తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. రోజుకో తీరుగా మారుతున్న సమీకరణలతో ఎవరు గెలుస్తారనేది ఆసక్తికరంగా మారింది. మహానాడు ముగిసిన మరుసటి రోజే తెలంగాణలో టీడీపీపి పెద్ద దెబ్బ తగిలింది. ఆ పార్టీ కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు టీఆర్‌ఎస్‌లో చేరడం ఖాయమైంది. శనివారం సాయంత్రం ఆయన సీఎం కేసీఆర్‌తో సమావేశం కావడంతో టీఆర్‌ఎస్‌లో ఆయన చేరిక ఖాయమైన్నట్లు కనిపిస్తోంది.
గతంలోనే మాధవరం కృష్ణారావు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు. అయితే సీమాంధ్రులు అధికంగా ఉన్న ఓ వర్గాన్ని బీసీ జాబితాలోనే కొనసాగిస్తానని సీఎం కేసీఆర్ హామీ ఇస్తే టీఆర్‌ఎస్‌లో చేరడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పాడు. ఆ తర్వాత ఈ ప్రతిపాదనపై రెండువర్గాలు మిన్నకుండిపోయాయి. ఉన్నట్టుండి మళ్లీ ఇప్పుడు ఆయన సీఎం కేసీఆర్‌తో భేటీ కావడం ప్రాధాన్యత సంచరించుకుంది. అదీ ఎమ్మెల్సీ ఎన్నికల ముందు జరగడంతో టీడీపీ కృష్ణారావుపై ఆశలు వదులుకుంది. మరి కృష్ణారావు డిమాండ్ చేసిన కులాన్ని బీసీ జాబితాలోనే కొనసాగించడానికి సీఎం కేసీఆర్ హామీనిచ్చారా..? లేదా అనేది తేలాల్సి ఉంది. ఇక రోజురోజుకూ టీడీపీ అభ్యర్థి ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవడం కష్టంగా మారుతున్నట్లు కనిపిస్తోంది.