అనుష్క ప్రధాన పాత్రలో టైటిల్ రోల్‌లో గుణా టీమ్ వర్క్స్ పతాకంపై శ్రీమతి రాగిణీ గుణ సమర్పణలో డైనమిక్ డైరెక్టర్ దర్శక నిర్మాతగా రూపొందుతున్న భారతదేశపు తొలి హిస్టారికల్ స్టీరియోస్కోపిక్ 3డి ద్విభాషా చిత్రం రుద్రమదేవి. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని అక్టోబర్ 9న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా దర్శకుడు గుణశేఖర్ తో సినీజోష్ ఇంటర్వ్యూ..
రుద్రమదేవి సినిమా చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది..?
నేను ఎనిమిదవ తరగతి చదువుతున్నప్పుడు తెలుగు ఉపవాచకంలో రుద్రమదేవి కథ ఉండేది. అప్పుడే రుద్రమదేవి చరిత్ర గురించి తెలిసింది. అందులో పాత్రలు నన్ను బాగా ఆకట్టుకున్నాయి. కథ బాగా ఆకర్షించింది. చదువు పూర్తయ్యాక చెన్నై కు వెళ్లి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసాను. ఆ సమయంలో బ్రేవ్ హార్ట్ అనే సినిమా చూసి చాలా ఇన్స్పైర్ అయ్యాను. తెలుగులో ఇలాంటి చిత్రాలు ఎందుకు రావట్లేదనుకున్నాను. అప్పుడే రుద్రమదేవి చరిత్రను సినిమాగా తెరకెక్కించాలనుకున్నాను.
రుద్రమదేవి చరిత్రను యధాతదంగా ఈ చిత్రంలో చూపించారా..?
13 వ శతాబ్దానికి చెందిన కాకతీయుల కథను ఏ మాత్రం వక్రీకరించకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. రుద్రమదేవి చరిత్ర గురించి ఎన్నో పుస్తకాలు చదివాను. కొన్ని పుస్తకాల్లో కన్ఫ్యూజన్స్ ఉండడంవలన రీసెర్చ్ టీం ఏర్పాటు చేసుకున్నాను. తోటప్రసాద్, మధు బాబు ఇలా ఎందరో సలహాలు సూచనలు తీసుకున్నాను. ముఖ్యంగా ముదిగొండ ప్రసాద్ గారు ఎంతగానో సహకరించారు. కేవలం పుస్తకాల మీదే ఆధారపడకుండా కాకతీయుల కాలంనాటి శిలాశాసనాలను ప్రేరణగా తీసుకొని కథను రూపొందించాను. ఈ కథ నిడివి రెండు గంటల ముప్పై ఏడు నిమిషాలు. గొప్ప స్పూర్తినిచ్చే చరిత్రను కేవలం రెండు గంటల సమయంలో చూపించడం చాలా కష్టమైన విషయం. ఎంతో సాహసంతో కూడుకున్న పనది. అయితే ఈ చరిత్ర ద్వారా నేను ప్రభావితం అయిన విషయాలను ప్రాధాన్యంగా తీసుకొని ప్ర్రేక్షకులను ప్రభావితం చేసే విధంగా కథను మలిచాను. రుద్రమదేవి పుట్టుక నుండి ఆవిడ విజయానికి కారణమైన ఓ ఘట్టాన్ని ఈ చిత్రంలో చూపించబోతున్నాం.
దర్శకత్వంతో పాటు నిర్మాణ బాధ్యతలు కూడా చేపట్టడానికి కారణం..?
ఒక్కడు సినిమా తరువాత రుద్రమదేవి సినిమా చేస్తే కమర్షియల్ గా వర్కవుట్ అవుతుందని భావించి ప్రీప్రొడక్షన్ పనులు కూడా మొదలుపెట్టాం. ఇరవై నుండి ఇరవై ఐదు కోట్ల బడ్జెట్ అంచనా. అయితే నిర్మాతలు మాత్రం లేడీ ఓరియెంటెడ్ సినిమాగా కాకుండా గోనగన్నారెడ్డి పాత్ర ప్రధానంగా చూపిస్తూ సినిమా చేయమని చెప్పారు. కాని నా దృష్టిలో రుద్రమదేవి నే కమర్షియల్ విషయం. వారు చెప్పిన విధంగా సినిమా చేయడానికి నేను సిద్ధంగా లేను. ఒక్కడు సినిమా తరువాత ఎక్కువ రెమ్యునరేషన్ ఆఫర్ చేయబడ్డ దర్శకుడ్ని నేను. ఆ సమయంలో కూడా నేను రుద్రమదేవి సినిమా చేయలేకపోయాను. ఎన్ని సినిమాలు చేస్తున్నా.. నాకు తృప్తిగా అనిపించలేదు. రుద్రమదేవి చిత్రం కోసం ఎంత బడ్జెట్ అవుతుందో తెలిసే సినిమా చేయడానికి సిద్ధపడ్డాను. సినిమా మేకింగ్ మీద నాకు ఎలాంటి ఒత్తిడి లేదు. నిర్మాణ భాధ్యతలు మొత్తం నా భార్యే చూసుకుంది.
ఇంత పెద్ద బడ్జెట్ లో సినిమా చేయడం రిస్క్ అనిపించలేదా..?
