మునుపెన్నడూ లేని విధంగా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎలక్షన్స్ ఎంత ప్రతిష్ఠాత్మకంగా, హోరా హోరీగా జరిగాయో మనం చూసాం. అధ్యక్ష పదవికి పోటీ చేసిన రాజేంద్రప్రసాద్, జయసుధ ఒకరిపై ఒకరు ఎలాంటి విమర్శనాస్త్రాలు సంధించుకున్నారో, ఈ ఎలక్షన్ ఎంతమందికి చర్చనీయాంశంగా మారిందో కూడా చూశాం. ఇప్పుడు ఇదే పరిస్థితి తమిళ చిత్రసీమలోనూ నడుస్తోంది. తమిళ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ నడిగర్ సంఘం ఎన్నికలు జూలై 15న జరగబోతున్నాయి. దీనికి సంబంధించి జూన్ 15 నామినేషన్‌కి ఆఖరు తేదీ. అధ్యక్ష పదవికి పోటీచేస్తున్న శరత్‌కుమార్, హీరో విశాల్ నామినేషన్స్ వేశారు. నామినేషన్‌కి ముందు నుంచే వీరిద్దరి మధ్య పత్రికాముఖంగా వాదోపవాదాలు జరుగుతూనే వున్నాయి. ఇప్పుడు లేటెస్ట్‌గా విశాల్ ఒక కొత్త విషయాన్ని ప్రస్తావించాడు. సాధారణంగా ఎన్నికలు ఆదివారం జరుగుతాయి. సెకండ్ సండే అయితే అందరికీ వీలుగా వుంటుంది. అలా కాకుండా బుధవారం ఎన్నికలు నిర్వహించాలని జూలై 15 తేదీని ఖరారు చేయడం పట్ల విశాల్ చెన్నై హైకోర్టును ఆశ్రయించాడు. దీనికి సంబంధించిన వాదోపవాదాలు జరుగుతున్నాయి. సినిమాలే కాకుండా బయటి విషయాల్లోనూ, సినిమా కళాకారులకు సంబంధించిన సమస్యల విషయంలోనూ త్వరగా స్పందించే విశాల్‌ను ఈసారి ప్రెసిడెంట్‌గా ఎన్నుకోవాలన్నది యువ హీరోల కోరిక. అందుకే అతన్ని ప్రెసిడెంట్ పదవికి పోటీగా నిలబెట్టారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అనే విషయం చివరి వరకూ తేలలేదు. కోలీవుడ్‌లో కూడా ఇదే పరిస్థితి వుండడం వల్ల ప్రెసిడెంట్‌గా ఎవరు గెలుస్తారన్నది ఇప్పుడే ఎవరూ చెప్పలేకపోతున్నారు.