ఓటుకు నోటు కేసుకు సంబంధించి రాజకీయ వర్గాల్లో రోజురోజుకీ ఉత్కంఠత పెరిగిపోతోంది. ఇప్పటికే వేం నరేందర్‌రెడ్డి, సండ్ర వెంకటవీరయ్యలకు నోటీసులు పంపారు. వారు అందుబాటులో లేకపోవడం వల్ల నోటీసులు అందలేదు. అయితే ఎసీబి విచారణకు సహకరించేందుకు ఈరోజు ఉదయం వేం నరేందర్‌రెడ్డి బయలుదేరి వెళ్ళారు. ఇదిలా వుంటే వేం నరేందర్‌రెడ్డితో ఉదయం భేటీ జరిపిన ఎర్రబెల్లి దయాకర్‌రావు మీడియాతో మాట్లాడారు. సండ్ర వెంకటవీరయ్యకుగానీ, వేం నరేందర్‌రెడ్డికిగాని నోటీసులు అందలేదని, నోటీసులు అందకుండా విచారణకు ఎలా హాజరవుతారని ప్రశ్నించారు ఎర్రబెల్లి. అంతే కాకుండా వేం నరేందర్‌రెడ్డి హార్ట్ పేషెంట్ అని, అతనికి మేజర్ ఆపరేషన్ చెయ్యాలని డాక్టర్లు డేట్ కూడా ఇచ్చారని, అలాంటి వ్యక్తిని రాత్రికి రాత్రి విచారణకు రావాలని వత్తిడి చెయ్యడం ఎంతవరకు సమంజసమని అన్నారు. ఇదంతా చేతగాని గవర్నర్ నరసింహన్ వల్లే జరుగుతోందని, తనకు చేతకాకపోతే రాజీనామా చెయ్యాలని డిమాండ్ చేశారు ఎర్రబెల్లి. ఒక పథకం ప్రకారం కుట్ర పన్ని కెసీఆర్, అతని ప్రభుత్వం ఇవన్నీ చేస్తోందని, వీటన్నింటినీ తాము ఎదుర్కొంటామని ఎర్రబల్లి తెలియజేశారు.