రవితేజ, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై సురేందర్ రెడ్డి దర్శకత్వంలో నందమూరి కళ్యాన్ రామ్ నిర్మిస్తున్న చిత్రం 'కిక్2'. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 21 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హీరో రవితేజతో సినీజోష్ ఇంటర్వ్యూ..
రాబిన్ హుడ్ పాత్రలో..
సుమారు రెండున్నర సంవత్సరాల క్రితం వక్కంతం వంశీ ఒక పాయింట్ చెప్పారు. దానిని స్టొరీ గా డెవలప్ చేయమని చెప్పాం. కథ రెడీ చేసినప్పుడు కిక్2 అని అనుకోలేదు. రెడీ అయిన తరువాత కిక్2 పర్ఫెక్ట్ యాప్ట్ అని భావించాం. ఈ సినిమాలో నా పాత్ర పేరు రాబిన్ హుడ్. తన స్వార్ధం కోసం జీవించే రాబిన్ తన లైఫ్ ఎలా లీడ్ చేసాడనేదే స్టొరీ. కిక్ కు సీక్వెల్ గా వస్తున్న కిక్2 లో కిక్ ను మించిన ఎంటర్టైన్మెంట్, కామెడీ ఉంటుంది. ఇది సీక్వెల్ అని చెప్తున్నారు కాని నిజానికి కిక్ ఒక కథ అయితే కిక్2 మరొక కథ. ఇవి రెండు భిన్నమైన కథలు.
కళ్యాణ్ రామ్ ప్రొడక్షన్ లో మొదటిసారి..
కళ్యాన్ రామ్ తో నాలుగైదు సంవత్సరాల క్రితమే పని చేయాల్సివుంది. కాని అప్పుడు కొన్ని కారణాల వలన కుదరలేదు. ఏదైతేనేమి ఓ మంచి సినిమా ఆయన బ్యానర్ లో చేసే అవకాశం వచ్చింది. పోస్ట్ ప్రొడక్షన్, డి.ఐ విషయాలలో ఎక్కడా క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాకుండా తీసారు. అందుకే రిలీజ్ కు లేట్ అయింది.
తమన్ మ్యూజిక్..
కిక్ తరువాత ఈ సినిమాకు కూడా తమనే మ్యూజిక్ అందించారు. సాంగ్స్ విన్నప్పుడు చాలా సాటిస్ఫైడ్ గా అనిపించింది. అంతేకాకుండా సమయం దొరకడం వలన పాటలు ప్రజలకు బాగా రీచ్ అయ్యాయి. మెలోడీ సాంగ్ అయితే నార్త్ స్టైల్ లో ఉందని చెబుతున్నారు. 'మమ్మీ' అనే పాట లిరిక్స్ నాకు బాగా నచ్చాయి.
సురేందర్ రెడ్డి నాకు మంచి ఫ్రెండ్..
సురేందర్ రెడ్డి అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నప్పటి నుంచి నాకు బాగా తెలుసు. మంచి ఫ్రెండ్. తన నుంచి కిక్ అనే సినిమా ఎవరు ఎక్స్ పెక్ట్ చేసి ఉండరు. అప్పటివరకు సీరియస్ యాక్షన్ సినిమాలు చేసే ఆయన తన జోనర్ మార్చుకొని 'కిక్' అనే మంచి ఎంటర్టైనింగ్ సినిమా తీసారు. 'కిక్' మరియు దాని తరువాత చేసిన 'రేసుగుర్రం' సూపర్ హిట్స్ గా నిలిచాయి. అలానే 'కిక్2' కూడా మంచి సక్సెస్ అవుతుందని ఆశిస్తున్నాను.
తను చాలా లక్కీ..
ఈ సినిమాలో లీడ్ క్యారెక్టర్ లో నటించిన రకుల్ చాలా టాలెంటెడ్. సినిమా కోసం హార్డ్ వర్క్ చేస్తుంది. ఈ మధ్య కాలంలో తను నటించిన సినిమాలన్నీ మంచి హిట్స్ సాధించాయి. టాలెంట్ తో పాటు తనకి లక్ కూడా ఫేవర్ చేస్తుంది.
ఎంటర్టైన్మెంట్ కే ప్రాముఖ్యత..
గతంలో నేను నటించిన 'నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్', 'శంభో శివ శంభో', 'నేనింతే' చిత్రాలు రొటీన్ వాటికి భిన్నంగా ఉంటాయి. ఆ సినిమాలు చూసిన చాలా మంది అలాంటి చిత్రాల్లో ఎప్పుడు నటిస్తారని అడిగారు. కాని భవిష్యత్తులో ఎంటర్టైన్మెంట్ ఎక్కువగా ఉన్న చిత్రాల్లోనే నటిస్తాను. నాకు అలాంటి సినిమాలే ఇష్టం.
ఫోటోగ్రఫీ ఎసెట్ అవుతుంది..
మనోజ్ పరమహంస గారి ఫోటోగ్రఫీ సినిమాకు పెద్ద ఎసెట్ అవుతుంది. 'ఏమాయ చేసావే', 'రేసుగుర్రం' వంటి చిత్రాలకు పనిచేసారాయన. అలానే సినిమాలో యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. కథతోనే యాక్షన్ ట్రావెల్ అవుతుంది. సినిమాలో ప్రతి సన్నివేశానికి ఇంపార్టన్స్ ఉంటుంది.
థాంక్స్ టు రాజమౌళి..
'బాహుబలి' సినిమా తరువాత సినిమా చూసే ప్రేక్షకుల్లో, సినీ ఇండస్ట్రీలో ఉండేవారి మైండ్ సెట్స్ మారాయి. బాహుబలి, శ్రీమంతుడు చిత్రాలు ఘన విజయం సాధించాయి. పెద్ద చిత్రాలే కాకుండా రీసెంట్ గా విడుదలయిన 'సినిమా చూపిస్త మావ' అనే సినిమాను కూడా ప్రేక్షకులు ఆదరించారు. బాహుబలి సినిమాతో తెలుగు చిత్రాల విలువ పెరిగింది. బాలీవుడ్ లో సైతం తెలుగు సినిమాలకు క్రేజ్ పెరిగింది. ఈ క్రెడిట్ అంతా రాజమౌళికే చెందుతుంది. థాంక్స్ టు రాజమౌళి.
కొత్త వాళ్ళు బాగా నటిస్తున్నారు..
రీసెంట్ గా విడుదలయిన 'సినిమా చూపిస్త మావ' చూస్తుంటే 2004 లో రిలీజ్ అయిన 'ఇడియట్' సినిమా గుర్తొచ్చింది. రాజ్ తరుణ్ చాలా బాగా నటించాడు. ఈ మధ్య కాలంలో వస్తున్న కుర్ర హీరోలంతా అధ్బుతంగా నటిస్తున్నారు. కొత్త సినిమాలు, కొత్త హీరోలు రావాలి. కాని తెలుగులో చిన్న బడ్జెట్ లో వస్తున్న కొత్త చిత్రాలకు ఆదరణ లభించట్లేదు. కొత్త వాళ్ళ మార్కెట్ పెరగట్లేదు. ఈ ధోరణి మారాలని కోరుకుంటున్నాను.
ఆ సినిమా రీమేక్ చేయాలనుకున్నా..
బాలీవుడ్ లో వచ్చిన 'స్పెషల్ చబ్బీస్' సినిమా తెలుగులో రీమేక్ చేయాలనుకున్నాం. ఆ సినిమా చాలా స్లో గా రన్ అవుతుంటుంది. తెలుగు నేటివిటీకు తగ్గట్లుగా చాలా మార్పులు చేయాలి. కాని రీమేక్ చేయడం కుదరలేదు.
మల్టీస్టారర్ అనుకున్నాం..
వీరుపోట్ల గారు వెంకటేష్ గారితో నాతో కలిసి ఓ సినిమా చేయాలనుకున్నారు. మల్టీస్టారర్ మా కాంబినేషన్ బావుంటుందనుకున్నారు. ఆ తరువాత మరే డిస్కషన్స్ జరగలేదు. మరి ఆ ప్రాజెక్ట్ ఉంటుందో లేదో చెప్పలేను.
భవిష్యత్తు గురించి ఆలోచించను..
ప్రస్తుతం కిక్2 రిలీజ్ కు రెడీ గా ఉంది. 'బెంగాల్ టైగర్' సినిమా కంప్లీట్ అయ్యే స్టేజ్ కు వచ్చింది. కొత్త ప్రాజెక్ట్ ఓకే చేయలేదు. నేను ఎప్పుడు రేపు ఏం జరుగుతుందని ఆలోచించను. వచ్చిన అవకాశాలలో సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోతాను.
డైరెక్టర్ గా సినిమా చేస్తా..
మొదట అసిస్టెంట్ డైరెక్టర్ గా ఇండస్ట్రీకు వచ్చి హీరో అయ్యాను. ఎప్పటికైనా నా డైరెక్షన్ లో ఓ సినిమా తెరకెక్కిస్తా. అయితే హీరోగా మాత్రం నేను నటించను వేరే హీరోతో చేస్తాను. ఖచ్చితంగా సినిమా అయితే చేస్తాను.
కిక్3 ఉంటుంది..
ఈ సినిమా రిలీజ్ అయిన తరువాత అన్ని కుదిరితే 'కిక్3' చేసే ప్లాన్ ఉంది అంటూ ముగించారు.