కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ చిక్కుల్లో పడ్డారు. రెడ్‌కార్నర్ నోటీసు ఉన్న వ్యక్తికి వీసా ఇవ్వాలని సిఫార్సు చేస్తూ ఆమె జారీ చేసిన ఆదేశాలు ఇప్పుడు ఆమెను ఇరకాటంలో పడేశాయి. ఏడాది పాలనలో అవినీతి మచ్చ లేకుండా దేశాన్ని అభివృద్ధి చేశామని చెప్పుకుంటున్న ఎన్‌డీఏ సర్కారుకు ఇది పెద్ద సమస్యగా మారింది.
ఐపీఎల్ మాజీ చీఫ్ లలిత్ మోడీ అందరికీ గుర్తుండే ఉంటాడు. నాలుగేళ్ల క్రితం భారత్‌లో ఓ వెలుగు వెలిగిన లలిత్‌మోడీ ఇప్పుడు పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. అతడిపై రెడ్ కార్నర్ నోటీసు కూడా జారీ అయ్యింది. సుష్మాస్వరాజ్ వీసాకు సిఫార్సు చేసిన వ్యక్తి లలిత్‌మోడీయే కావడం గమనార్హం. ఇతడు లండన్ వెళ్లేందుకు సుష్మాస్వరాజ్ సహకరించినట్లు ఆరోపణ. ఇది వాస్తవమేనని అంగీకరించిన సుష్మాస్వరాజ్ కేవలం లలిత్‌మోడీ భార్యకు క్యాన్సర్ చికిత్స కోసం లండన్ వెళ్తానంటే తాను మానవథా థృక్పథంతో వీసా కోసం సిఫార్సు చేసినట్లు చెబుతున్నారు. అయితే రెడ్ కార్నర్ నోటీసులున్న వ్యక్తికి సుష్మా ఎలా వీసా కోసం సిఫార్సు చేస్తారంటూ కాంగ్రెస్ నాయకులు మండిపడుతున్నారు. పెద్ద మొత్తంలో ముడుపులు తీసుకొనే సుష్మా ఈ పనిచేసి ఉంటారనేది వారి ఆరోపణ.