ఒకప్పుడు నరేంద్ర మోడీకి గురువుగా ఉన్న ఎల్‌కే అద్వానీ ఇప్పుడు ఆయనకు బద్ధ శత్రువుగా మారినట్లు కనిపిస్తోంది. మోడీ గురించి విమర్శలు చేయడానికి బీజేపీలో ఎవరూ సహసించరనే విషయం తెలిసిందే. అయితే అద్వానీ మాత్రం మోడీని ఏమాత్రం లెక్కచేయనట్లు కనిపిస్తోంది. ఏకంగా దేశంలో ఎమర్జెన్సీ పాలన వచ్చే అవకాశం ఉందంటూ అద్వానీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశంలో కలకలం రేగుతోంది.
1976-77లో దేశం ఎమర్జెన్సీ రుచిని చూసింది. ప్రధాని ఇందిరాగాంధీ తన అధికారాన్ని వినియోగిస్తూ దేశం యావత్తును చీకిటి రోజుల్లోకి నెట్టింది. ఆ తర్వాత ఆమెంత బలమైన నాయకుడు మళ్లీ కేంద్రంలో అధికారంలోకి రాలేదు. ఇప్పుడు ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీని అందరూ ఇందిరాగాంధీతో పోల్చుతున్నారు. అయితే అద్వానీ మాట్లాడుతూ.. ప్రస్తుతం ప్రజాస్వామ్యంలో నిబద్ధత కొరవడిందని, రాజకీయ నాయకుల్లో పరిణితి కనిపించడం లేదంటూ వ్యాఖ్యానించారు. అందువల్ల ఎప్పుడైనా మళ్లీ ఎమర్జెన్సీ రావొచ్చని వ్యాఖ్యానించారు. దీన్నిబట్టి మోడీ నియంతలా వ్యవహరిస్తున్నాడని, దేశం మళ్లీ అత్యవసర పరిస్థితిని ఎదుర్కొవచ్చని చెప్పకనే చెప్పారు. దేశం పరిస్థితి పక్కనపెడితే.. మోడీ హయాంలో అద్వానీకి మాత్రం చీకటి రోజులే మిగిలాయని ఆ పార్టీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.