తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు ఆదివారం హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్ లో జరిగాయి. ఈ ఎన్నికల్లో డి.సురేష్ బాబు, దిల్ రాజు, సుధాకర్ రెడ్డి వర్గానికి చెందిన ప్రొగ్రెసివ్ ప్యానల్, నట్టికుమార్, టి.ప్రసన్న కుమార్ వర్గానికి చెందినా మన ప్యానల్ పోటీ పడ్డాయి. ఈ ఎన్నికలలో ఛాంబర్ అధ్యక్షునిగా డి.సురేష్ బాబు ఎన్నికయ్యారు. అయితే ఈ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని చిత్ర పరిశ్రమని బాగు చేసే ఉద్దేశ్యం సురేష్ బాబు బృందం లో లేదని నిర్మాత అల్లాని శ్రీధర్ తెలిపారు. ఈ సందర్భంగా..
అల్లాని శ్రీధర్ మాట్లాడుతూ "ఉమ్మడి రాష్ట్రం విడిపోయాక జరిగిన మొట్టమొదటి తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలివి. అసలు ఎన్నికలనేవి లేకుండా అందరం కలిసి పని చేయాలనే ఉద్దేశ్యంతో సురేష్ బాబు అండ్ కో ను అడగగా వారు అంగీకరించలేదు కదా కనీసం రెండు, మూడు పదవులు కూడా మాకు ఇవ్వడానికి ఇష్టపడలేదు. ముఖ్యమంత్రి కెసిఆర్ వచ్చినా మీరు గెలవడం అసాధ్యమని ఎన్నికలకు ముందు మమ్మల్ని అవమానాలకు గురిచేసారు. వోటర్లను వర్గాలుగా చీల్చి, భయబ్రాంతులకు గురి చేసి వాళ్ళతో వోట్లను వేయించుకున్నారు. చాలా మంది మెంబర్స్ కు మల్టిపుల్ కార్డ్స్ ఉన్నాయి. ఇంత చేసినా వారు కేవలం ఇరవై వోట్ల తేడాతో మాత్రమే నెగ్గారు. ఇది ఘన విజయం కాదు, ఘోరమైన అవమానం" అని చెప్పారు.
మురళి మోహన్ రావు మాట్లాడుతూ "ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశ్యంతో కాకుండా కేవలం వారి వ్యాపారాలను మెరుగుపరచుకోవడానికి, వారి సొంత లబ్ది కోసం, స్వార్ధం కోసం ఈ ఛాంబర్ ను నడిపిస్తున్నారు. తెలంగాణా ఫిలిం ఛాంబర్, తెలుగు ఫిలిం ఛాంబర్ అని రెండు భాగాలుగా విడగొట్టి ఎవరి బాధ్యతలు వారి అప్పజెప్పడమే ఈ సమస్యకు పరిష్కారం" అని చెప్పారు.
ఇంకా ఈ కార్యక్రమంలో మోహన్ గౌడ్, సంగిశెట్టి దసరథ్, శ్రీనివాసరెడ్డి, ప్రేమ రాజ్ తదితరులు పాల్గొన్నారు.