ఒకప్పుడు నాగం జనార్దన్‌రెడ్డి టీడీపీలో ఓ వెలుగు వెలిగాడు. మంత్రిగా, ప్రధాన నాయకుడిగా టీడీపీలో ఆయనకు ఎనలేని ప్రాధాన్యతదక్కింది. ఆయన విమర్శల్లోని వాడివేడి టీడీపీకి అధికారంలో ఉన్న సమయంలోనూ.. ప్రతిపక్షంలో ఉన్న సమయంలోనూ లబ్ధి చేకూర్చాయి. కాని ఇప్పుడు నాగం పరిస్థితి మారిపోయింది. టీడీపీనుంచి బయటకు వచ్చి కొత్త పార్టీని స్థాపించి.. అది నడపలేక చివరకు బీజేపీలో కలిసిన ఆయనకు ఇప్పుడు కాలం ఏమాత్రం కలిసిరావడం లేదు. బీజేపీలో కొందరు ఆయన ఎదుగుదలను అడ్డుకుంటున్నారని, ఆయనకు ఏమాత్రం ప్రాధాన్యత దక్కకుండా చేస్తున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే నాగం బీజేపీలో కొనసాగుతున్నా.. ప్రత్యేక కార్యచరణతో ఆందోళనలు చేపట్టారన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఇక కొన్నాళ్లుగా ప్రాజక్టులను సందర్శిస్తూ ప్రభుత్వంపై అగ్గిమీద గుగ్గిలమైన నాగం.. ఇప్పుడు కిసాన్ బచావో యాత్రను చేపట్టారు. దీనికి బీజేపీ రాష్ట్ర అగ్రనాయకులు దూరంగానే ఉన్నారు. చివరకు ఆయనతో దీక్ష విరమింపజేయడానికి కూడా ఏ ఒక్క అగ్రనేత అక్కడకు రాలేదు. ఇక టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు రమణ నాగంతో దీక్ష విరమింపజేశారు. ఈ తతంగాన్ని చూస్తే నాగం బీజేపీని వదిలినా పట్టించుకునేది లేదని బీజేపీ నాయకులు భావిస్తున్నట్లు కనిపిస్తోంది. అదే సమయంలో నాగంకు టీడీపీ ద్వారాలు తెరిచే ఉన్నాయనే సంకేతాలు ఇస్తూ రమణ దీక్ష శిబిరానికి వెళ్లారు. చివరకు నాగం.. ఏ పార్టీనైతే వీడారో.. చివరకు అదే పార్టీలో చేరే సంకేతాలు కనిపిస్తున్నాయి.