పవన్ కల్యాణ్ ప్రెస్‌మీట్‌తో మరోసారి 'స్పెషల్ స్టేటస్', సెక్షన్-8 చర్చనీయాంశాలుగా మారాయి. అంతేకాకుండా నోరు తెరిస్తే సీమాంధ్ర పాలకుల వల్లే తెలంగాణ భ్రష్టు పట్టిందని కేసీఆర్ మాట్లాడుతున్నా.. ఆయన సమైక్య భావనకు స్ఫూర్తినిస్తున్నారంటూ పవన్ వ్యాఖ్యానించడం విస్మయం కలిగిస్తోంది. అంతేకాకుండా ఎంపీల పేర్లను పేరుపేరునా ప్రస్తావిస్తూ పవన్ విమర్శలు చేయడంపై అటు బీజేపీ ఇటు టీడీపీల ఎంపీలు కూడా గుర్రుగా ఉన్నారు. అయితే తమ పార్టీల అధిష్టానాలతో పవన్‌కు ఉన్న పరిచయంతో ఆయనపై ప్రత్యక్ష విమర్శలకు ఇప్పటివరకు వారు వెనకడుగు వేస్తున్నారు. అయితే ఈ విషయమై కొందరు టీడీపీ ఎంపీలు చంద్రబాబుకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఓవైపు రాష్ట్ర అభివృద్ధికి కేంద్రంపై ఒత్తిడి తెచ్చి అధిక నిధులను తెస్తున్నామని ఓవైపు టీడీపీ ప్రభుత్వం చేస్తున్న ప్రచారానికి పవన్ వ్యాఖ్యలు వ్యతిరేకంగా ఉన్నాయని, ఇది పార్టీకి నష్టం చేస్తుందంటూ వారు ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది.
మరోవైపు సెక్షన్-8 అమలుపై టీడీపీ పట్టుబడుతుంటే దాన్ని పవన్ పూర్తిగా వ్యతిరేకించడాన్ని సీమాంధ్ర ప్రజలతోపాటు తెలుగు తమ్ముళ్లు కూడా తట్టుకోలేకపోతున్నారు. అడుగడుగునా రెండు రాష్ట్రాల ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టడానికి చూస్తున్న కేసీఆర్‌లో పవన్‌కు సమైక్య స్ఫూర్తి ఎలా కనిపించదంటూ వారు మండిపడుతున్నారు. సీమాంధ్రకు చెందిన వ్యక్తిని యాద్రాద్రికి చీఫ్ ఆర్కిటెక్ట్‌గా నియమించినంత మాత్రాన కేసీఆర్‌ను పొగుడుతున్న పవన్.. మరి జలవివాదం, ఎంట్రీ ట్యాక్స్, ఉద్యోగుల విభజన, పవర్‌ప్లాంట్ల విషయంలో ఎలాంటి విధానాన్ని అనుసరిస్తున్నారో పవన్‌కు అర్థం కాలేదా అంటూ ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఎన్నికల ముందు చేసిన వాగ్దానాల్లో ఏ ఒక్కటీ నెరవేర్చని కేసీఆర్‌ను పవన్ పొగడటంపై ఇటు తెలంగాణ ప్రజలు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సీమాంధ్రకు జరుగుతున్న అన్యాయాల గురించి మాట్లాడిన పవన్.. తెలంగాణ ప్రజలకు జరుగుతున్న అన్యాయాలపై ఎందుకు మాట్లాడలేదని వారు ప్రశ్నిస్తున్నారు. ఇక కేసీఆర్‌నే కాకుండా చంద్రబాబును కూడా పవన్ పల్లెత్తు మాట అనలేదు. దీన్ని బట్టి ఇరు రాష్ట్రాల సీఎంలను మచ్చిక చేసుకోవడానికే పవన్ నిర్భయంగా మాట్లాడలేకపోయారని విమర్శలు వినిపిస్తున్నాయి.