ఆదిత్యా ఫిల్మ్స్ పతాకంపై ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ డి.వి.సీతారామరాజు(వైజాగ్ రాజు) నిర్మాతగా ఆయన తనయుడు కార్తిక్ ను కథానాయకుడిగా పరిచయం చేస్తున్న చిత్రం 'టిప్పు'. జగదీశ్ దానేటి దర్శకుడు. సంస్కృతి, కనికాకపూర్ నాయికలు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని జూన్ 19న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా హీరో కార్తిక్ తో సినీజోష్ ఇంటర్వ్యూ..
సినిమా ఎలా ఉండబోతోంది..?
ఇదొక యాక్షన్ బేస్డ్ మూవీ. మైసూర్ లో ఓ చిన్న పట్టణంలో ఈ సినిమా కథ జరుగుతూ ఉంటుంది. రాజ్యాలు పోయినా రౌడీయిజం మాత్రం ఇంకా పోలేదు. ఆ రౌడీయిజాన్ని అంతమొందించే ప్రాసెస్ లో ఓ ప్రేమ కథ కూడా ఉంటుంది. ఈ సినిమాలో నాదొక ఎన్నారై పాత్ర. ఇది రొటీన్ చిత్రాలకు భిన్నంగా ఉంటుంది. సినిమాలో ఆరు పాటలు ఉంటాయి. థాయ్ లాండ్ లో ఓ ఐలాండ్ తీసుకొని సాంగ్స్ షూట్ చేసాం. మెలోడీ మ్యూజిక్ అధ్బుతంగా ఉంటుంది.
సినిమాలో హైలైట్స్ ఏంటి..?
మణిశర్మ గారి మ్యూజిక్, రాజశేఖర్ గారి సినిమాటోగ్రఫీ అధ్బుతంగా ఉంటాయి. సినిమాలో సెకండ్ హాఫ్ చాలా ఎంటర్ టైనింగ్ గా సాగుతుంది. ఎమ్.ఎస్.నారాయణ గారు మనముందు లేకపోయినా సినిమాలో మాత్రం ప్రేక్షకులను నవ్విస్తూనే ఉంటారు.
డైరెక్టర్, మీ కో యాక్టర్ గురించి..?
జగదీశ్ గారు చెప్పిన స్క్రిప్ట్ నచ్చి నాన్నగారు వెంటనే ఓకే చెప్పారు. జగదీశ్ గారు బి.గోపాల్, పూరిజగన్నాథ్ వంటి దర్శకుల దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసారు. ఆయనకు ఇది మొదటి సినిమా అయినా చాలా అనుభవం ఉన్న దర్శకునిలా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇక నా కో యాక్టర్ కనికా కపూర్ ఢిల్లీ అమ్మాయి. తనకి తెలుగు రాకపోయినా తక్కువ సమయంలో భాష నేర్చుకొని నాతో సమానంగా నటించింది.
నటుడిగా మారడానికి కారణం..?
నాన్నగారు సినీ పరిశ్రమలో నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గా ఎన్నో చిత్రాలకు పని చేసారు. ఆయన ప్రభావం నాపై చాలా ఉంది. సినిమాలలోనే పుట్టి పెరగడం వలన ఏడు సంవత్సరాల వయస్సులోనే హీరో అవుదామనుకున్నాను. నా చిన్నప్పుడు సి.కళ్యాన్ గారు ఇంటికి వచ్చి 'నీకేంటి పెద్ద హీరో అవుతావ్' అనేవారు. నటనలో ప్రావీణ్యం పొందడానికి వైజాగ్ సత్యానంద్ గారి దగ్గర నాలుగు నెలల పాటు నటనలో శిక్షణ పొందాను. ఫైట్స్, డాన్సుల కోసం ప్రత్యేక శిక్షణ తీసుకున్నాను.
మొదటిసారి సినిమాలో నటించడం ఎలా అనిపించింది..?
చిన్నప్పటి నుండి సినిమాలతో కొంచెం టచ్ ఉండడం వలన నటించడం పెద్ద కష్టంగా అనిపించలేదు. సినిమా తీయడం అనేది చాలా కష్టమైన పని. ప్రొడక్షన్ బ్యాక్ గ్రౌండ్ నుండి హీరో అయ్యేసరికి ఒకవైపు యాక్టింగ్ మీద, మరోవైపు ప్రొడక్షన్ మీద కాన్సన్ట్రేట్ చేయాల్సి వచ్చింది. ఈ సినిమాలో చాలా మంది సీనియర్ నటులు నటించారు. చలపతిరావు గారు, నాగేంద్రబాబు గారు నన్ను చాలా ప్రోత్సహించారు.
సినిమాలు చూస్తారా..?
నాకు టైం దొరికితే చాలు అన్ని రకాలా సినిమాలు చూస్తాను. ముఖ్యంగా ఎన్.టి.రామారావు గారి సినిమాలు, నాగేశ్వరావు గారు నటించిన చిత్రాలు, జంధ్యాల గారి సినిమాలు బాగా చూస్తాను.
'టిప్పు' సినిమా ఎలాంటి రిజల్ట్ ఇస్తుందనుకుంటున్నారు..?
రెండు రోజులక్రితం సినిమా మొదటి కాపీ రెడీ అయిన తరువాత థియేటర్ లో చూసాం. సినిమా చూసిన వారంతా బావుందని, చాలా సినిమాలలో నటించిన అనుభవం ఉన్నట్లు నటించావని చెప్పారు. మొదటిసారి స్క్రీన్ పై నన్ను నేను చూసుకొని చాలా ఎక్సైట్ అయ్యాను. మణిశర్మ గారి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అధ్బుతంగా ఉంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఆడియోకి మంచి రెస్పాన్స్ వస్తోంది. సినిమాను కూడా ప్రేక్షకులు ఆదరిస్తారని భావిస్తున్నాను.
నెక్స్ట్ ప్రాజెక్ట్స్..?
రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో ఓ సినిమా చేయాలనుకున్నాం. ఆయన ట్రైనింగ్ కోసం నన్ను చునియా గారి దగ్గరకు పంపించారు. ఆ సమయంలో నా నటన నచ్చి చునియా గారు ఓ స్క్రిప్ట్ ఉంది చేస్తావా అనడిగారు. రాఘవేంద్రరావు గారితో సినిమా చేయడం కుదరలేదు కాని ప్రస్తుతం చునియా గారి సినిమా సెట్స్ పై ఉంది. అది కాకుండా మరో ద్విభాషా చిత్రంలో నటించమని ఆఫర్ వచ్చింది.