ఎంఐఎం పార్టీ ఒకప్పుడు హైదరాబాద్‌కు మాత్రమే పరిమితమైంది. అయితే ఓవైసీ సోదరులకు ఆ పార్టీని దేశవ్యాప్తంగా విస్తరించాలనే కోరిక ఉన్నట్టు కనిపిస్తోంది. అందుకే ప్రస్తుతం బిహార్ ఎన్నికల్లోనూ ఆ పార్టీ పోటీ చేస్తోంది. ఇక ఎంపీ అసదుద్దీన్‌కుతోడుగా అక్బరుద్దీన్ కూడా ప్రచారపర్వంలోకి దూకారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకులను తీవ్రంగా విమర్శిస్తూ సోదరులిద్దరూ ముస్లిం ఓట్లను తమ ఖాతాలో వేసుకోవడానికి కష్టపడుతున్నారు.
మహారాష్ట్ర అసెంబ్లీ, మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు ఎంఐఎంకు కొత్త దారి చూపింది. హైదరాబాద్‌కే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా ముస్లిం జనాభా అధికంగా ఉన్న స్థానాల్లో తాము పోటీకి దిగుతామని ఎంపీ అసద్దుదీన్ ఓవైసీ ప్రకటించారు. ఇక ప్రస్తుతం ముస్లింకు బీజేపీకి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీయే కనిపిస్తోంది. ఆ స్థానంలోకి ఎంఐఎంను తీసుకొచ్చి దేశవ్యాప్తంగా ముస్లింలకు ప్రధాన పార్టీగా మారాలన్నదే ఓవైసీ సోదరుల వ్యూహం. కాని అక్కడ ఆర్జేడీకి కూడా ముస్లింలు ప్రధాన మద్దతుదారులుగా ఉన్నారు. అదే సమయంలో ఎంఐఎం కూడా అక్కడ పోటీ చేస్తుండటంతో ముస్లిం ఓట్లు చీలి బీజేపీకే లబ్ధి చేకూర్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎంఐఎం బిహార్ ఎన్నికల్లో పోటీ చేయడాన్ని జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్‌లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కాని ఆ రాష్ట్రంలో పాగా వేయడమే లక్ష్యంగా ఓవైసీ సోదరులు మాత్రం పోటీకి వెనుకడటం లేదు. అంతేకాకుండా బిహార్‌లో ఎంఐఎం పోటీతో హిందూ ఓటర్లు కూడా పూర్తిగా బీజేపీవైపే మొగ్గుతారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇలా రెండు రకాలుగా ఎంఐఎం బీజేపీకి లబ్ధి చేసినట్లవుతోంది.