ఓటుకు కోట్లు కేసుతో ఇరుకునపడ్డ టీడీపీకి ఇప్పుడు కాసింత సాంత్వన లభిస్తోంది. ఈ కేసులో అరెస్టు అయిన తెలుగుదేశం పార్టీ నాయకులు, ఇతర నిందితులకు వరుసపెట్టి బెయిల్ మంజూరవుతోంది. ఇప్పటికే ఈ కేసులో రేవంత్‌రెడ్డి, సెబాస్టియన్, ఉదయసింహలకు బెయిల్ మంజూరైన విషయం తెలిసిందే. ఇక తాజాగా ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు కూడా మంగళవారం ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరుచేసింది. రూ. 2 లక్షల పూచికత్తు చెల్లించాలని, తన నియోజకవర్గానికే పరిమితం కావాలన్న షరతులపై సండ్రకు కోర్టు బెయిల్ మంజూరుచేసింది.
మరోవైపు ఈ కేసు పురోగతిపై తెలంగాణ ప్రభుత్వం అసంతృప్తికి గురవుతున్నట్లు తెలుస్తోంది. కావాల్సినన్ని ఆధారాలు ఉన్నా.. నిందితులకు బెయిల్ దొరకడంపై అధికారపార్టీ ఏసీబీ అధికారులవద్ద అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. వీడియో ఫుటెజీలు, ఆడియో ఫుటేజీలకుతోడు పలు సాక్ష్యాలు ఉన్నా.. నిందితులకు బెయిల్ దొరకకుండా జైలుకే పరిమితం చేయడంలో ఏసీబీ విఫలమైనట్లు ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు ఈ కేసులో జైలునుంచి బయటకు వచ్చిన టీడీపీ నాయకులు ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలకు దిగుతున్నారు. ఇది ప్రజల్లో తమ మైలేజీని తగ్గిస్తుందని, కనీసం ఎమ్మెల్యే సండ్ర బెయిల్‌నైనా రద్దు చేసేలా ఏసీబీ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.