గోపీచంద్, రెజీనా జంటగా భవ్య క్రియేషన్స్ పతాకంపై ఏ.ఎస్.రవికుమార్ చౌదరి దర్శకత్వంలో ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం 'సౌఖ్యం'. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని డిశంబర్ 24న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా దర్శకుడు రవికుమార్ చౌదరితో సినీజోష్ ఇంటర్వ్యూ..
సక్సెస్ బాటలో వెళ్ళాలని చేశా..
'పిల్లా నువ్వులేని జీవితం' సినిమా తరువాత సక్సెస్ బాటలో వెళ్లాలని చేసిన ప్రయత్నమే ఈ 'సౌఖ్యం'. రకరకాల కథలు కాంబినేషన్స్ అనుకున్న తరువాత 'యజ్ఞం' కాంబినేషన్ రిపీట్ చేశాం. సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు ఎక్కువగా ఉంటాయి. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ కు అనుగుణంగా ఉన్న కథకు ఆహ్లాదకరమైన ఎంటర్ టైన్మెంట్ ను జోడించి సినిమాను తెరకెక్కించాం. కథ కొత్తదని చెప్పను కాని కథనం మాత్రం కట్టిపడేసే విధంగా ఉంటుంది.
నాకు మొదటి అవకాశం ఇచ్చారు..
భవ్య క్రియేషన్స్ ఆనంద్ ప్రసాద్ ప్రసాద్ గారు ఇండస్ట్రీలోకి వచ్చిన తరువాత మొదటి అవకాశం ఇచ్చారు. 'మనసుతో' అనే చిత్రానికి కలిసి పని చేశాం. మరోసారి పొరపాటు జరగకూడదని జాగ్రత్తగా ఈ సినిమా చేశాం. జూన్ లో మొదలు పెట్టిన ఈ సినిమా పక్కా ప్లానింగ్ తో ఆరు నెలల్లో కంప్లీట్ చేశాం. స్క్రిప్ట్ పక్కాగా ఉండడం వలనే తొందరగా పూర్తి చేయగలిగాం.
పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది..
ఎడిటింగ్ డిపార్ట్మెంట్, డబ్బింగ్ డిపార్ట్మెంట్ వారు సినిమా బాగా వచ్చిందని చెప్పారు. సెన్సార్ బోర్డు వారి దగ్గర నుండి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ప్రసాద్ మురేళ్ళ గారి ఫోటోగ్రఫీ సినిమాకు ప్లస్ అయింది. అనూప్ అందించిన పాటలకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది.
తన డాన్స్ చూసి ఆశ్చర్యపోయా..
రెజీనాతో 'పిల్లా నువ్వులేని జీవితం' సినిమా కోసం కలిసి పని చేశాను. ఆ సినిమా కంటే ఈ చిత్రంలో రెజీనా చాలా అందంగా, గ్లామరస్ గా కనిపిస్తుంది. తను డాన్స్ చేస్తుంటే చూసి ఆశ్చర్యపోయాను. రెజీనాలో అంత మంచి డాన్సర్ ఉందని నాకు తెలియదు. ఈ సినిమాతో తనకు మంచి కమర్షియల్ బ్రేక్ వస్తుంది.
తన వ్యక్తిత్వం మారలేదు..
'యజ్ఞం' సినిమాకు గోపీచంద్ నేను కలిసి వర్క్ చేశాం. అప్పటికి, ఇప్పటికి తన వ్యక్తిత్వంలో ఎలాంటి మార్పు రాలేదు. ఆర్టిస్ట్ గా మాత్రం తనలో చాలా మెచ్యూరిటీ వచ్చింది. అప్పట్లో మాసివ్ లుక్ తో ఉండేవాడు. ట్రెండ్ కు అనుగుణంగా తనని తాను మౌల్ద్ చేసుకుంటూ.. కొత్తగా కనిపిస్తున్నాడు.
కామెడీ ఎవ్వర్ గ్రీన్..
మూస కథలతో సినిమా చేస్తున్నారని అందరు అంటున్నారు. నిజానికి నాలుగైదు సంవత్సరాలకు ఒకసారి ట్రెండ్ మారుతూ ఉంటుంది. ప్రస్తుతం ఎంటర్ టైన్మెంట్ బాగా నడుస్తోంది. ఎప్పటినుండో కామెడీ చిత్రాలు వస్తున్నాయి. 'గుండమ్మ కథ','ఆహనా పెళ్ళంట' ఇలా చాలా కామెడీ చిత్రాలు వచ్చాయి. కామెడీ ఎవ్వర్ గ్రీన్. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ చిత్రాల్లో కూడా కామెడీ ఉంటుంది.
రైటర్ కు రెస్పెక్ట్ ఇస్తా..
మంచి కథ వచ్చినప్పుడు ఎవరి దగ్గర నుండైనా తీసుకోవచ్చు. నేను దర్శకుడిని కాకముందు రచయితనే. రైటర్ కు రెస్పెక్ట్ ఇస్తాను. ఆయన చెప్పిన కథకు నాలుగైదు సార్లు విని నా వెర్షన్ కూడా రాసుకుంటాను. నా స్టైల్ లో సినిమా తీస్తాను అంటూ ఇంటర్వ్యూ ముగించారు.