కె.సి.ఆర్.కు రెబల్‌స్టార్ అభినందన మందారమాల
తెలంగాణ ముఖ్యమంత్రి కె.సి.ఆర్. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన చండీ యాగానికి అన్నివర్గాల నుండి అద్భుత స్పందన లభించింది. అలాగే ఆ యాగానికి హాజరైన సినీ, రాజకీయ, పారిశ్రామిక రంగాల ప్రముఖులతో పాటు సామాన్య ప్రజానీకానికి కూడా అదొక గొప్ప ఆథ్యాత్మిక అనుభూతిని కలిగించింది. ఈ నేపథ్యంలో సుప్రసిద్ధ కథానాయకులు, కేంద్ర మాజీ మంత్రివర్యులు అయిన రెబల్‌స్టార్ కృష్ణంరాజు తన అనుభవాన్ని సినీజోష్ తో షేర్ చేసుకున్నారు.
కె.సి.ఆర్. గారి ప్రత్యేక ఆహ్వానాన్ని పురస్కరించుకుని నేను ఈ యాగానికి సకుటుంబ సమేతంగా వెళ్లాను. కె.సి.ఆర్.గారు నన్ను రిసీవ్ చేసుకున్న విధానం గానీ, అంతటి మహా యాగాన్ని అత్యంత సమర్ధవంతంగా నిర్వహించిన విధానం గానీ నన్ను బాగా ఆకట్టుకున్నాయి. తను స్వయంగా ఎదురొచ్చి నన్ను, నా కుటుంబాన్ని చాలా ఆప్యాయంగా రిసీవ్ చేసుకున్నారు. ఈ సందర్భంలో నాకు కె.సి.ఆర్. గారికి మధ్య చాలా ఆసక్తిదాయకమైన సంభాషణ జరిగింది. నేను నటించిన మూడు గొప్ప పాత్రలు మీలో కనిపిస్తున్నాయి అన్నాను.
ఏమిటవి అన్నారు కె.సి.ఆర్. గారు ఆసక్తిగా...
ఎన్ని కష్టాలు ఎదురైనా ఊరి ప్రజల మంచి కోసం పాటుపడిన బొబ్బిలి బ్రహ్మన్న, దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన తాండ్ర పాపారాయుడు, అచంచలమైన దైవభక్తికి ప్రతీకగా నిలిచిన భక్తకన్నప్ప మీలో కనిపిస్తున్నారు. అలాగే కె.సి.ఆర్.గా, చంద్రశేఖరరావుగా, కల్వకుంట్ల చంద్రశేఖరరావుగా కూడా మీరు ప్రజలకు చేరువయ్యారు. మంచి అడ్మినిస్ట్రేటర్‌గా మీ శక్తి, ఈ చండీయాగ నిర్వహణతో మీ భక్తి నిరూపితమయ్యాయి అని నేను అభినందించాను. నా అభినందనను మనస్ఫూర్తిగా స్వీకరిస్తూ థాంక్యూ వెరీ మచ్ అన్నారు కె.సి.ఆర్. అంటూ తమ మధ్య జరిగిన సంభాషణను వివరించారు కృష్ణంరాజు. ఏదో కలిశాం కాబట్టి ముఖస్తుతిగా మాట్లాడడం కాదు, నిజంగానే కె.సి.ఆర్. గారి పరిపాలనా దక్షత, దైవ భక్తి నన్ను బాగా ఆకట్టుకున్నాయి. నేను చేసిన ఆ మూడు పాత్రల ఔన్నత్య, వ్యక్తిత్వాలు ఆయనలో నాకు కనిపించాయి. అంటూ కె.సి.ఆర్.ను ప్రశంసలలో ముంచెత్తారు రెబల్‌స్టార్ కృష్ణంరాజు.
Prabhu