సినీ దర్శక నిర్మాత సాయి వెంకట్ స్వర్ణభారతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో చిత్రపురి కాలనీ కమిటీ సభ్యుల ప్రోత్సాహంతో, సినీ పరిశ్రమ సర్వతో ముఖాభివృద్ధికై సామూహిక శ్రీ సత్య నారాయణ స్వామి వ్రతాలను నిర్వహిస్తున్నారు. అక్టోబర్ 4న ఆదివారం నాడు ఈ కార్యక్రమాన్ని చిత్రపురి కాలనీలో ఉదయం 5గంటల నుండి ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా..
సాయి వెంకట్ మాట్లాడుతూ.. ప్రతి ఏటా కూకట్ పల్లిలోని భ్రమరాంబ మండపంలో ఈ వ్రతాలను నిర్వహిస్తూ వచ్చాం. ఈ సంవత్సరం మాత్రం సినీ పరిశ్రమ శ్రేయస్సు కొరకు ఐదువేల కుటుంబాలు నివసిస్తున్న చిత్రపురి కాలనీలో ఈ సామూహిక శ్రీ సత్య నారాయణ స్వామి వ్రతాలను నిర్వహించాలని భావిస్తున్నాం. ఇప్పటికే నిర్మాతల మండలి, మా అసోసియేషన్ తదితర బృందాలను ఈ కార్యక్రమలో పాలుపంచుకోమని కోరాము. ఈ కార్యక్రమంలో ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరు పాల్గొనాలి కోరుకుంటున్నాను.. అని చెప్పారు.
తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ.. నాకు సాయి వెంకట్ గారు 10 సంవత్సరాలుగా పరిచయం. ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతుంటారు. 2008 నుంచి ఈ వ్రతాలను నిర్విరామంగా నిర్వహిస్తున్నందుకు ఆయనను అభినందిస్తున్నాను. సుమారుగా 10 నుంచి 15 లక్షల రూపాయలను ఈ వ్రతాల కోసం ఖర్చు పెడుతున్నారు. ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను.. అని చెప్పారు.