ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ వారు తమకు అనుగుణంగా కార్యక్రమాలు నిర్వహించడానికి ఓ నూతన కన్వెన్షన్ సెంటర్ ను నిర్మించారు. ఈ భవన ప్రారంభోత్సవ వేడుక సినిమాటోగ్రఫిక్ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ చేతుల మీదుగా ఆదివారం హైదరాబాద్ లో జరిగింది. ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ "కల్చరల్ సెంటర్ వారు వారి సభ్యుల కోసం ఇలా ఓ భవనాన్ని నిర్మించుకోవడం సంతోషంగా ఉంది. సినిమాకు సంబంధించిన నిర్మాతలు వారి సినిమాల ప్రమోషన్స్ కోసం బయట నిర్వహించే కార్యక్రమాలు అతి తక్కువ ఖర్చుతో వారికి సంబంధించిన కార్యక్రమాల కోసం ఈ భవనాన్ని నిర్మించడాన్ని అభినందిస్తున్నాను. సినిమా రంగం హైదరాబాద్ లో రావడానికి ఎందరో పెద్దలు కృషి చేశారు. హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దడానికి ముఖ్యమంత్రి కెసిఆర్ గారు కొన్ని కార్యక్రమాలు చేపట్టనున్నారు. అలానే ఫిలిం ఇండస్ట్రీను డెవలప్ చేయడానికి కూడా పూనుకున్నారు. ఇండస్ట్రీ నాకు కుటుంబం లాంటిది. ఓ కుటుంబ సభ్యుడిగా ఏం సమస్య వచ్చినా నేను మహేందర్ రెడ్డి గారు అండగా నిలబడతాం" అని అన్నారు.
కె.ఎస్.రామారావు మాట్లాడుతూ "నాలుగువేల మంది సభ్యులున్న ఈ కన్వెన్షన్ సెంటర్ లో వారికి సంబంధించిన కార్యక్రమాలు తక్కువ ఖర్చుతో నిర్వహించుకోవచ్చు. ఈ సెంటర్ ను చుసిన కమల్ హాసన్ గారు ఆయన సినిమా ప్రారంభోత్సవ వేడుక ఇక్కడే నిర్వహిస్తామని చెప్పారు. అలానే తెలంగాణా ప్రభుత్వం థియేటర్ల విషయంలో కేర్ తీసుకోవాలి. తెలుగు చలన చిత్ర పరిశ్రమను మరింత అభివృద్ధి పరచాదానికి కొంత భూమిని కేటాయించాలని ఆశిస్తున్నాను" అని చెప్పారు.
మహేందర్ రెడ్డి మాట్లాడుతూ "ఈ కన్వెన్షన్ నిర్మించిన వారందరికీ నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇండస్ట్రీ బాగు కోసం ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకుంటుంది" అని చెప్పారు.