమిటీగా ఏర్పడి సౌతిండియన్‌ ఫిలించాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఆధ్వర్యంలో స్థాపించిన ఫిల్మ్‌ ఇన్స్‌స్టిట్యూట్‌లో యాక్టింగ్‌ కోర్స్‌ చేసి బయటికొచ్చిన రజనీకాంత్‌, జి.వి.నారాయణరావు, ప్రదీప్‌శక్తిలను నటీనటులగా ఎంపిక చేసుకున్నారు. వీరితోపాటు తమిళ వర్షన్‌లో నటించిన వారిని కూడా కొందరిని ఎంపిక చేసి 1975లో తెలుగు వర్షన్‌ చిత్రీకరణ ప్రారంభించారు. ఆ చిత్రమే 'అంతులేని కథ'. నేటికి(27, ఫిబ్రవరి) 1976లొ విడుదలైన ఈ చిత్రం  నాలుగు దశాబ్ధాలు పూర్తి చేసుకుంది.. ఈ సందర్భంగా ఆ సినిమా జ్ఞాపకాల్ని ఓసారి నెమరవేసుకుందాం. 

నటీనటులు:జయప్రద(సరిత), రజనీకాంత్‌(మూర్తి), శ్రీప్రియ(భారతి), ఫటాఫట్‌ జయలక్ష్మీ(చంద్రిక), నారాయణరావు (వికటకవి గోపాల్‌), ప్రసాద్‌బాబు(తిలక్‌), కమల్‌హాసన్‌ (బెంగాలీగా అతిథి పాత్ర). 

కథేంటి... 

తండ్రి వదిలేసిన ఓ పేద కుటుంబం అది. అందులో బాధ్యత ఎరుగని వ్యక్తి మూర్తి. కుటుంబం అలనాపాలనతో అతనికేమీ పనిలేదు. పెళ్లీడు వచ్చిన చెల్లెలు సరిత(జయప్రద) కుటుంబ బాధ్యతను మోస్తూ గౌరవప్రదంగా ఓ కంపెనీలో పని చేస్తూ ఆ కుటుంబాన్ని పోషిస్తుంది. చూడటానికి కోపిష్ఠిగా కనిపించినా మనసు మాత్రం వెన్నలాంటిది. బాధ్యతలేని అన్నను దార్లో పెట్టడానికి ఎటువంటి ప్రయత్నాలు చేసింది అన్నది కథ. 

సినిమా ప్రారంభం 

1975లో యాక్టింగ్‌ స్కూల్‌లో ఎంపిక చేసిన ఆర్టిస్ట్‌లతో బాలచందర్‌ సినిమా ప్రారంభించాలనుకున్నారు. తమిళ వర్షన్‌కి ఆయనే మాటలు రాసుకున్నారు. తెలుగు విషయానికొచ్చే సరికి ఆత్రేయగారి చెంతకు చేరారు. కథ ఆయనకి నచ్చడంతో వెంటనే పాటలతో సహా బౌండెడ్‌ స్క్రిప్ట్‌ తయారు చేసి బాలచందర్‌కి అందజేశారు. ఏకధాటిగా 6 నెలలు చిత్రీకరణ చేశారు. మొదటిసారి ఈ సినిమా కోసం బాలచందర్‌ వైజాగ్‌ వెళ్లారు. అక్కడి వాతావరణం ఆయనకి నచ్చడంతో మేజర్‌ సినిమా అంతా అక్కడే చిత్రీకరించారు. 1976 ఫిబ్రవరి 27న 'జ్యోతి'వంటి భారీ చిత్రాల మధ్య విడుదలై ఘన విజయం సాధించిందీ సినిమా. 

హైలైట్‌గా నిలిచిన అంశాలు: 

కుటుంబ భారాన్ని మోసే యువతిగా సరిత పాత్రలో జయప్రద నటన, బాధ్యత తెలియని అన్నగా మూర్తి పాత్రలో రజనీకాంత్‌ పాత్రలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణ అని చెప్పుకోవచ్చు. 

ఇక అమాయకుడిగా, వన్‌ సైడ్‌ లవర్‌గా మిమిక్రీ ఆర్టిస్ట్‌గా జీవితం సాగించే వికటకవి గోపాల్‌గా నారాయణరావు క్యారెక్టర్‌  వినోదం పంచింది. 

