అక్రమాస్తుల కేసులో పదవికి రాజీనామా చేసి జైలు జీవితం కూడా గడిపిన జయలలితకు ప్రస్తుతం పరిస్థితులు చాలా అనుకూలంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ కేసులో జయలలిత నిర్దోషి అంటూ ఇప్పటికే కర్నాటక హైకోర్టు అక్రమాస్తుల కేసును కొట్టివేసింది. దీంతో 'అమ్మ' మళ్లీ తిరిగివచ్చి చెన్నైలో సీఎం పీఠం ఎక్కారు. ఇక ఆ తర్వాత ఎమ్మెల్యేగా గెలవడానికి చెన్నైలోని ఆర్‌కే సగర్ ఉప ఎన్నికల్లో ఆమె బరిలోకి దిగారు. ఈ ఉప ఎన్నికల్లో జయలలితకు ప్రజలు బ్రహ్మరథం పట్టి అత్యంత భారీ మెజార్టీతో ఆమ్మను శాసనసభకు పంపించారు.
గతంలో దేశంలోనే ఓ ఎమ్మెల్యే భారీ మెజార్టీతో గెలిచిన రికార్డ్ తిరుపతి నుంచి ఉంది. ఇక్కడ టీడీపీ ఎమ్మెల్యే 1.25 లక్షల మెజార్టీతో శాసనసభకు ఎంపికై ఓ రికార్డు సృష్టించారు. ఇక ఇప్పుడు ఆరకే నగర్ ఉప ఎన్నికల్లో జయలలిత లక్షన్నర ఓట్లతో విజయదుందుబి మోగించింది. అయితే ఈ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకే బరిలోకి దిగలేదు. ఇక ఈ సంగతిని పక్కనపెడితే త్వరలోనే జరగనున్న సాధారణ ఎన్నికల్లో ఏడీఎంకేను ప్రజలు తిరిగి గెలిపిస్తారనడానికి ఈ రికార్డ్ మెజార్టీ ఓ ఉదాహరణగా ఆ పార్టీ కార్యకర్తల చెప్పుకుంటున్నారు.