సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ 73వ జన్మదిన వేడుకలు అభిమానుల మధ్య నాగారంలోని పద్మాలయ స్టూడియోలో వైభవంగా జరిగాయి. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో కృష్ణ కేకు కోసిన అనంతరం అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ చాలా సంవత్సరాల తర్వాత హైదరాబాద్ లో పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నానని, తనను తన కుటుంబాన్ని ఆదరిస్తున్న అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. బ్రహ్మోత్సవం సినిమా టాలీవుడ్ రికార్డులను తిరగ రాయాలని కాంక్షించారు. తమ కుటుంబం నుండి కొత్త వారసులు వస్తున్నారని వారిని ఆదరించాలని కోరారు.
విజయనిర్మల మాట్లాడుతూ "అభిమానుల మధ్య కృష్ణ గారు ఈ వేడుక జరుపుకోవడం సంతోషంగా వుందని, అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి కృష్ణ అని అన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన నిర్మాత కె.ఎస్.రామారావు, కెసి శేఖర్ బాబు తదితర సినీ ప్రముఖులు తెలుగు చిత్ర సీమలో కృష్ణ గారు చేసిన సాహసాలను మననం చేసుకుని, ఆయనతో వారికి గల అనుబందాన్ని గుర్తు చేసుకున్నారు".
14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ నిర్మాతలు రామ్ ఆచంట, గోపి ఆచంట, అనిల్ సుంకర, మహిళా దర్శకురాలు బి.జయ ఈ వేడుకకు హాజరయ్యారు. ఆలిండియా కృష్ణ అభిమానుల సంఘం అధ్యక్షుడు దిడ్డి రాంబాబు కృష్ణ అభిమానులకు నేడు పండుగ దినమని, ఆయన పేరు మీద సేవా కార్యక్రమాలు చేస్తున్నామని, త్వరలో ఆయనపై ఒక పుస్తకం తీసుకురానున్నమన్నారు. అనంతరం అభిమానులు కృష్ణ గారికి గజ మాలలతో, దుశ్శాలువాలతో సత్కరించారు.
Advertisement
CJ Advs