ఆత్రేయ సాహిత్యానికి ఎమ్మెస్‌ విశ్వనాథన్‌ అందించిన సంగీతం ఒక ఎత్తైతే, లోకనాథన్‌ కెమెరా పనితనం మరో ఎత్తని చెప్చొచ్చు. 

తాళికట్టు శుభవేళ,

అరె ఏమిటి లోకం, 

దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి.. 

ఇందులో ప్రతి పాట ఆణిముత్యమే. అన్ని సందర్భోచితంగా ఉంటాయి. ప్రతి పాట కథని చెబుతూ పాత్ర స్వభావాన్ని వివరిస్తూ, చక్కని సందేశం అందించేలా రాశారు ఆత్రేయ. సినిమా విడుదలై 40 ఏళ్లు అయినా ఆ పాటలు ఇప్పటికీ మన చెవుల్లో మారుమ్రోగుతుంటాయి. తాళికట్టు శుభవేళ పాట అయితే ప్రతి పెళ్లి ఇంట్లోను వినబడాల్సిందే. 

బ్లాక్‌ అండ్‌ వైట్‌ రోజుల్లో కూడా ప్రతి సీన్‌ను ఎంతో అందంగా తీర్చిదిద్దిన ఘనత, కలర్‌లేని రోజుల్లో జయప్రదను అందాల రాశిగా చూపించిన ఘనత ఆయనకే దక్కుతుంది. అందుకే కాబోలు బ్లాక్‌ అండ్‌ వైట్‌ చిత్రాలకు ఛాయగ్రాహకుడిగా మూడుసార్లు జాతీయ పురస్కారాలు అందుకున్నారు. 

ఇక కె.బాలచందర్‌తో సినిమా అంటే ఫుల్‌ పెర్‌ఫెక్షనిస్ట్‌గా తయారవ్వాలి. ఒక షాట్‌ తియ్యాలంటే ఒకటి రెండ్రోజులు రిహార్సెల్‌ చెయ్యాల్సిందే. ఒక షాట్‌ బాగా రావడానికి అవసరమైతే వంద టేక్‌లు కూడా తీసుకునేవారట. 6 నిమిషాల తాళికట్టు శుభవేళ పాటను నారాయణరావుపై మూడు రోజులు చిత్రీకరించారు. అది కూడా కొరియోగ్రాఫర్‌ లేకుండా. మరో సన్నివేశంలో అయితే రజనీకాంత్‌ 'నేను చెయ్యలేను గురువుగారు' అంటూ తప్పుకోబోయారట. నువ్వు చెయ్యగలవ్‌.. చేస్తే మంచి పేరొస్తుంది అని చెప్పడంతో జయప్రద బ్యాంక్‌ పాస్‌ పుస్తకాలు విసిరే సన్నివేశం, దేవుడే ఇచ్చాడు పాటలో కర్టెన్‌ వెనుక ఉండే సన్నివేశాలు చేశారట రజనీ. అయితే ఈ సినిమాతో కెరీర్‌ ప్రారంభించిన ప్రతి ఒక్కరూ బాగానే స్థిరపడ్డారు. 

తొలి చిత్రమే బాలచందర్‌గారి దర్శకత్వంలో చెయ్యడం తన అదృష్టమనీ, వికటకవి గోపాల్‌ పాత్ర కమల్‌హాసన్‌ తమిళంలో చేసినదానితో పోల్చితే 80శాతం చేశావనీ బాలచందర్‌ అనడం కన్నా గొప్ప విషయం ఏముంటుంది అని పలు సందర్భాల్లో నటుడు, నిర్మాత నారాయణరావు అన్న సంగతి తెలిసిందే. పైగా అక్కినేని నాగేశ్వరరావు నీలో కనిపిస్తున్నారయ్యా అని కూడా దర్శకుడు ప్రశంసించారట నారాయణరావుని. 

సినిమా విడుదలైన కొన్నాళ్లకు  ఈ సినిమాకు సీక్వెల్‌ తియ్యమనీ, సీరియల్‌గా తియ్యమని అభిమానులు కోరారట. ఇది 'అంతులేని కథ'. దీనికి సీక్వెల్‌ ఉండదు అంటూ కె.బాలచందర్‌ జవాబిచ్చేవారని చిత్ర యూనిట్‌ చెబుతుంది. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs