ఈరోజు ప్రారంభమైన పుష్కరాల్లో భాగంగా రాజమండ్రి పుష్కర ఘాట్‌లో జరిగిన తొక్కిసలాటలో 25 మంది మృతి చెందారు. మరో 30 మంది గాయపడ్డారు. ప్రభుత్వం మాత్రం అధికారికంగా 19 మాత్రమే మృతి చెందారని ప్రకటించింది. 25 వేల మంది ఒకేసారి స్నానం చేయడానికి అవకాశం వున్న ఈ పుష్కరఘాట్‌లో దానికి మించి భక్తులు రావడంతో ఈ తొక్కిసలాట జరిగింది. పోలీసులు కూడా భక్తుల్ని కంట్రోల్ చెయ్యలేకపోయారు. పుష్కర స్నానాలు ప్రారంభమైన తర్వాత ముందు వి.ఐ.పి.లకు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల అప్పటివరకు వేచి వున్న భక్తులు ఒక్కసారిగా పుష్కరఘాట్‌కి చేరుకోవడంతో ఈ తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాట జరిగిన తర్వాత అంబులెన్స్‌లు కూడా అందుబాటులో లేకపోవడం వల్ల ఎక్కువ ప్రాణ నష్టం జరిగిందని ప్రత్యక్ష సాక్షుల కథనం. ఈ దుర్ఘటనపై ఎ.పి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. పుష్కర స్నానాలు ప్రారంభమైన కొన్ని గంటల్లోనే ఇంత మంది ప్రాణాలు కోల్పోవడాన్ని తెలుసుకున్న చంద్రబాబు కంటతడి పెట్టుకున్నారు. చనిపోయిన వారికి ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది ప్రభుత్వం. ఇకపై ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటామని, పుష్కరాలు పూర్తయ్యే వరకూ తను రాజమండ్రిలోనే వుంటానని చంద్రబాబు చెప్తున్నారు.