ఒకప్పుడు మోడీ అంటే కేసీఆర్ అగ్గిమీద గుగ్గిలమయ్యాడు. తెలంగాణ రాష్ట్రంలో తీవ్రంగా కరెంటు కోతలు ఉన్నా.. కనీసం కేంద్రం సాయం అడగటానికి కూడా కేసీఆర్ నోరువిప్పలేదు. అలా అడిగి తాను తక్కువ కాకుండా ఉండేందుకే టీ-ప్రజలను కేసీఆర్ కరెంటు కష్టాల్లో నెట్టారన్న విమర్శలు కూడా వినిపించాయి. అయితే ఇప్పుడు మాత్రం కేసీఆర్ వాయిస్‌లో చాలా తేడా వచ్చింది. మోడీ పేరు ఉచ్చిరించే సమయంలో గతంలోదానికి .. ఇప్పటిదానికి కేసీఆర్ వాయిస్ బేస్‌లో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది.
పాలమూరు ఎత్తిపోతల గురించి మాట్లాడే సమయంలో బాబును కేసీఆర్ తీవ్రంగా విమర్శించాడు. దీనికి కొత్తదనం లేకున్నా.. ఈ విమర్శల్లో మోడీ పేరు పాజిటివ్ కోణంలో వినిపించింది. చంద్రబాబు కేంద్రంతో మాట్లాడి తెలంగాణకు నీరు అడ్డుకోవాలని చూస్తున్నారని, అయితే మోడీ కేవలం ఏపీకే కాదని తమకు కూడా ప్రధానియేనని కేసీఆర్ సెలవిచ్చారు. దీన్నిబట్టి మోడీ తమకు కూడా మద్దతుగా నిలుస్తాడని కేసీఆర్ చెప్పకనే చెబుతున్నారు. మరి ఇదే మోడీని గతంలో తీవ్రంగా విమర్శించినప్పుడు కేసీఆర్‌కు ఈ ఆలోచన లేకుండా పోయిందా అని కాంగ్రెస్, టీడీపీ నాయకులు విమర్శిస్తున్నారు. ఇప్పుడు ఎలాగైన బీజేపీకి టీడీపీని దూరం చేసి టీఆర్‌ఎస్‌ను దగ్గర చేయాలన్న కోణంలోనే కేసీఆర్ ఎత్తులు వేస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి.