ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక స్థానం గెలిచే అవకాశం ఉంది. ఈ ఒక్క సీటు కోసం పార్టీలో దాదాపు 40 మంది పోటీపడ్డారు. మాజీ మంత్రులు పొన్నాల, దానం, డీఎస్ తదితర ప్రముఖులు ఈ స్థానం కోసం పోటీపడ్డారు. అయితే అధిష్టానం మాత్రం ఈ సీటుకు ఆకుల లలితను ఎంపిక చేసి అందరికీ షాక్‌నిచ్చింది. ఇక ఎమ్మెల్సీ సీటు రాకున్నా మిగిలిన నాయకులు సర్దుకుపోగా దానం నాగేందర్ మాత్రం పార్టీ వీడుతానంటూ అలకబూనాడు. ఆనాటి నుంచి కూడా ఆయన పార్టీకి సంబంధించి ఏ కార్యక్రమంలోనూ పాల్గొనలేదు. ఇక జీహెచ్‌ఎంసీలో బలమైన నాయకుడిగా ఉన్న దానంను వదులుకోవడం ఇష్టంలేక కాంగ్రెస్ అధిష్టానం బుజ్జగింపు చర్యలకు దిగింది.
శుక్రవారం కాంగ్రెస్ మహామహులు గులాంనబీ ఆజాద్, వయాలర్ రవి, పీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ బట్టి విక్రమార్క తదితరులు దానం నాగేందర్ ఇంటికి వెళ్లి ఆయన్ను బుజ్జగించారు. పార్టీని వీడవద్దని, ఎమ్మెల్సీ సీటు దక్కకపోయినా మరో సముచిత స్థానం కల్పిస్తామని వారు దానంను బుజ్జగించినట్లు సమాచారం. ఎలాంటి పరిస్థితుల్లో ఆకుల లలితకు అవకాశం ఇచ్చింది వారు ఆయనకు వివరించినట్లు తెలిసింది. మరి వీరి బుజ్జగింపులకు దానం దిగివచ్చారా..? లేక ఇంకా రాజీనామా యోచనలోనే ఉన్నారా..? అనేది మరికొన్నాళ్లు ఆగితే తెలుస్తుంది.