తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు ఎంత చిచ్చు రాజేసాయో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. అయితే ఏపీలో మాత్రం ఎలాంటి వివాదాలు లేకుండా ఎమ్మెల్సీలు ఎన్నికవుతున్నారు. తాజాగా టీడీపీనుంచి మరో ముగ్గురు ఎమ్మెల్సీలుగా ఎన్నికవడం ఖాయమైంది. వీరు ఎమ్మెల్సీగా ఎన్నికైనట్లు ప్రకటించడం ఒక్కటే మిగిలిపోయింది. ఎమ్మెల్సీగా ఎన్నికైన వారిలో గాలి ముద్దుకృష్ణమనాయుడు, వైవీబీ రాజేంద్రప్రసాద్, బుద్ద వెంకన్నలున్నారు.
ముద్దుకృష్ణమనాయుడు టీడీపీలో సీనియర్ లీడర్‌గా ఉన్నారు. ఆయన ఆరుసార్లు శాసనసభకు ఎన్నికవడం గమనార్హం. టీడీపీనుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ముద్దు కృష్ణమనాయుడు గత ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. దీంతో ఆయనకు ఎమ్మెల్సీగా చంద్రబాబు అవకాశం కల్పించారు. ఇక కృష్ణా జిల్లాకు చెందిన వైౖవీబీ రాజేంద్రప్రసాద్ రెండోసారి శాసనమండలికి ఎన్నికయ్యారు. విజయవాడకు చెందిన బుద్ద వెంకన్న మాత్రం మొదటిసారిగా శాసనమండలికి ఎన్నికయ్యారు. ఈ రెండు రోజుల్లో వీరి ఎన్నిక గురించి టీడీపీ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.