బేసిక్ గా నాకు సినిమా చేయాలనే ప్యాషన్. అదొక్కటే నాకు తృప్తినిస్తుంది. ఒక్కడు సినిమా కమర్షియల్ ప్రాజెక్ట్ అని ఎంతగా నమ్మానో.. దానికి పదింతలు రుద్రమదేవి కమర్షియల్ హిట్ అవుతుందని భావిస్తున్నాను.
చారిత్రాత్మక చిత్రం 3డి లో ఎందుకు చేయాలనుకున్నారు..?
3డి లో చేయడం వలనే కాస్త రిస్క్ అనిపించింది. చాలా మంది 3డి చేయడం ఆపేద్దామని సలహా ఇచ్చారు. కాని నాకు మధ్యలో వొదిలేయడం ఇష్టంలేదు. హిస్టారికల్ జోనర్ చిత్రాన్ని 3డి లో కూడా చూపించాలనుకున్నాను. నేను చూడాలని వుంది సినిమాలో మొదటిసారిగా డిటిఎస్ టెక్నిక్ ను ఇంట్రడ్యూస్ చేసాను. అప్పటి రోజుల్లోనే 25 లక్షల అదనపు ఖర్చు పెరిగింది. కాని నిర్మాత నన్ను నమ్మి సినిమా చేసారు. చూడాలని వుంది సినిమా రిలీజ్ అయిన తరువాత డిటిఎస్ లేని సినిమా రాలేదు. అలానే సైనికుడు సినిమాలో డిఐ టెక్నిక్ పూర్తిస్థాయిలో ఉపయోగించాను. దానికోసం ప్రత్యేకంగా హాలీవుడ్ టెక్నీషియన్ ను పిలిపించాం. ఆ సినిమా విడుదల తరువాత డిఐ లేని సినిమా రాలేదు. రుద్రమదేవి సినిమా కోసం స్టెప్ ముందుకువేసాం. 3డి తో ఇంకా పెద్ద స్టెప్ వేసాం. చాలా హర్డిల్స్ ఫేస్ చేసాం. రిలీజ్ డేట్ రెండు మూడు సార్లు మార్చడానికి కారణం కూడా అదే. సోషల్ ఫిలిం అయితే నేను 3డి చేసేవాడ్ని కాదు. హిస్టారికల్ ఫిలిం కాబట్టే 3డి చేసాను.
బాహుబలి విజయం మీకు ఎలా హెల్ప్ అయింది..?
బాహుబలి సినిమాకు ముందే రుద్రమదేవి చిత్రం మొదలయ్యింది. ఆ సినిమా రిలీజ్ కు ముందే మా సినిమా బిజినెస్ దాదాపుగా పూర్తయింది. కాకపోతే ఆ సినిమాతో కొత్తఒరవడి పలికింది. బాహుబలి విజయం కారణంగానే రుద్రమదేవి హిందీలో మార్కెట్ చేసేందుకు అవకాశం లభించింది.
ఆర్టిస్టుల గురించి..?
అనుష్క లేకపోతే రుద్రమదేవి సినిమా లేదు. రానా చాణక్య వీరభద్రుడి పాత్రలో నటించాడు. గోనగన్నారెడ్డి పాత్ర కోసం ఎవరిని ప్రత్యేకంగా సంప్రదించలేదు. మహేష్ బాబు అయినా ఎన్టీఆర్ అయినా వారికి సినిమా మీద ఉన్న ఆసక్తితో నటించాలనుకున్నారు కాని కుదరలేదు. అల్లు అర్జున్ మాత్రం నా దగ్గరకి వచ్చి నన్ను ఎలా వాడుకుంటారో.. మీ ఇష్టం సర్ అని చెప్పారు. రేసుగుర్రం లాంటి బ్లాక్ బాస్టర్ హిట్ తరువాత బన్నీ నా దగ్గరకు వచ్చి సినిమా చేస్తానన్నాడు. తనకు సూట్ అయ్యే బాడీ లాంగ్వేజ్ తో కొన్ని మార్పులు చేసి సినిమా చేసాను.
రెండు రాష్ట్రాల విభజన తరువాత సినిమాలో ఏమైనా మార్పులు చేసారా..?
రుద్రమదేవి ఎన్నో సంవత్సరాల క్రిందటి చరిత్ర. దానికి ప్రాతీయ బేధాలు లేవు. విభజన తరువాత నేను ఎలాంటి మార్పులు చేయలేదు. సెన్సార్ సభ్యులు కూడా సినిమా చూసి ఎలాంటి మార్పులు చేయమని చెప్పలేదు. వారు సెన్సార్ చేసినప్పుడు వారి మధ్య చరిత్రకారులు ఉండేలా జాగ్రత్త పడ్డారు.
ప్రతాపరుద్రుడు అనే సినిమా రుద్రమదేవికి సీక్వెల్ గా చేస్తారని మాటలు వినిపిస్తున్నాయి..?
నిజానికి ప్రతాపరుద్రుడు కాకతీయుల వంశంలో చివరిగా పరిపాలించిన రాజు. పరిస్థితులు అనుకరిస్తే ఖచ్చితంగా సేక్వేల్ చేయాలనే ఆలోచన ఉంది అంటూ ఇంటర్వ్యూ ముగించారు.