పధానిగా ఉన్నప్పుడు అవినీతి మచ్చ పడని రాజకీయవేత్తగా పేరుతెచ్చుకున్న మన్‌మోహన్‌సింగ్ ప్రస్తుతం తీవ్ర అప్రతిష్టను మూటగట్టుకుంటున్నాడు. యూపీఏ హయాంలో వెలుగుచూసిన స్కాంలకు మన్‌మోహన్‌సింగే కారణమంటూ ఆయన కాలంలో ఉన్నతాధికారులుగా పనిచేసిన పలువురు ఉద్యోగ విరమణ తర్వాత పుస్తకాలు రాసి మరీ ఆయన్ను విమర్శిస్తున్నారు. తాజాగా ట్రాయ్(టెలీకాం రెగ్యులెటరీ అథారిటీ చైర్మన్) ప్రదీప్ బైజాల్ మాజీ ప్రధాని మన్‌మోహన్‌సింగ్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు.
ప్రదీప్ బైజాల్ ఇటీవలే రాసిన 'కంప్లీట్ స్టోరీ ఆఫ్ ఇండియన్ రిఫార్మ్స్' అనే పుస్తకంలో మన్‌మోహన్‌సింగ్ అసమర్థత వల్లే తాము ఇప్పుడు సీబీఐ విచారణను ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. టెలీకాం మంత్రిగా దయానిధి మారన్ నియమాకాన్ని తాను తీవ్రంగా వ్యతిరేకించానని, అయినా మన్‌మోహన్ పట్టించుకోలేదని ఆరోపించాడు. అంతేకాకుండా తాను చెప్పినట్లు వినపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయంటూ దయానిధి మారన్ పలుమార్లు తనను హెచ్చరించినట్లు చెప్పారు. మన్‌మోహన్ వల్లే తనలాంటి అధికారులు ప్రస్తుతం ఇబ్బందుల్లో పడ్డారన్నారు. అయితే ప్రదీప్ తన పుస్తకాలు అమ్ముడుపోవాలనే ఇలా మన్‌మోహన్‌పై అసత్య ఆరోపణలు చేశాడంటూ కాంగ్రెస్ నాయకులు విమర్శిస్తున్నారు.