తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అన్ని విషయాల్లోనూ పరస్పర విరుద్ధ ప్రకనటలు చేస్తున్నప్పటికీ ఓ విషయంలో మాత్రం ఎన్ని విమర్శలు వచ్చినా కలిసికట్టుగానే ముందుకు వెళుతున్నారు. ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఏపీలో వాస్తుదోషాలంటూ ముఖ్యమంత్రి కోట్లు ఖర్చుపెడుతుండగా.. కేసీఆర్ కూడా బాబుకు పోటీగా ఏకంగా సచివాలయాన్ని, సీఎం క్యాంపు ఆఫీసునే పూర్తిగా మార్చడానికే సన్నాహాలు చేస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. సీఎం చంద్రబాబు వాస్తు పేరుతో కోట్లకు కోట్లు దుబారా చేస్తున్నారంటూ నమస్తే తెలంగాణలో కథనం ప్రచురితం కావడం హాస్యాస్పదంగా మారింది.
సీఎం కేసీఆర్ సొంత పత్రికైన 'నమస్తే తెలంగాణ'లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గురించి ఓ వార్త కథనం ప్రచురితమైంది. రాష్ట్రం ఆర్థిక నష్టాల్లో ఉందని చెప్పుకుతిరుగుతున్న చంద్రబాబు రూ. 100 కోట్లకు పైగా వాస్తు, హైదరబాద్, విజయవాడల్లో భవనాల కోసం ఖర్చుచేశారని రాసింది. అయితే వాస్తు అంటే చంద్రబాబు కంటే కేసీఆర్‌కే ఎక్కువ నమ్మకమున్నట్లు ప్రజల్లో ప్రచారం ఉంది. దీనికి తగిన విధంగానే ఆయన కూడా కోట్లు ఖర్చుపెట్టి సీఎం క్యాంపు ఆఫీసుకు మరమ్మతులు చేయించారు. దీనికితోడు ఇప్పుడు వందకోట్లకుపైగా ఖర్చు అయినా పర్వలేదనుకుంటూ సెక్రెటెరియట్‌ను మార్చడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీనికోసం ఇప్పటికే ఎర్రగడ్డ టీబీ ఆస్పత్రిని, సికింద్రాబాద్‌లోని ఆర్మీ స్థలాలను కేసీఆర్ పరిశీలించారు. అయితే నమస్తే తెలంగాణలో కథనం ప్రచురితమయ్యే ముందు తమ యజమాని కూడా వాస్తు పేరుతో ఎంత ఖర్చు చేశారో ఆ పత్రిక ఎడిటర్ గమనించి ఉంటే బాగుండేదని టీడీపీ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి.