తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అవినీతికి పాల్పడుతున్న నాయకులను, ప్రజాప్రతినిధులను ఏమాత్రం ఉపేక్షించడం లేదు. అందుకు డిప్యూటీ సీఎం రాజయ్యను పదవి నుంచి భర్తరఫ్ చేయడాన్ని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇక ఇప్పుడు మరో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కూడా భారీ మొత్తంలో లంచం డిమాండ్ చేసినట్లు లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ ఆరోపించడంతో ఎవరిపై వేటుపడనందోనన్న ఆసక్తి రాజకీయవర్గాల్లో నెలకొంది.
లోక్‌సత్త అధినేత జయప్రకాశ్‌నారాయణ మాట్లాడుతూ.. నగర శివారులోని ఓ ఫ్యాక్టరీకి నీటిని సరఫరా చేసేందుకు ఓ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే రూ. 2 కోట్లు లంచం అడిగినట్లు ఆరోపించారు. నగర శివారు అంటే మేడ్చల్, మల్కాజ్‌గిరి, పటాన్‌చెర్వు, భువనగిరి తదితర ప్రాంతాలు వస్తాయి. ఈ ప్రాంతాల్లోని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేనే ఈ లంచాన్ని డిమాండ్ చేసినట్లు జేపీ చెబుతున్నారు. మరి ఇక్కడ ఉన్న టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల్లో ఎవరు లంచం అడిగి ఉంటారని గులాబిదళంలో చర్చలు కొనసాగుతున్నాయి. తన వద్ద రుజువులు కూడా ఉన్నాయని జేపీ చెబుతుండటంతో కేసీఆర్ ఈ వ్యవహారాన్ని అంత ఈజీగా వదిలిపెట్టరని, కచ్చితంగా దర్యాప్తు జరిపిస్తారని వారు చెబుతున్నారు. మరి అప్పుడు ఏ ఎమ్మెల్యేకి పదవి గండం పొంచి ఉందోనని వారు చర్చించుకుంటున్నారు.