మరోసారి ఓ అపూర్వ కలయికకు రాజ్‌భవన్ వేదిక కానుంది. ప్రస్తుతం ఉప్పు, నిప్పులా ఉన్న కేసీఆర్, చంద్రబాబులు ఎదురెదురుపడే సందర్భం రానే వచ్చింది. రాష్ట్రపతి ప్రణభ్ ముఖర్జీ ఇప్పుడు హైదరాబాద్‌లో విడిదికి వచ్చిన సంగతి తెలిసిందే. ఇక రాష్ట్రపతి గౌరవార్థం గవర్నర్ నరసింహన్ మంగళవారం రాజ్‌భవన్‌లో విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఇరురాష్ట్రాల సీఎమ్‌లను కూడా ఆహ్వానించారు. రాష్ట్రపతి రానుండటంతో కేసీఆర్, చంద్రబాబులిద్దరూ ఈ కార్యక్రమానికి హాజరుకాక తప్పనిపరిస్థితి. రాజ్‌భవన్‌లో వారిద్దరూ ఒకరికొకరు ఎదురుపడ్డప్పుడు ఎలా స్పందిస్తారోనని ఇరు రాష్ట్రాల నాయకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
గత ఆరేళ్లుగా కూడా బాబు, కేసీఆర్‌లు ఉప్పు నిప్పులా ఉంటున్నారు. ఇరు రాష్ట్రాలకు వారు ముఖ్యమంత్రులైన తర్వాత వారి మధ్య వైషమ్యాలు మరింత పెరిగాయి. ఇక కేసీఆర్ రెండడుగులు ముందుకు వేసి బాబుపై తీవ్ర విమర్శలు చేస్తున్నాడు. అయితే ఈ తరుణంలోనే గతేడాది గవర్నర్ సమక్షంలో ఒకరినొకరు కలుసుకున్న కేసీఆర్, చంద్రబాబులు చాలాసన్నిహితంగా మెలిగారు. నవ్వుల పువ్వులు పూయిస్తూ.. జోక్‌లు వేసుకుంటూ యావత్ తెలుగు ప్రజలను విస్మయానికి గురిచేశారు. అయితే హైదరాబాద్‌లో ఉన్న పరరాష్ట్ర సీఎంకు మర్యాద ఇవ్వాల్సిన బాధ్యత తనదని, అందుకే ఆయన్ను మనస్ఫూర్తిగా పలకరించానంటూ ఆ తర్వాత కేసీఆర్ బదులిచ్చారు.
కాని ఇప్పుడు ఇరు రాష్ట్రాల సీఎంల మధ్య ఉన్న పరిస్థితి వేరు. రెండు పార్టీల మధ్య యుద్ధం తాడోపేడో తేల్చుకునే స్థాయికి చేరింది. దానికి సెక్షన్-8 మరింత ఆజ్యం పూసింది. గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో కేసీఆర్, బాబులు విమర్శలకు దిగుతున్నారు. ఇలాంటి తరుణంలో వీరిద్దరూ ఎదురుపడి ఎలా పలకరించుకుంటారోనని మీడియా వెయ్యి కళ్లతో ఎదురుచూస్తోంది.