తెలుగు రాష్ట్రాలలో ఎండ మండిపోతోంది. మృతుల సంఖ్య పెరిగిపోతోంది. తాగడానికి నీళ్ళులేక, హీట్ వేవ్ తట్టుకోలేక పశుపక్ష్యాదులు గుంపులు గుంపులుగా నేలరాలుతున్నాయి. పంటచేలు నిలువునా మాడిపోతున్నాయి. రైతు గుండెపగిలి నేలకూలిపోతున్నాడు. జన జీవనం స్తంభించింది. ప్రకృతి ఆగ్రహిస్తే పరిస్థితి ఎంత భయానకంగా వుంటుందో అనుభవంలోకి వచ్చింది. ఈ స్ధితిలో ప్రభుత్వం చేయవలసింది చాలా వుంది. మంచినీటి సరఫరా, వడదెబ్బ తగిలినవారికి సంచార వైద్యాలయాలు, పశువులు పక్షుల సంరక్షణకు తీసుకోవలసిన జాగ్రత్తలు, ఆహార పానీయాల విషయంలో అప్రమత్తంగా వుండవలసిన అవసరం, వస్త్ర ధారణలో మెలకువలు వగైరా వగైరా కార్యక్రమాలను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలి. కానీ అధికార తెలుగుదేశం పార్టీ మహానాడు పేరుతో వేలాదిమందిని పోగుచేయడానికి, వారికి వసతులు కల్పించడానికి, బల ప్రదర్శనకు వేదికగా వాడుకోవడానికి మునిగిపోయివుంది. రాజధాని విషయమై అధికార పక్ష్యాన్ని దుమ్మెత్తి పోయడానికే ప్రతిపక్షం పరిమితమయింది గాని ప్రజా సంక్షేమాన్ని వడగాల్పులకి విడిచేసింది. కామ్రేడ్లు కలిసిపోతే ఆస్తి హక్కు ఎవరికని ఆలోచిస్తున్నారేగాని బడుగుల గురించి ఆలోచనే చేయడంలేదు. కేంద్రంలో అధికారంలోనున్న మోదీ ప్రభుత్వం ఏడాదిపాలన గురించి చంకలు గుద్దుకుంటున్నదేగాని కన్నెర్రజేసిన సూర్యభగవానుని గురించి ఆలోచించడంలేదు. ఏతావాతా మిగిలింది సినిమా నటులు.
తారలు తమ సినిమాల విడుదల సందర్భంగా అన్ని ఛానల్స్‌కి ఓపిగ్గా గంటల తరబడి ప్రమోషన్ కార్యక్రమాలని సమర్పిస్తున్నారు గాని ఈ ఆపద సమయంలో ప్రజలు చేయకూడనివి చేయాల్సినవి ఏమిటో చెప్పడంలేదు. ప్రజాహిత కార్యక్రమాలకు ముందుండే చిరంజీవి, నాగార్జున, పవన్ కళ్యాణ్, రాజేంద్రప్రసాద్ వంటి తారలు ఎందుకు ముందుకు రావడంలేదో అర్ధంకావడంలేదు. దాసరి ఈ మధ్య ఓపిగ్గా సినిమా కార్యక్రమాలకు హాజరవుతున్నారు. రచయిత, దర్శకుడు, నిర్మాత, నటుడు, గేయరచయిత అయిన దాసరికి కూడా భగభగలాడుతున్న భువన మండలం కనిపించకపోవడం మన దురదృష్టం. మూగజీవాల కోసం తపించే అమల కూడా....
- తోటకూర రఘు