వరంగల్ ఉప ఎన్నికలపై కాంగ్రెస్ భారీగా ఆశలు పెట్టుకుంది. ఈ ఉప ఎన్నికల్లో గెలిచి పార్టీ కార్యకర్తల్లో తిరిగి ఉత్సాహం నింపాలని కాంగ్రెస్ ప్రథమ శ్రేణి నాయకులు భావిస్తున్నారు. అందులో భాగంగా ఇక్కడినుంచి బరిలోకి దింపడానికి దీటైన అభ్యర్థి కోసం వారు అన్వేషణ కొనసాగిస్తున్నారు. మొదట ఇక్కడినుంచి మాజీ ఉపముఖ్యమంత్రి రాజయ్యను బరిలోకి దించాలని యోచించినా.. అతను టీఆర్‌ఎస్ వీడి రావడానికి ససేమిరా ఒప్పుకోలేదు. దీంతో లోక్‌సభ మాజీ స్పీకర్ మీరాకుమార్ పేరును తెరపైకి తెచ్చారు.
తెలంగాణ బిల్లు లోక్‌సభలో పాస్ కావడానికి మీరాకుమార్‌బాగానే సహకరించారు. దీంతో తెలంగాణవాదుల్లో ఆమె వైపు మొగ్గుచూపే అవకాశాలున్నాయి. అంతేకాకుండా తెలంగాణ రావడానికి సహకరించిన మీరాకుమార్‌పై టీఆర్‌ఎస్ కూడా అభ్యర్థిని నిలబెట్టే అవకాశాలు తక్కువేనని కాంగ్రెస్ నాయకులు యోచిస్తున్నారు. మరి మీరా కుమారి కోసం కేసీఆర్ ఓ ఎంపీ స్థానాన్ని వదులుకోవడానికి సిద్ధపడతారా అనేది అనుమానమే. ఇక ఈ విషయాన్ని పక్కనపెడితే దళితుల కోసం పోరాటం చేసిన మాజీ ఉప ప్రధాని బాబు జగ్జివన్‌రామ్ కుమార్తెగా మీరాకుమారికి దళితుల మద్దతు పెద్ద ఎత్తున లభించే అవకాశం ఉంది. దళితుల ఓట్లు ముకుమ్మూడిగా మీరాకుమారికే పడితే కాంగ్రెస్ గెలుపు ఖాయంగా కనిపిస్తోంది. ఈ పరిణామాలన్నింటినీ నిశితంగా పరిశీలించి మీరాకుమార్‌ని బరిలోకి దించాలని రాష్ట్ర నాయకులు సోనియాకు విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. మరి సోనియా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో..?