మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సంస్థ వారికి అనుబంధంగా వెల్ఫేర్ కమిటీను ఏర్పాటు చేసిన దానికి చైర్మన్ గా సీనియర్ నటుడు నరేష్ ను నియమించారు. ఈ కమిటీ త్వరలోనే మా అసోసియేషన్ లో సభ్యత్వమున్న కళాకారుల వివరాలను సేకరించేందుకు సమగ్ర సర్వేను నిర్వహించనున్నారు. రీసెంట్ గా కెసిఆర్ కూడా ఇలానే అనేక సర్వేలను నిర్వహించారు. ఆయన బాటలోనే మా యూనిట్ వారు కూడా నడుస్తున్నారు. ఈ సందర్భంగా..
నరేష్ మాట్లాడుతూ.. మా లో సభ్యత్వమున్న కళాకారుల స్థితిగతుల గురించి, జీవన విధానాన్ని తెలుసుకోవడానికి సర్వేను నిర్వహించనున్నాం. ఆ సర్వే ఫలితాల ఆధారంగా కొన్ని గ్రేడుల ప్రకారం విభజించి సమన్యాయం చేస్తాం.. అని చెప్పారు.
ప్రెసిడెంట్ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. ఓ మంచి పని కోసం అందరం ఇలా ఒక్కటవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఆర్థికంగా వెనుకబడిన కళాకారులకు తమ వంతు సహాయ సహకారాల్ని అందించడానికి ముందుకొచ్చిన ఐఏఎస్ అధికారి చంద్రమౌళి గారికి నా అభినందనలు. మేము చేపడుతున్న ఈ సర్వేలో ప్రతి ఒక్కరు పాల్గొని తమ వివరాల్ని అందించాలి.. అని చెప్పారు.
కైకాల సత్యనారాయణ మాట్లాడుతూ.. సినీ కళాకారులను ఆదుకోవాల్సిన బాధ్యత అసోసియేషన్ లో సభ్యత్వమున్న ప్రతి ఒక్కరికి ఉంది. వారి జీవితాల్లో మార్పు కోసం చేపడుతున్న ఈ కార్యక్రమానికి నా వంతు సహకారం అందిస్తాను.. అని చెప్పారు.
మురళిమోహన్ మాట్లాడుతూ.. నూటికి తొంబై శాతం మంది ఆర్టిస్టులు కష్టాల్లోనే ఉన్నారు. వారందరి శ్రేయస్సు కోసం త్వరలోనే రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను కలిసి సహాయమందిచమని అడుగుతాం.. అని చెప్పారు.
ఇంకా ఈ కార్యక్రమంలో చంద్రమౌళి, శివాజీరాజా, మదాల రవి, మాధవరావు తదితరులు పాల్గొన్నారు.