ఏపీలో ఆర్టీసీ చార్జీలు పెరగనున్నాయి. ఈ దిశగా ప్రభుత్వం ప్రజల్లోకి సూచనలు పంపింది. చార్జీలు పెంచే ముందు అన్ని ప్రభుత్వాలు చెప్పినట్టే నష్టాలను సాకుగా చూపుతూ ప్రభుత్వం ధరల పెంపు తప్పదని ప్రకటించింది. అయితే ఏమేర చార్జీల పెంపు ఉండనుందనే విషయాన్ని మాత్రం స్పష్టం చేయలేదు.
ఇటీవలే తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసీ కార్మికులకు వేతనాలను భారీగా పెంచారు. దీంతో ఆ సంస్థపై మోయలేని భారం పడింది. దీనికిడోతు ప్రైవేటు ట్రావెల్స్ బిజినెస్ ఏపీలో జోరుగా సాగుతుండటంతో ఆర్టీసీ లాభాలపై అది తీవ్ర ప్రభావం చూపింది. దీనికితోడో తెలంగాణలో అమలు చేస్తున్న రోడ్డు ఎంట్రీ ట్యాక్స్ కూడా ఆర్టీసీ నష్టాలపాలవడానికి కారణమైంది. ప్రస్తుతం ఏపీలో ఆర్టీసీ ఏడాదికి రూ. 600 కోట్ల నష్టాల్లో ఉందని మంత్రి శిద్దా రాఘవరావు, ఆర్టీసీ ఎండీ సాంబశివరావు పేర్కొన్నారు. తప్పని పరిస్థితుల్లో చార్జీలు పంచాల్సి వస్తోందని, దీన్ని ప్రజలు అర్థం చేసుకుంటారని వారు ప్రకటించారు. ఈ చార్జీల పెంపు అమలు దసరాకు ముందే ఉండే అవకాశాలున్నాయి. మరోవైపు రాజధాని శంఖుస్థాపన జరగనుండటంతో ఆనందంలో ఉన్న రాష్ట్ర ప్రజలకు ఇది ఏమాత్రం రుచించని విషయమే. మరోవైపు ప్రతి విషయంలో ఏపీతో పోటీపోటీగా ఉండే తెలంగాణ ప్రభుత్వం చార్జీల పెంపు విషయంలో ఎలా స్పందించనుందో వేచిచూడాలి.