రామ్, కీర్తి సురేష్ జంటగా కృష్ణ చైతన్య సమర్పణలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై స్రవంతి రవికిషోర్ నిర్మిస్తున్న చిత్రం 'నేను.. శైలజ'. కిషోర్ తిరుమల దర్శకుడు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని జనవరి 1న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు కిషోర్ తిరుమల తో సినీజోష్ ఇంటర్వ్యూ..
ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు..? మీ బ్యాక్ గ్రౌండ్ ఏంటి..?
మా నాన్నగారు తిరుపతి దేవస్థానంలో పని చేస్తుంటారు. నాకు సినిమాల మీద ఉన్న మక్కువతో తిరుపతికి వచ్చిన కొందరు సినీ ప్రముఖులకు నా గురించి చెప్పడంతో వాళ్ళ ద్వారా 2005లో ఇండస్ట్రీకి వచ్చాను. కొరటాల శివ, బి.వి.ఎస్.రవి ల దగ్గర రైటర్ గా పని చేశాను. సూపర్ గుడ్ ఫిలిం వారు తమిళంలో నిర్మించిన ఒక చిత్రానికి దర్శకత్వం వహించాను. ఆ తరువాత తెలుగులో 'సెకండ్ హ్యాండ్' సినిమా చేశాను. 'నేను.. శైలజ' నా మూడవ సినిమా.
ఈ సినిమా గురించి చెప్పండి..?
ఇది మెయిన్ హీరో, హీరోయిన్, హీరోయిన్ తండ్రి చుట్టూ జరిగే కథ. అనవసరమైన ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయగలిగినప్పుడు ప్రేమను ఎందుకు ఎక్స్ప్రెస్ చేయలేరనే పాయింట్ తో నడుస్తుంది. మూడు సంవత్సరాల క్రితం నా జీవితంలో జరిగిన ఓ రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించాను.
'నేను.. శైలజ' అవకాశం ఎలా వచ్చింది..?
ఈ సినిమా కథ రాసుకొని స్రవంతి రవికిషోర్ గారికి వినిపించాను. ఆయనకు కథ బాగా నచ్చింది. ఈ కథ బ్యానర్ కు దగ్గరగా ఉందని చెప్పి స్క్రిప్ట్ డెవలప్ చేయమని చెప్పారు. రామ్ గారికి కూడా కథ వినిపించాను. ఆయన కూడా ఓకే చెప్పారు.
ఈ సినిమా ప్రేక్షకులకు ఎంత వరకు రీచ్ అవుతుందని అనుకుంటున్నారు..?
కథ రాసుకున్నప్పుడు ప్రతి పాత్ర రియలిస్టిక్ గా ఉండాలని జాగ్రత్తగా రాసుకున్నాను. సినిమా చూస్తున్నట్లు కాకుండా ఒక జీవితాన్ని చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. నాకు న్యాచురల్ గా ఉండే సినిమాలంటే ఇష్టం. పంచ్ డైలాగ్స్ కాకుండా ఎక్స్ప్రెస్ చేసే విధానం కొత్తగా ఉండాలనుకుంటాను. ఈ సినిమా చూస్తున్నంతసేపు ప్రతి సీన్ ఒక స్మైల్ తో చూస్తారు. 'నువ్వే కావాలి' , 'నువ్వు నాకు నచ్చావ్' సినిమాల మాదిరిగా ఉంటుంది. సినిమాపై చాలా నమ్మకంగా ఉన్నాను. మంచి అవుట్ పుట్ కోసం అందరం ఒక టీం లా కష్టపడి పని చేశాం.
హీరో రామ్ ఇప్పటివరకు ఎనర్జిటిక్ గా ఉండే పాత్రల్లోనే నటించారు. ఈ సినిమాలో తన క్యారెక్టర్ ఎలా ఉంటుంది..?
ఇందులో రామ్ నైట్ క్లబ్ లో పని చేసే డి.జె పాత్రలో కనిపిస్తాడు. తను అనుకున్న ప్రతి విజయాన్ని చక్కగా ఎక్స్ప్రెస్ చేసే వాతావరణంలో పెరుగుతాడు. రామ్ సెట్స్ కి వచ్చినప్పుడు మీరు ఎలా చెప్తే అలా ఫాలో అయిపోతానని చెప్పాడు. ఓ బ్లాంక్ ఫేస్ తో వచ్చి నేను చెప్పింది చేశేవాడు. ఈ సినిమాలో రామ్ కొత్తగా, ఫ్రెష్ గా కనిపిస్తాడు.
హీరోయిన్ కీర్తి సురేష్ ను సెలక్ట్ చేసుకోవడానికి కారణం..?
సినిమాలో హీరోయిన్ అంటే ప్రేక్షకుల్లో ఒక హీరోయిన్ అని కాకుండా పక్కింటి అమ్మాయిలా అనిపించే విధంగా ఉండాలి. ఆడియన్స్ చూడగానే కనెక్ట్ అయ్యే విధంగా ఉంది. ఫ్రెష్ ఫేస్ అయితే మంచి ఫీల్ ఉంటుందని కీర్తి ను ఎంపిక చేసుకున్నాం. ఈ సినిమాలో తన క్యారెక్టర్ లైవ్లీ గా ఉంటుంది.
నెక్స్ట్ ప్రాజెక్ట్స్..?
స్క్రిప్ట్స్ రెడీగా ఉన్నాయి. ఈ సినిమా రిలీజ్ తరువాత ఏం చేయాలో ఆలోచిస్తాను. లవ్ జోనర్ లోనే ఎక్కువగా సినిమాలు చేయాలనుకుంటున్నాను అంటూ ఇంటర్వ్యూ ముగించారు.