Advertisement
Google Ads BL

సినీజోష్ ఇంటర్వ్యూ-కమల్ హాసన్


విశ్వనటుడు, లోకనాయకుడు కమల్‌హాసన్‌ కథానాయకుడిగా రాజేష్‌.ఎం.సెల్వ దర్శకత్వంలో రాజ్‌కమల్‌ ఫిల్మ్స్‌ ఇంటర్నేషనల్‌, శ్రీ గోకుళం మూవీస్‌  సంయుక్తంగా నిర్మించిన సినిమా చీకటిరాజ్యం. త్రిష, మధుశాలిని కథానాయికలుగా నటించారు. ప్రకాష్‌రాజ్‌ కీలకపాత్రధారి. ఈ సినిమా ఈనెల 20న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా థియేటర్లలోకి రిలీజవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రచారకార్యక్రమాల్లో పాల్గొన్న కమల్‌హాసన్‌తో సినీజోష్ ఇంటర్వ్యూ.. 

Advertisement
CJ Advs

'చీకటిరాజ్యం' ఎలా ఉండబోతోంది..?

ఓ మంచి యాక్షన్‌ సినిమా తీశాం. టైటిల్‌లానే కథాంశం యూనిక్‌గా ఉంటుంది. అడుగడుగునా ఉత్కంఠ రేకెత్తించే సినిమా ఇది. ఒక డేలో, ఒక నైట్‌లో సాగే కథతో ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. దీనిని ఫాస్ట్‌ ఫేస్‌ థ్రిల్లర్‌ అని అనొచ్చు. ఇది కొత్త జోనర్‌ సినిమా. స్టయిలిష్‌ థ్రిల్లర్‌ మూవీ. ఈనెల 20న తెలుగులో గ్రాండ్‌గా రిలీజ్‌ చేస్తున్నాం.

దీపావళి రిలీజ్‌ అన్నారు, కాస్త ఆలస్యం అవుతున్నట్టుంది?

మంచి రిలీజ్‌ తేదీ, మంచి థియేటర్ల కోసం వేచి చూశాం. అందుకే కొంత ఆలస్యం.

ఫ్రెంచి సినిమా 'స్టీప్‌లెస్‌ నైట్స్‌' ని 'చీకటిరాజ్యం'గా రీమేక్‌ చేయాలనుకోవడానికి కారణం?

'స్టీప్‌లెస్‌ నైట్స్‌' ఆసక్తి రేకెత్తించే ఓ మంచి సినిమా. ఇలాంటి ఓ సినిమా చేయాలి అన్న ఆసక్తితోనే ఈ సినిమా చేశాం. జనక్‌ జనక్‌ పాయల్‌.. ఇన్‌స్పిరేషన్‌తోనే 'సాగర సంగమం' తీశాం. కె.విశ్వనాథ్‌ అలాంటి సినిమా చేయాలనుకున్నారు కాబట్టే 'సాగరసంగమం' తీయగలిగాం. విశ్వనాథ్‌, జంధ్యాల మంచి సినిమాల ఇన్‌స్పిరేషన్‌తో సినిమాలు తీసేవారు. నేను కూడా అలాగే చేస్తున్నా.

మీరు డైరెక్ట్ చేయకపోవడానికి కారణం?

బాలచందర్‌ గారు నాకు ఎలా అవకాశం ఇచ్చారో.. అలాగే నేను కూడా నా శిష్యునికి అవకాశం ఇచ్చాను. కొత్త నటీనటులు, సాంకేతిక నిపుణులకు అవకాశాలు ఇవ్వాలి. ఇచ్చినప్పుడే వారి ప్రతిభ బయట ప్రపంచానికి తెలుస్తుంది. ఒక దర్శకుడు లేదా వ్యక్తిలోని ప్రతిభను గుర్తించడం అనేది ఓవర్‌నైట్‌లో జరగదు. నేను 36 సినిమాలకు పనిచేసిన తర్వాతే బాలచందర్‌ గుర్తించారు. బహుసా 25వ సినిమా నుంచి ఆయనకు అర్థమయ్యానేమో. ఫర్లేదు .. బాగానే చేస్తున్నావ్‌ అని అనడానికి అంత టైమ్‌ పడుతుంది. నా సినిమా దర్శకుడు రాజేష్‌ రాజ్‌కమల్‌ బ్యానర్‌తో చాలా కాలంగా ట్రావెల్‌ అవుతూ బాగానే నేర్చుకున్నాడు. ఎంబిబిఎస్‌ పూర్తి చేసి, డైరెక్టర్‌ అయ్యాడు. సినిమా కూడా ఓ సర్జన్‌ చేసే పనిలాంటిదే. ఆ పని విజయవంతంగా పూర్తి చేశాడు. 

ఈ సినిమాలో మీరెంతవరకు ఇన్వాల్వ్ అయ్యారు..?

స్క్రీన్‌ప్లే అందించాను. అయినా సినిమా అనేది టీమ్‌ వర్క్‌. కె.విశ్వనాథ్‌, బాలచందర్‌ తమ సినిమాలకు దర్శకులుగా పనిచేసినా అసిస్టెంట్లుగా కలిసిపోయి పనిచేసేవారు. నేను కూడా అంతే. నేనే నటుడిని, నేనే అసిస్టెంటుని, అన్నీ నేనే అన్నట్టే పనిచేస్తాను.

'చీకటిరాజ్యం' పూర్తి కమర్షియల్‌ ఫార్మాట్‌లో ఉంటుందా?

కమర్షియాలిటీ అనేది విడిగా చూడలేం. కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ని యాడ్‌ చేయడం అనేది ఉండదు. అవి కథలోనే ఉంటాయి. 

మీలో స్టార్‌ని టెక్నీషియన్‌ డామినేట్‌ చేస్తాడని చెబుతారు?

స్టార్‌ అనే పిలుపు కంటే కమల్‌హాసన్‌ అనే టెక్నీషియన్‌ అని పిలిపించుకోవడానికే ఇష్టపడతాను. నా యూనిట్‌లో ప్రతి ఒక్కరికి సమాన ప్రాధాన్యత ఉంటుంది. నటులు, టెక్నీషియన్స్‌ ఆర్డర్‌లో చెప్పాలంటే  రాజేష్‌, ఘిబ్రాన్‌, కమల్‌హాసన్‌ అనే ఆర్డర్‌ని ఇష్టపడతాను. 

వైవిధ్యాన్ని ఇష్టపడే నటుడు మీరు .. ఈ చిత్రంలో వైవిధ్యం ఏం ఉంది?

ఈ సినిమాలో కొత్తగా ఏం ఉంది? అని అడిగితే ఏదేదో చూపించేస్తున్నా అనే గలాటా ఉండదు. కన్ఫ్యూజన్‌ లేని సినిమా. మీరంతా సినిమా చూసి .. ఇది వేరేగా చేశాడు కదా అని అంటారు. 

హీరో క్యారెక్టర్‌ ఎలా ఉంటుంది?

ఈ సినిమాలో హీరో రోల్స్‌ రాయిస్‌లో తిరిగే రిచ్‌ గయ్‌ కానేకాదు. ఓ మెడికల్‌ రెప్‌లా తిరిగేస్తూ అన్నీ తెలుసుకునేవాడిగా కనిపిస్తాడు. 

త్రిష గురించి?

త్రిష మా యూనిట్‌కి కొత్తేమీ కాదు.. ఇప్పటికే ఓ సినిమాకి కలిసి పనిచేశాం. తను తన క్యారెక్టర్‌కి రచయితగానూ కొనసాగింది. ప్రతిరోజూ తనతో కలిసి పనిచేస్తుంటే తెలిసిన స్నేహితురాలితో కలిసి పనిచేస్తున్నట్టే ఉంటుంది. ఈ సినిమాకి పనిచేసిన నటీనటులు, టెక్నీషియన్స్‌ ప్రతి ఒక్కరూ అసిస్టెంట్‌ డైరెక్టర్లుగానే పనిచేశారు. 

ఎన్నిరోజుల్లో సినిమా పూర్తి చేశారు?

ఈ సినిమాకి పనిచేసింది 54 పని దినాలు. అందులోనే తెలుగు వెర్షన్‌, తమిళ వెర్షన్‌ రెండూ షూట్‌ చేశాం. భాషని బట్టి సెట్‌లో బోలెడన్ని మార్పులు, చేర్పులు చేశాం. ఒక్కో వెర్షన్‌కి 30రోజులు పనిచేశాం అనుకోవచ్చు. 

జయాపజయాలకు కారణాల్ని విశ్లేషిస్తుంటారా?

సక్సెస్‌ అనేది ఒకరి వల్లనే అని చెప్పలేం. బ్యాడ్‌ డిస్ట్రిబ్యూషన్‌, బ్యాడ్‌ రిలీజ్‌ వల్ల ఫెయిల్యూర్స్‌ ఎదురవుతుంటాయి. ఫ్లాప్‌కి రకరకాల కారణాలుంటాయి. మంచి కంటెంట్‌ ఉన్నా ఒక్కోసారి సరైన రిలీజ్‌ కుదరపోతే అపజయాలు ఎదురవుతుంటాయి.

వైవిధ్యమైన సినిమాలు చేస్తుంటారు.. అవి అనుకున్నంతగా ఆడకపోతే ...?

దేశంలోనే అత్యధిక పారితోషికం అందుకునే నటుడు కమల్‌హాసన్‌ అని మీరే అంటుంటారు. అంటే నటుడిగా నా స్థాయిని మీరే నిర్ణయించినట్టే కదా! సినిమాలు ఆడకపోతే అలా పిలుస్తారా?

తెలుగులో మీరు పెద్ద స్టార్‌. నేరుగా తెలుగు సినిమాలు ఎందుకు చేయడం లేదు?

నాకు అనిపించి చేయడం కంటే.. ఎందుకు చేయరు? అని మీరు అడిగారు. అదే గొప్ప అప్లాజ్‌ అని ఫీలవుతాను. అయినా నేను చేసిన 'చీకటిరాజ్యం' తెలుగులో నేరుగా చేసినదే. తెలంగాణలో కొంత భాగం, తమిళనాడులో కొంత భాగం చిత్రీకరించాం. ఈ సినిమా తర్వాత మరో తెలుగు సినిమా చేస్తున్నా. అక్కినేని అమల గారు ఆ చిత్రంలో నటిస్తున్నారు. ఓ యువకథానాయికను ఎంపిక చేశాం అంటూ ఇంటర్వ్యూ ముగించారు.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs