'బాణం' సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యి వైవిధ్యమైన సినిమాలలో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నాడు హీరో నారా రోహిత్. ప్రస్తుతం ఆయన కృష్ణ విజయ్ దర్శకత్వంలో 'అసుర' అనే చిత్రంలో నటించారు. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని జూన్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నారా రోహిత్ తో సినీజోష్ ఇంటర్వ్యూ..
సినిమా ఎలా ఉండబోతోంది..?
ఇదొక యాక్షన్, థ్రిల్లర్ సినిమా. కమర్షియల్ సినిమాలకు కావాల్సిన అన్ని హంగులు ఈ చిత్రానికి ఉన్నాయి. సినిమా స్టార్ట్ అయిన మొదటి ఇరవై నిమిషాలు, ఇంటర్వెల్ కు ముందు ఇరవై నిమిషాలు, క్లైమాక్స్ అధ్బుతంగా ఉంటాయి. ఇప్పటివరకు నేను చేసిన సినిమాలలో ఐటెం సాంగ్ అనేది లేదు కాని ఈ సినిమాలో ఐటెం సాంగ్ కూడా ఉంది. పక్కా కమర్షియల్ సినిమా ఇది.
సినిమాలో మీ పాత్ర గురించి..?
ఈ చిత్రంలో ధర్మ అనే ఓ జైలర్ పాత్ర పోషించాను. పని విషయంలో రాక్షసుడైన ఆ పోలీస్ ఎంతకైనా తెగిస్తాడు. నేను చేసిన సినిమాలలో 'అసుర' ఒక భిన్నమైన చిత్రంగా నిలుస్తుంది. నేను నటించే చిత్రాలు యునీక్ గా ఉండాలని భావిస్తాను. 'రౌడీఫెలో' చిత్రంలో ఓ రకమైన యాటిట్యూడ్ ఉన్న పాత్రలో నటిస్తే ఈ సినిమాలో కోపంగా ఉంటూ బేస్ ఎక్కువగా ఉపయోగించే పాత్రలో నటించాను. నా నుండి ప్రేక్షకులు ఎలాంటి సినిమా ఎక్స్ పెక్ట్ చేస్తారో 'అసుర' ఆ విధంగానే ఉంటుంది.
మొదటిసారి సినిమాను ప్రొడ్యూస్ చేయడం ఎలా అనిపించింది..?
నేను నటుడ్ని కాకపొయుంటే ఖచ్చితంగా నిర్మాతనయ్యేవాడిని. సినిమాలంటే నాకు మొదటి నుండి చాలా ప్యాషన్ ఉంది. ఎప్పటినుండో సినిమాలను ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నాను. ఈ సినిమా ప్రొడక్షన్ లో నేను ఎక్కువ కష్టపడలేదు. ప్రీ ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు మాత్రమే నేను చూసుకున్నాను. ఎగ్జిగ్యూషన్ పార్ట్ అంత విజయ్ చూసుకున్నారు.
డైరెక్టర్ కృష్ణవిజయ్ గురించి..?
కృష్ణవిజయ్ తో 'బాణం' సినిమా టైం నుండి ట్రావెల్ అవుతూ వస్తున్నాను. ఆయనతో 'మద్రాసి' అనే ఓ చిత్రం చేయాలనుకున్నాను. కాని కొన్ని కారణాల వలన చేయడం కుదరలేదు. విజయ్ 'అసుర' స్క్రిప్ట్ కు నేను న్యాయం చేయగలనని నా దగ్గరకు వచ్చి కథ నేరేట్ చేసాడు. స్క్రిప్ట్ నాకు చాలా నచ్చింది. కథకు అనుగుణంగా ఉండేలా ఎక్కువగా పాత బంగ్లాలు ఉన్న చోట షూట్ చేసాం. 50 రోజులలో షూటింగ్ కంప్లీట్ చేసాం. ఈ సినిమా అందరికి కనెక్ట్ అవుతుంది.
హీరోయిన్ ప్రియబెనర్జి గురించి..?
ప్రియాబెనర్జీ 'జోరు' , 'కిస్' సినిమాలలో నటించింది. సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేస్తుంది. తెలుగు రాకపోయినా నేర్చుకొని డైలాగ్స్ చెప్పింది.
సిక్స్ ప్యాక్ చేయాలనే ఆలోచన ఉందా..?
రౌడీఫెలో సినిమా షూటింగ్ సమయంలోనే అసుర షూటింగ్ సగం అవ్వడం వలన అలానే నటించాను. నేను తదుపరి నటించే చిత్రాల్లో సిక్స్ ప్యాక్ తో కనిపించాలనే ఆలోచన అయితే ఉంది.
మీ పెదనాన్నగారు మీరు నటించే సినిమాలు చూస్తారా..?
'ప్రతినిధి' , 'రౌడీఫెలో' సినిమాల రిలీజ్ టైంలో ఆయన ఎలక్షన్స్ లో బిజీ గా ఉండడం వలన చూడలేకపోయారు. నా మిగిలిన చిత్రాలన్నీ ఆయన చూసారు. నా సినిమాలలో కమర్షియల్ ఎలిమెంట్స్ తగ్గాయని ఓ కమర్షియల్ సినిమాలో నటించమని చెప్పారు.
నెక్స్ట్ ప్రాజెక్ట్స్..?
'పండగలా వచ్చాడు' చిత్రంలో నటిస్తున్నాను. 'అసుర' కు ముందే ఆ చిత్రం రిలీజ్ కావాలి కాని షూటింగ్ పార్ట్ బాలెన్స్ ఉండడం వలన ఆగస్ట్ లో రిలీజ్ చేయాలనుకుంటున్నాం. అదొక ఫ్యామిలీ ఎంటర్ టైన్మెంట్ తో కూడిన ప్రేమ కథ. 'శంకర' అనే మరో చిత్రంలో నటిస్తున్నాను. ఈ రెండు కాకుండా శ్రీవిష్ణు నేను కలిసి ఓల్డ్ సిటీ బ్యాక్ డ్రాప్ లో జరిగే ఓ చిత్రంలో నటించనున్నాం.