రాజ్, గీతా భగత్ జంటగా మహేష్ హిమ మూవీస్ మరియు ఐ ఫాంటసీ డిజైన్ స్టూడియోస్ సంయుక్తంగా మహేష్ దర్శకత్వంలో నిర్మించబడిన సినిమా 'కలయా నిజమా'. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఆగస్ట్ 7న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా దర్శకనిర్మాత మహేష్ తో సినీజోష్ ఇంటర్వ్యూ..
సినిమా ఎలా ఉండబోతోంది..?
ఇదొక ఫ్యామిలీ థ్రిల్లర్ మూవీ. ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది. కొత్తగా పెళ్ళైన జంట మధ్య ద్వేషం ఏర్పడితే ఎలాంటి పరిణామాలు ఎడురవుతాయనేదే ఈ కథ. మన సమస్యలను మనమే పరిష్కరించుకోవాలనేదే ఈ చిత్ర ఇతివృత్తం. ఇదొక వినూత్నమైన ప్రయత్నం. సెన్సార్ కార్యక్రమాల్లో ఈ చిత్రం క్లీన్ 'యు' సర్టిఫికేట్ పొందింది. ఆగస్ట్ 7న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. ఇటీవల విడుదలైన ఈ సినిమా పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. అలానే ఈ చిత్రాన్ని కూడా ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకంతో ఉన్నాం.
ద్వేషాన్ని గ్రాఫిక్స్ రూపంలో చూపించడానికి కారణం..?
భార్య భర్తల జీవితాలలో ప్రేమ వర్సెస్ ద్వేషం అనే ఆట ఆద్యంతం రసవత్తరంగా సాగే సోషియో ఫాంటసీ కథాంశంతో గ్రాఫిక్స్ హైలైట్స్ గా ఈ చిత్రాన్ని రూపొందించాం.ఈ సినిమాలో గ్రాఫిక్స్ పది నిమిషాల పాటు ఉంటుంది. ప్రతి మనిషిలో ద్వేషం ఉంటుంది. దానిని బయటకు తీసుకొచ్చి ఓ రాక్షసుడి రూపంలో చూపించాం. భారీగా సెట్స్ వేసి చూపించే స్తోమత లేక సి.జి ద్వారా మాకున్న స్త్రెంగ్థ్ ను ఉపయోగించి గ్రాఫిక్స్ చేసాం.
మొదటి సినిమాకే దర్శకనిర్మాతగా చేయడం కష్టం అనిపించలేదా..?
నేనొక ఆర్కిటెక్ట్ ను. సినిమాలపై ఆసక్తితో ఎన్నో లఘు చిత్రాలను తెరకెక్కించి అవార్డులను కూడా సొంతం చేసుకున్నాను. అయితే ప్రస్తుతం వస్తున్న చిత్రాలన్నీ ఒకే రీతిలో ఉంటున్నాయి. నాలుగు పాటలు, ఫైట్స్ రొటీన్ కథతో చిత్రాలొస్తున్నాయి. మంచి పరిణామంతో చిత్రాలు రావాలనుకున్నాను. అందుకే నేనే నేరుగా భిన్నంగా ఉండే కాన్సెప్ట్ తో చిత్రాన్ని తెరకెక్కించాలనుకున్నాను. నా దగ్గర చాలా కథలు ఉన్నాయి. అవన్నీ భారీ బడ్జెట్ తో కూడుకున్నవి. అయితే నిర్మాతలు ప్రయోగాత్మక చిత్రాలు చేయడానికి ఆసక్తి చూపడం లేదు. అందుకే నాకున్న పరిధిలో తక్కువ బడ్జెట్ లో సినిమా చేసాను. దర్శకుడిగా 24 క్రాఫ్ట్స్ లో నాకు అవగాహన ఉంది. కథపై క్లారిటీ ఉంది. అందుకే నేనే దర్శకత్వం వహిస్తూ నిర్మాణ బాధ్యతలు చేపట్టడం కష్టం అనిపించలేదు.
ఆర్టిస్టుల పెర్ఫార్మన్స్ గురించి..?
హీరో రాజ్ కొన్ని చిత్రాల్లో అతిథి పాత్రల్లో నటించాడు. హీరోగా తనకు ఇది మొదటి చిత్రం. హీరోయిన్ గా నటించిన గీతా భగత్ పాపులర్ యాంకర్. కొన్ని సీరియల్స్ లో కూడా నటించింది. ఈ సినిమాలో రాజ్, గీతా అధ్బుతంగా నటించారు.
ఈ సినిమా ఆడియన్స్ కు ఎంత వరకు రీచ్ అవుతుందనుకుంటున్నారు..?
మొదట సినిమా చేయాలనుకున్నప్పుడు అందరితో డిస్కస్ చేసాం. ప్రీ ప్రొడక్షన్ కోసం చాలా హొమ్ వర్క్ చేసాం. మేము తీసుకున్న పాయింట్ ప్రస్తుతం ఉన్నజెనరేషన్ కు బాగా కనెక్ట్ అవుతుంది. సమస్య వస్తే దాని నుండి దూరంగా వెళ్ళాలనుకుంటున్నారు కానీ పరిష్కరించుకోవట్లేదు. ఈ సినిమాలో ఆ పాయింట్స్ అన్ని చూపించాం. ఖచ్చితంగా ప్రేక్షకులకు రీచ్ అవుతుందనే నమ్మకం ఉంది.
ఎన్ని థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు..?
మొత్తం 25 థియేటర్లలో ఈ చిత్రాన్ని ఆగస్ట్ 7న రిలీజ్ చేస్తున్నాం. థియేటర్స్ సమస్య వలన ఎక్కువ చోట్ల రిలీజ్ చేయలేక ఆగస్ట్ 8, 9 తారీఖులలో మరో కొన్ని ఏరియాల్లో విడుదల చేస్తున్నాం. అలానే ఆగస్ట్ 8న యు.కె లో 10 థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ కానుంది. యు.ఎస్, ఆస్ట్రేలియాలో, కెనడా లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం అంటూ ఇంటర్వ్యూ ముగించారు.