ప్రస్తుతం తెలంగాణలో ఉస్మానియా భూములపై పెద్ద రచ్చ జరుగుతోంది. ఈ భూముల్లో పేదలకు ఇళ్లు నిర్మిస్తానని కేసీఆర్ ప్రకటించడమే తర్వాయి విద్యార్థులు ఆందోళనలకు దిగారు. విద్యార్థులకు మెచ్యురిటీ లేదని, వారి అయ్యలు వచ్చి చెప్పినా తాను ఉస్మానియా యూనివర్సిటీ భూముల్లో పేదలకు ఇళ్లు కడతానని చెప్పి కేసీఆర్ ఓయూ విద్యార్థులను మరింత రెచ్చగొట్టారు. దీనికితోడు ప్రతిపక్షాలు కూడా విద్యార్థులకు అండగా నిలిచి ఓయూ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే చూస్తూ ఉరుకునేది లేదని హెచ్చరించాయి. ఇక ఓయూ విద్యార్థులు రోజూ కేసీఆర్, టీఆర్‌ఎస్ ప్రభుత్వాల దిష్టిబొమ్మలు తగులబెడుతూ రచ్చ చేస్తున్నారు. దీంతో టీఆర్‌ఎస్ ప్రభుత్వం వెనక్కి తగ్గినట్లు కనిపిస్తోంది.
శనివారం మీడియాతో సమావేశమైన తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. ఓయూ భూములను ఎవరూ లాక్కోరని స్పష్టం చేశారు. అనవసరంగా ప్రతిపక్షాలే విద్యార్థులను రెచ్చగొడుతున్నాయని విమర్శించారు. ఈ నాయకులంతా ఇంతకుముందు ఓయూ భూములు కబ్జాకు గురవుతుంటే ఎక్కడున్నారని ప్రశ్నించారు. ఇక నాయిని వ్యాఖ్యలను బట్టి ఓయూ భూముల్లో ఇళ్ల నిర్మాణంపై ప్రభుత్వం వెనక్కి తగ్గినట్లు కనబడుతోంది. ఓయూ విద్యార్థులతో పెట్టుకుంటే కొరివితో తలగొక్కునట్టేనని పలువురు కేసీఆర్‌కు మీడియా సమక్షంలో సలహా ఇచ్చారు. ఇక ఇప్పుడు సర్కారు వెనక్కి తగ్గడం చూస్తే కేసీఆర్ అది నిజమేనని భావించినట్లు కనిపిస్తోంది.