నిర్మాతల మండలిలో అవకతవకలు జరుగుతున్నాయని వాటిని అరికట్టే విధంగా చర్యలు తీసుకోవాలనే విషయాలపై నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు మొదటగా స్పందించారు. ఆ వివరాలను తెలిపేందుకు ప్రత్యేకంగా ఇసి మెంబర్స్ అయిన నిర్మాతలతో శనివారం హైదరాబాద్ లోని విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సమావేశంలో..
చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ''ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ లో లొసుగులు మెల్లమెల్లగా బయటపడుతున్నాయి. నా సాటి నిర్మాత ఫోన్ చేసి కొందరు స్వార్ధంతో నిర్మాతల మండలిలో డబ్బును వారి స్వప్రయోజనాల గురించి ఉపయోగించుకుంటున్నారని తెలిపాడు. కౌన్సిల్ లో ఉన్న 2000 మందికి ఈ విషయాన్ని తెలియబరచాలనే ఉద్దేశ్యంతో అందరికి మెసేజ్ లు పంపాం. ఆ మరుసటి రోజునే ఇ.సి మీటింగ్ ను నిర్వహించారు. ఆ మీటింగ్ లో తప్పు చేసిన వారిని నిర్ధారించడానికి వాళ్ళ మనిషయిన దాసరి గారిని నియమించాలని చెప్పారు. దాసరి గారిని నియమించడంలో మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అయితే మా సలహా కూడా తీసుకొని వోట్ల పద్దతిలో ఓ వ్యక్తిని ఎన్నుకోవాలని భావిస్తున్నాం. ఎవరి మీదనో కక్ష తీసుకోవాల్సిన అవసరం మాకు లేదు. రాజ్యాంగ పరంగా నడుచుకోవాలనేదే మా ఉద్దేశ్యం'' అని చెప్పారు.
మోహన్ గౌడ్ మాట్లాడుతూ.. ''2003 నుండి సుమారుగా 3 కోట్ల రూపాయలను మిస్ యూజ్ చేసారు. స్వార్ధం, స్వప్రయోజనాల కోసమే నిర్మాతల మండలిని వినియోగిస్తున్నారు. మేజర్ ఫండ్స్ అన్ని జెనరల్ బాడీ కు ట్రాన్స్ ఫర్ చేసి వారి అధ్వర్యంలో డబ్బు వినియోగించాలి'' అని చెప్పారు.
ఇంకా ఈ కార్యక్రమంలో బసిరెడ్డి, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, సంగిరెడ్డి దశరధ్, ప్రసన్న కుమార్, తదితరులు పాల్గొన్నారు.