'మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్' ఆధ్వర్యంలో నూతన కార్యవర్గం సభ్యులు సేవా కార్యక్రమాలు మొదలు పెట్టారు. 'మా' అసోసియేషన్ లో మెంబర్ షిప్ ఉన్న సభ్యులకు మాత్రమే కాకుండా దయనీయ పరిస్థితుల్లో ఉన్న పేద కళాకారులను కూడా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అక్కున చేర్చుకుంటుంది. వేదం, అయ్యారే వంటి చిత్రాలలో నటించిన నాగయ్య అనే వృద్దుడికి 'మా' అసోసియేషన్ తరపున దర్శకనిర్మాత సాయి వెంకట్ ఇరవై ఐదువేల రూపాయల ఆర్ధిక సహాయం అందించారు. 'లవకుశ' వంటి అధ్బుతమైన కళాఖండంలో నటించిన ఇయ్యూరు నాగసుబ్రహ్మణ్యం కు మరో పాతిక వేల రూపాయల సహాయం అందించింది 'మా' అసోసియేషన్. ఈ సందర్భంగా..
'మా' ప్రెసిడెంట్ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ "వెల్ ఫేర్ కమిటీ, విజులన్స్ కమిటీ అనే రెండు కమిటీలను ఏర్పాటు చేసి పేద కళాకారులకు సహాయం అందించే విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. సోషల్ మీడియా ద్వారా నాగయ్య అనే కళాకారుడు కష్టాల్లో ఉన్నాడని తెలిసింది. తెలిసిన వెంటనే ఆయనకు 'మా' అసోసియేషన్ లో సభ్యత్వం లేకపోయినా మేమంతా ఆయనకు సహాయం అందించాలని నిర్ణయం తీసుకున్నాం. ఇంత మంచి పనికి ఆర్ధిక సహాయం అందించిన సాయి వెంకట్ గారికి నా ధన్యవాదాలు. దయచేసి 'మా' అసోసియేషన్ లో అందరూ సభ్యత్వం తీసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాను" అని చెప్పారు.
శివాజీరాజా మాట్లాడుతూ "26 మంది సభ్యులతో ఈ అసోసియేషన్ ప్రారంభించాం. రెండు నెలలు ముందుగానే సేవా కార్యక్రమాలు మొదలుపెట్టాం. మొదట 35 మంది పేద కళాకారులకు 1000 రూపాయల చొప్పున పెన్షన్ ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు మరో 500 రూపాయలు కలిపి 1500 రూపాయల చొప్పున అందజేస్తున్నాం. ఆరోగ్య విషయం దృష్ట్యా హెల్త్ కార్డ్స్ పంపిణీ చేయాలనుకుంటున్నాం. దానికి సంబంధించిన లిస్టును చైర్మన్ నరేష్ గారు సిద్ధం చేస్తున్నారు. 'మేక్ ఏ విష్ ఫౌండేషన్' వారితో ఏకమయ్యి వారికి కూడా 'మా' సపోర్ట్ అందించనున్నాం" అని చెప్పారు.
ఇంకా ఈ కార్యక్రమంలో నరేష్, కాదంబరి కిరణ్, శశాంక్, సాయి వెంకట్, నాగయ్య తదితరులు పాల్గొన్నారు.